![]() |
![]() |

అటు బాలనటుడిగానూ, ఇటు కథానాయకుడిగానూ స్టార్ డమ్ చూసిన ఘనత సూపర్ స్టార్ మహేశ్ బాబుది. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అడుగుజాడల్లోనే నడుస్తూ.. అటు మాస్ ని, ఇటు క్లాస్ ని అలరిస్తూ ముందుకు సాగుతున్న మహేశ్ కి జూలై 30 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. సరిగ్గా 22 ఏళ్ళ క్రితం అంటే 1999లో ఇదే జూలై 30న కథానాయకుడిగా వెండితెరపై తొలి అడుగులు వేశారు మహేశ్.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్దేశకత్వం - స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ నిర్మాణం - మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతం.. వెరసి మహేశ్ తొలి చిత్రం `రాజకుమారుడు`పై ఆది నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే తొలి ఆట నుంచే `రాజకుమారుడు` మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. తన నటనతో, నర్తనంతో, పోరాటాలతో అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులను కూడా అలరించి తన హీరోయిజంతో మెప్పించారు మహేశ్. ఇక సినిమా ఫ్లాష్ బ్యాక్ లో మహేశ్ తండ్రిగా సూపర్ స్టార్ కృష్ణ పోషించిన అతిథి పాత్ర సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది.
78 ప్రింట్లతో 116 కేంద్రాలలో విడుదలైన `రాజకుమారుడు`.. 80 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవాన్ని, 44 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. హీరోగా మహేశ్ బాబు సక్సెస్ ఫుల్ ఫిల్మ్ జర్నీకి బలమైన పునాదిని వేసింది.
![]() |
![]() |