![]() |
![]() |

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగిన సినిమా అంటే 'సన్ ఆఫ్ ఇండియా' అని చెప్పొచ్చు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ఈ సినిమా శుక్రవారం(ఫిబ్రవరి 18 న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అలా ట్రోల్ అవుతూనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటిరోజు దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది.
నటుడిగా, నిర్మాతగా మోహన్ బాబు గతంలో ఎన్నో ఘన విజయాలు అందుకున్నారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 500 కి పైగా సినిమాలు చేసి సత్తా చాటారు. అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు వంటి సినిమాలతో సంచలన విజయాలను అందుకొని కలెక్షన్ కింగ్ గా ఎదిగారు. అయితే అదంతా ఒకప్పటి మాట. ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు లక్షల్లో కలెక్షన్స్ సాధించలేక ట్రోల్ కి గురవుతున్నారు.
సన్ ఆఫ్ ఇండియా సినిమా మొదటి రోజు రూ.6 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అంతేకాదు ప్రేక్షకులు థియేటర్స్ కి రాకపోవడంతో వందకి పైగా షోలు క్యాన్సిల్ అయ్యాయని సమాచారం. మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో కొంతకాలంగా ట్రోల్స్ వస్తున్నాయి. మా ఎన్నికలు, సినీ రాజకీయ పరమైన వ్యాఖ్యలు వంటివి ఈ ట్రోల్స్ కి కారణమయ్యాయని అంటున్నారు. అదే శుక్రవారం విడుదలైన 'సన్నాఫ్ ఇండియా' సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉన్న మోహన్ బాబు లాంటి సీనియర్ హీరో సినిమాకి మొదటి రోజు కేవలం ఆరు లక్షల కలెక్షన్స్ రావడమనేది ఘోర అవమానమని చెప్పొచ్చు. మరి మంచు ఫ్యామిలీ ఈ షాక్ తోనైనా ఆలోచనలో పడి, ఈ పరిస్థితికి కారణం తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపడుతుందేమో చూడాలి.
![]() |
![]() |