![]() |
![]() |

తెలుగువన్ డాట్ కామ్ ఎడిటర్ (సినిమా) బుద్ధి యజ్ఞమూర్తికి ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారం లభించింది. బుధవారం (ఏప్రిల్ 20) రాత్రి రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్‌వెల్ కార్పొరేషన్, తిరుమల బ్యాంక్ కలిసి నిర్వహించిన ఉగాది విశిష్ట పురస్కారాలు - 2022 ఈవెంట్‌లో తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి ఎస్. మధుసూదనాచారి చేతుల మీదుగా ఆయన 'ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారం - 2022' అందుకున్నారు.

ఈ సందర్భంగా యజ్ఞమూర్తి మాట్లాడుతూ, "22 సంవత్సరాల వయసులో.. 1993లో గ్రామీణ విలేకరిగా ఆంధ్రజ్యోతి డైలీలో పనిచేయడం ద్వారా కెరీర్ మొదలుపెట్టాను. చీరాలలో 1995లో జరిగిన లాకప్‌డెత్ అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ ఘటనపై నేను రాసిన పలు పరిశోధనాత్మక కథనాలు నాకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. తర్వాత దాన్ని ఆధారం చేసుకొని నవ్య వీక్లీలో రాసిన 'లాకప్‌డెత్' కథకూ చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత హైదరాబాద్ వచ్చి.. ఆంధ్రభూమిలో సినిమా రిపోర్టర్‌గా, ఆంధ్రజ్యోతిలో సీనియర్ రిపోర్టర్‌గా, మనం డైలీలో సండే డెస్క్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించాను. 2019 నుంచి తెలుగువన్ డాట్ కామ్ ఎడిటర్ (సినిమా)గా పనిచేస్తున్నాను. సంస్థ ఎండీ కంఠంనేని రవిశంకర్ ప్రోత్సాహంతో నాలుగు నెలల నుంచీ తెలుగువన్ చానల్‌లో సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నాను. అధ్యయనం, పరిశోధనను రెండు కళ్లుగా భావిస్తూ వృత్తికి న్యాయం చేయడానికి శక్తివంచన లేకుడా కృషి చేస్తున్నాను. తెలుగువన్ ఎడిటర్‌గా ఉత్తమ పాత్రికేయ శిరోమణి అవార్డును జస్టిస్ చంద్రయ్య, ఎస్. మధుసూదనాచారి చేతుల మీదుగా అందుకోవడం మరచిపోలేని ఘట్టం. నాతో పాటు ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు అందుకున్న సహ జర్నలిస్టులకు నా అభినందనలు" అన్నారు.

![]() |
![]() |