Home  »  News  »  నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం.. విద్యార్థుల నిరసనలకు అండగా సినీ ప్రముఖులు.!

Updated : Jul 23, 2026

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో తమ భవిష్యత్తు కోసం బాధ్యతాయుతంగా రోడ్లెక్కి నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలు, ఉద్రిక్త పరిస్థితులపై సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP), వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలకు మద్దతుగా పలువురు ప్రముఖ నటీనటులు, గాయకులు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ గళాన్ని విప్పుతున్నారు. విద్యార్థుల ఆవేదనను ప్రతి ఒక్కరూ వినాలని, హింసాత్మక ఘటనలకు తావులేకుండా ప్రభుత్వం వెంటనే వారితో శాంతియుత చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సున్నితమైన అంశంపై మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.. విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్య అనేది ఒక ఆశ, ఒక అవకాశం, మెరుగైన భవిష్యత్తుకు బలమైన నమ్మకమని పేర్కొన్న ఆయన, మన దేశ యువత ఇలా అనిశ్చితిని ఎదుర్కోవడం ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని, అర్థం చేసుకుని నిర్మించుకున్న భవిష్యత్తు ఎప్పుడూ బలంగా ఉంటుందని ఆకాంక్షించారు. 

మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, నీట్ పేపర్ లీక్ అనేది చాలా తీవ్రమైన అంశమని అన్నారు. మెరుగైన విద్యావ్యవస్థను కోరుతూ విద్యార్థులంతా ఒక్కటై ముందుకు రావడం, వారికి తల్లిదండ్రులు తోడుగా నిలవడం అభినందనీయమని కొనియాడారు. అయితే, విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగి నిరసనలు హింసాత్మకంగా మారడం తనని తీవ్రంగా బాధించింది అంటూ, గాయపడిన వారికి తన సానుభూతి తెలియజేశారు.

దర్శకుడు ఇంతియాజ్ అలీ స్పందిస్తూ, మన భవిష్యత్తు కోసం మనం చేయాల్సిందల్లా విద్యార్థుల మాటలు వినడమేనని స్పష్టం చేశారు. 

అలాగే ప్రముఖ నటి అదితిరావు హైదరీ మాట్లాడుతూ, తాను ఒక నటిగా కాకుండా సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా మాట్లాడుతున్నానని తెలిపారు. కష్టాల్లో ఉన్న విద్యార్థులకు మద్దతుగా నిలవడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని, ఇది కేవలం మానవత్వంతో చేసిన ఆలోచన మాత్రమేనని ఆమె వివరించారు. 

వీరితో పాటు పూజా భట్, సోనాక్షి సిన్హా, షబానా అజ్మీ, ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సహా మరికొందరు ప్రముఖులు కూడా విద్యార్థుల తరఫున నిలబడి తమ మద్దతు తెలిపారు. 

మరోవైపు, రోజురోజుకూ ముదురుతున్న ఈ నీట్‌ పేపర్‌ లీక్‌ ఆందోళనల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేసిన ప్రధాని, లీకేజీ వ్యవహారంలో దోషులకు కఠిన శిక్ష పడేలా చేసేందుకు వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, అధికారులకు అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.

 

 

NEET Paper Leak, Students Protest, Dulquer Salmaan, Salman Khan

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.