![]() |
![]() |

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కలిశాడు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన విష్ణు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల సీఎం జగన్ తో జరిగిన సినీ ప్రముఖుల భేటీకి తన తండ్రి మోహన్ బాబుని ప్రభుత్వం ఆహ్వానించిందని, కానీ ఆహ్వానం అందకుండా కొందరు అడ్డుకున్నారని విష్ణు అన్నాడు.
"ఇది నా పర్సనల్ విజిట్. జగన్ అన్నతో లంచ్ చేయడానికి వచ్చాను. మా మధ్య సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. తిరుపతిలో స్టూడియోలు కడతాను. ఇప్పుడు ఆ పని మీద రాలేదు. ప్రభుత్వ సహకారం అడగటానికి మళ్ళీ వస్తాను. అలాగే ఏసియాలోనే బెస్ట్ పిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ వివరాలను త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి తెలియచేస్తాను. సినిమా వాళ్ళకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు. వైజాగ్ లో అవకాశాలు కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి అందరం చర్చించి, కొంతమేర ఎలా షిఫ్ట్ చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం." అని విష్ణు చెప్పాడు.
"మొన్న జరిగిన మీటింగ్ కి నాన్న గారితో పాటు మరికొందరు పెద్ద హీరోలకు ఇన్విటేషన్ పంపామని పేర్ని నాని చెప్పారు. నాన్న గారిని పిలవలేదు అనేది మాత్రం దుష్ప్రచారం. ఎందుకంటే ఆయన సీనియర్ యాక్టర్, లెజెండరీ యాక్టర్స్ లో ఒకరు. ఆయనను ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ కొందరు ఆ ఇన్విటేషన్ నాన్న గారికి అందకుండా చేశారు. దీని వెనక ఎవరున్నారో తెలుసు, కానీ అది మా అంతర్గత వ్యవహారం. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం. అందులో కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ ఉండొచ్చు. వాటిని మేం చర్చించుకొని కరెక్ట్ చేసుకుంటాం." అని విష్ణు చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |