![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రాధే శ్యామ్'. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022, జనవరి 14న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ సరిగా ఇవ్వడంలేదంటూ యూవీ క్రియేషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు సూసైడ్ చేసుకుంటామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన మేకర్స్.. తాజాగా 'రాధే శ్యామ్' అప్డేట్ ఇచ్చారు.
ప్రభాస్ ఫ్యాన్ పేరుతో రాసిన సూసైడ్ నోట్ ఒకటి రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 'రాధే శ్యామ్' కి సంబంధించిన అప్డేట్స్ సరిగ్గా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ప్రభాస్ ఫ్యాన్ యావీ క్రియేషన్స్ కి సూసైడ్ లెటర్ రాసినట్లుగా ఆ నోట్ లో ఉంది. "నా చావుని చూసైనా రాధే శ్యామ్ అప్డేట్ ఇస్తారని అనుకుంటున్నాను. చాలా వెయిట్ చేపించారు. మేం వెయిట్ చేశాం. ఇక చాలు సార్. నా చావుకి యూవీ క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కారణం. దయచేసి ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోకండి" అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్ సూసైడ్ నోట్ రాశాడు. అయితే సూసైడ్ నోట్ వైరల్ అయిన గంటల్లోనే యూవీ క్రియేషన్స్ రియాక్ట్ అయింది. 'రాధే శ్యామ్' నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది.

'ఈ రాతలే' అంటూ సాగే 'రాధే శ్యామ్' ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోని నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సాంగ్ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఎట్టకేలకు 'రాధే శ్యామ్' అప్డేట్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సూసైడ్ నోట్ రాస్తేనే గానీ అప్డేట్ రాలేదంటూ సెటైర్స్ వేస్తున్నారు.
![]() |
![]() |