![]() |
![]() |

తమిళనాడు రాజకీయ రంగ ప్రవేశం తర్వాత కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. విజయ్‌ను వెండితెరపై చివరిసారిగా చూస్తున్నామనే భావనతో అభిమానులు థియేటర్ల వద్ద పండగ వాతావరణం సృష్టించారు.
ఈ సినిమా చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు తమ రివ్యూలను, పబ్లిక్ టాక్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తమిళ్ లో రెస్పాన్స్ ఎలా ఉన్నా, తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ మూవీపై పెదవి విరుస్తున్నారు. ప్లస్ లు కొన్ని ఉంటే, మైనస్ లు ఎన్నో ఉన్నాయని అంటున్నారు.
ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దళపతి విజయ్ మాస్ ఇమేజ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. ముఖ్యంగా థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించేలా డిజైన్ చేసిన 'ఫ్యాన్ మూమెంట్స్' సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి. విజయ్ తనదైన శైలి నటన, ఆకర్షణీయమైన డ్యాన్స్ మూమెంట్స్, పొలిటికల్ పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. దీనికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి మాస్ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని, సెకండ్ హాఫ్‌పై విపరీతమైన ఆసక్తిని పెంచేలా ఆ సన్నివేశాన్ని హెచ్. వినోద్ డిజైన్ చేశారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే, ఉత్సాహపరిచే మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం కొన్ని ప్రధానమైన నెగెటివ్స్ ఎదుర్కొంటోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విజయ్ నిజజీవిత రాజకీయ ప్రవేశానికి అనుగుణంగా బలవంతంగా ఇరికించిన 'పొలిటికల్ అడిషన్స్' కథా ప్రవాహాన్ని దెబ్బతీశాయని కామెంట్స్ వస్తున్నాయి. సహజత్వానికి దూరంగా కేవలం ప్రచారం కోసమే రాసుకున్నట్టు ఉన్న పొలిటికల్ సీన్లు సాధారణ ప్రేక్షకులకు కాస్త అసహనాన్ని కలిగిస్తాయి. దీనికి తోడు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పోషించిన విలన్ క్యారెక్టర్ ట్రాక్ చాలా బలహీనంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబీ డియోల్ వంటి పవర్ ఫుల్ నటుడిని సరిగ్గా వాడుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడని, ఆయన పాత్రలో ఎలాంటి గూస్‌బంప్స్ ఇచ్చే విలనిజం కనిపించలేదని నెటిజన్లు చెబుతున్నారు.
మరోవైపు హెచ్. వినోద్ మార్కు స్క్రీన్ ప్లే లోపించిందని, వీక్ రైటింగ్ సినిమా స్థాయిని తగ్గించేసిందని పబ్లిక్ టాక్ వస్తోంది. ఒక పక్కా పొలిటికల్ డ్రామాను అందించే క్రమంలో నాటకీయత లోపించి సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కే పరిమితమైనట్లు అనిపిస్తుంది. వీటితో పాటు టెక్నికల్స్ వాల్యూస్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం సినిమాకు మరొక మైనస్ పాయింట్‌గా మారింది. గ్రాఫిక్స్, ఎడిటింగ్ విభాగాల్లో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి 'జన నాయకుడు' చిత్రం విజయ్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన ఫ్యాన్ స్టఫ్ అందించినప్పటికీ, సాధారణ ప్రేక్షకులకు మాత్రం యావరేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గానే నిలిచిందని పబ్లిక్ టాక్ స్పష్టం చేస్తోంది.
Jana Nayakudu, Public Talk, Jana Nayagan, Telugu Review, Thalapathy Vijay
![]() |
![]() |