![]() |
![]() |

సామాజిక సందేశంకి వాణిజ్యాత్మక అంశాలను జోడించి ఘనవిజయాలు అందుకోవడంలో దిట్ట ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చే పేరు సంచలన దర్శకుడు శంకర్. టెక్నిక్, టెక్నాలజీ.. ఈ రెండింటిని సమపాళ్ళలో రంగరించి సెన్సేషన్స్ క్రియేట్ చేసే డైరెక్టర్ ఎవరయ్యా? అంటే దానికీ సమాధానం శంకర్ నే. పాటలను భారీ స్థాయిలో తెరకెక్కించడమే కాదు వాటిలోనూ కథలను, పాత్రల తీరుతెన్నులను చక్కగా ఆవిష్కరించడంలోనూ శంకర్ కి సాటెవ్వరు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా.. విజువల్ వండర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శంకర్ కి జూలై 30 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. సరిగ్గా 28 ఏళ్ళ క్రితం అంటే 1993లో ఇదే జూలై 30న ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా `జెంటిల్ మేన్` విడుదలైంది.
యాక్షన్ కింగ్ అర్జున్ టైటిల్ రోల్ లో నటించిన ఈ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాకుండా 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులను, 4 తమిళనాడు స్టేట్ అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులోనూ `జెంటిల్ మేన్` పేరుతో అనువాదమై ఇక్కడా కాసుల వర్షం కురిపించింది. అలాగే హిందీలో `ది జెంటిల్ మేన్` (1994) పేరుతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ అయింది.
అర్జున్ కి జోడీగా మధుబాల నటించిన ఈ సినిమాలో శుభశ్రీ, వినీత్, చరణ్ రాజ్, నంబియార్, మనోరమ, గౌండమణి, సెంథిల్, రాజన్ పి. దేవ్, అజయ్ రత్నం ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా పాపులర్ సాంగ్ `చికుబుకు చికుబుకు రైలే`లో ప్రభుదేవా, గౌతమి తళుక్కున మెరిశారు.
ఎ.ఆర్. రెహమాన్ సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక నేపథ్యసంగీతం సరేసరి. జీవా ఛాయాగ్రహణం, కేటి కుంజుమోన్ నిర్మాణవిలువలు.. `జెంటిల్ మేన్`కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. శంకర్ కెరీర్ కి బలమైన పునాదిగా నిలిచి అతని విజయవంతమైన సినీ ప్రస్థానానికి నాంది పలికింది. నేటితో శంకర్ అందించిన ఈ తొలి అద్భుతం 28 వసంతాలు పూర్తిచేసుకుంది.
కట్ చేస్తే.. 28 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తరువాత తనను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకుల కోసం త్వరలో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ తో పలకరించబోతున్నారు శంకర్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్నారు. 2022లో ఈ మెగా ప్రాజెక్ట్ సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
![]() |
![]() |