Home  »  News  »  ‘G.D.N’ ట్రైలర్.. తెలుగువాడి బయోపిక్‌తో మాధవన్ సంచలనం.!

Updated : Aug 3, 2026

‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ లాంటి ప్రతిష్టాత్మక బయోపిక్ చిత్రంతో మెప్పించిన ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్, ఇప్పుడు మరో బయోపిక్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు. భారతీయ ఎడిసన్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జి.డి. నాయుడు (గోపాల్‌స్వామి దొరైస్వామి నాయుడు) జీవిత ఆధారంగా రూపుదిద్దుకున్న ‘G.D.N’ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.

కోయంబత్తూరులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో 1893లో జన్మించిన జి. డి. నాయుడు.. భారతదేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేయడంతో పాటు, ఎన్నో పరికరాలు ఆవిష్కరించారు. బ్రిటిష్ వారు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా.. జి. డి. నాయుడు వెన్ను చూపలేదు. అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్ గా ‘G.D.N’ రూపొందింది.

జి. డి. నాయుడు శాస్త్రసాంకేతిక రంగాల్లో సాధించిన ఆవిష్కరణలు ఒకవైపు, మరోవైపు నాజీ జర్మనీతో ఆయనకు ఉన్న వ్యాపార సంబంధాలు, అలాగే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం ఈ సినిమాలో ప్రధానాంశాలుగా నిలువనున్నాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

బ్రిటిష్ అధికారులు జి.డి. నాయుడుపై పన్ను ఎగవేత ఆరోపణలు మోపడం, ఆయన ఆస్తులలో ఏకంగా 80 శాతం జప్తు చేయడానికి అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం లాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలు ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "బ్రిటిష్ వారి అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా ప్రశ్నించినప్పటి నుంచే నాయుడును టార్గెట్ చేశారు" అనే సంభాషణలు కథలోని సంఘర్షణ స్థాయిని తెలియజేస్తున్నాయి. 

అంతేకాకుండా, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో స్వదేశీ రాజకీయ ప్రత్యర్థుల కుట్రలను కూడా నాయుడు ఎలా ఎదుర్కొన్నారనేది ఇందులో ఎంతో ఉద్వేగభరితంగా చిత్రీకరించారు. సొంత ఆవిష్కరణలను తగులబెట్టే సన్నివేశాలు, సత్యం కోసం పోరాడే నాయుడి వ్యక్తిత్వం కట్టిపడేస్తున్నాయి.

నటుడిగా ఆర్‌. మాధవన్ మరోసారి జీడీ నాయుడు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుత నటనను కనబరిచారు. ఆయనతో పాటు సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ లాంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. క్రిష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ‘G.D.N’ సినిమా ఈ ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది.

 

 

GDN Telugu Trailer, R Madhavan, GDN Movie, GD Naidu

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.