![]() |
![]() |

హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కేజీఎఫ్ చాప్టర్-2' ఎంతటి సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. కేజీఎఫ్ తో హోంబలే సంస్థకి నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికే 'సలార్'తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న ఈ బ్యానర్.. తాజాగా మరో ప్రతిష్టాత్మక సినిమాకి ప్రకటించింది.
సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మిస్తున్నట్లు తాజాగా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. 'గురు', 'సూరరై పొట్రు(ఆకాశం నీ హద్దురా)' సినిమాలతో సుధ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సూర్య హీరోగా నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో ప్రేక్షకులను మెప్పించడంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఆమె తదుపరి సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆమెతో సినిమా చేస్తున్నట్లు హోంబలే సంస్థ అనౌన్స్ చేసింది.

'కొన్ని నిజమైన కథలు చెప్పడానికి అర్హమైనవి మరియు సరిగ్గా చెప్పబడతాయి' అని ట్వీట్ చేసిన హోంబలే సంస్థ.. యదార్థ సంఘటనల ఆధారంగా సుధ కొంగరతో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. సుధ గత చిత్రం 'ఆకాశం నీ హద్దురా' కూడా ఎయిర్ డెక్కన్ ఫౌండర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఇప్పుడు మరో రియల్ స్టోరీతో మూవీ తెరకెక్కిస్తుండటం విశేషం. ఇందులో కూడా సూర్యనే హీరోగా నటించే అవకాశముందని తెలుస్తోంది.
![]() |
![]() |