![]() |
![]() |

'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ.. మైథలాజికల్ ఫాంటసీ డ్రామాగా రూపొందనుందని సమాచారం. (Prabhas)
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో 'బ్రహ్మరాక్షస' అనే సినిమాని ప్లాన్ చేశాడు ప్రశాంత్ వర్మ. కానీ, ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో అదే 'బ్రహ్మరాక్షస' కథను ప్రభాస్ తో చేస్తున్నట్లు మొదట ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరో కథ తెరపైకి వచ్చింది.
ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ చేస్తున్నది 'బ్రహ్మరాక్షస' కాదట. వీరి కాంబినేషన్ లో రానున్న సినిమాకి 'బకా' అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మహాభారతంలోని బకాసురుడు అనే రాక్షసుడి పాత్ర ఆధారంగా ప్రశాంత్ వర్మ ఈ కథ రాసుకున్నట్లు సమాచారం. (Prabhas as Bakasura)
హిందూ పురాణాల ప్రకారం.. బకాసురుడు ఒక పెద్ద రాక్షసుడు. బండెడు తిండి తింటాడనే పేరుంది. అతని ఆకలికి మనుషులలైనా ఆహరం అవ్వాల్సిందే. అంతటి భయంకర రాక్షసుడైన బకాసురుడు.. భీముడితో జరిగిన భీకర యుద్ధంలో మరణించాడు. మరి ఇప్పుడు బకాసురుడు పాత్ర ఆధారంగా ప్రశాంత్ వర్మ కథ రాసుకున్నాడన్న వార్తల నేపథ్యంలో.. ప్రభాస్ బకాసురుడిగా కనిపిస్తాడా? లేక భీముడిగా కనిపిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. 'బకా' అనే టైటిల్ ను బట్టి చూస్తే.. ప్రభాస్ బకాసురుడిగా కనిపించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ వర్మ.. బకాసుర పాత్ర ఆధారంగా నెగటివ్ షేడ్స్ ఉన్న ఫిక్షనల్ క్యారెక్టర్ ఏమైనా రాసుకున్నాడేమో చూడాలి.
గతేడాది ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమా కూడా మైథలాజికల్ టచ్ తో రూపొందింది. మహాభారతంలోని పాత్రల ఆధారంగా.. ఫిక్షనల్ కథను రాసుకున్నారు. 'కల్కి' చిత్రంలో ప్రభాస్ కర్ణుడిగా కనిపించి మెప్పించాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమా సైతం.. మహాభారతంలోని బకాసుర పాత్ర ఆధారంగా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన రాబోయే రోజుల్లో.. మహాభారతంలోని పాత్రలన్నీ ప్రభాస్ పోషించేలా ఉన్నాడు.
![]() |
![]() |