Home  »  News  »  తెలుగు సినిమాకు కొత్త తలనొప్పి.. చిన్న సినిమాలకే ఈ పరిస్థితి ఎందుకు?

Updated : Feb 17, 2026

 

ఉన్న సమస్యలు చాలవన్నట్టు తెలుగు సినిమా కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. కొన్ని సినిమాలు విడుదలకు ముందు చివరి నిమిషంలో టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. (Telugu Cinema)

 

సినిమాలో కొన్ని సన్నివేశాలు లేదా కొన్ని సంభాషణలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడం చూస్తుంటాం. అయితే ఇటీవల టైటిల్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. దీంతో పలు సినిమాలు చివరి నిమిషంలో టైటిల్స్ మార్చుకుంటున్నాయి.

 

అప్పట్లో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాకి మొదట 'వాల్మీకి' అనే టైటిల్ పెట్టగా.. సెన్సార్ నుంచి అభ్యంతరం రావడంతో దానిని 'గద్దలకొండ గణేష్'గా మార్చారు. ఇక ఇటీవల ఈ టైటిల్స్ మార్పు అనేది చాలా కామన్ అయిపోయింది.

 

సెన్సార్ అభ్యంతరం తెలపడంతో 'వానర' కాస్తా 'వనవీర'గా, 'శ్రీ చిదంబరం' కాస్తా 'శ్రీ చిదంబరం గారు'గా, 'చాయ్ వాలా' కాస్తా 'నవాబ్ కేఫ్'గా మారాయి. ఇక తాజాగా 'హే భగవాన్' కూడా 'హే బల్వంత్'గా మారింది. బలవంతంగా తమ సినిమా టైటిల్ మార్పించారు అనేలా సెటైరికల్ గా ఆ టైటిల్ ఉండటం విశేషం. (Hey Bhagawan)

 

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైన 'కపుల్ ఫ్రెండ్లీ'కి కూడా ఈ పరిస్థితి ఎదురైంది. టైటిల్ పై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. అయితే అప్పటికే ప్రమోషన్స్ చేశామని, చివరి నిమిషంలో టైటిల్ మారిస్తే నష్టమని భావించి మేకర్స్ టైటిల్ మార్చడానికి అంగీకరించలేదు. దాంతో సెన్సార్ A సర్టిఫికెట్ ఇచ్చింది. (Couple Friendly)

 

A సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వసూళ్లపై ప్రభావం పడిందని 'కపుల్ ఫ్రెండ్లీ'ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన ధీరజ్ మొగిలినేని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు సెన్సార్ బోర్డు కేంద్రం పరిధిలో ఉంటుందని, ఎవరైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ విషయంలో చొరవ తీసుకుంటే బాగుంటుందని ధీరజ్ అన్నారు.

 

ప్రస్తుతం ఈ టైటిల్స్ మార్పు గురించి అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు సినీ అభిమానుల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఎవరినైనా కించపరిచేలాగానో, ఎవరి మనోభావాలైనా దెబ్బతినేలాగానో ఉంటే టైటిల్ పై అభ్యంతరం తెలపడం సమంజసమే. వివాదాస్పదం కాని టైటిల్ ను కూడా మార్చాల్సి రావడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

 

టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి చివరి వరకు అదే టైటిల్ తో ప్రమోషన్ చేస్తారు. మెజారిటీ సినిమాలు విడుదల వారంలోనే సెన్సార్ కి వెళ్తుంటాయి. అలాంటి సమయంలో టైటిల్ మార్చడం అనేది ఇబ్బంది కరమే. అప్పటికప్పుడు టైటిల్ మార్చి, మళ్ళీ ప్రమోషన్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. అందుకే టైటిల్ పై ఏదైనా అభ్యంతరం ఉంటే.. రిజిస్ట్రేషన్ సమయంలోనే తెలుసుకునేలా సెన్సార్ ఏదైనా కొత్త విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

 

ప్రస్తుతానికి ఈ టైటిల్ మార్పు సెగ చిన్న సినిమాలకే తగిలింది. భవిష్యత్తులో పెద్ద సినిమాలకు కూడా తగులుతుందేమో చూడాలి. ఈ లోపు సినీ పెద్దలు ఎవరైనా రంగంలోకి దిగి పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.