![]() |
![]() |

బెంగళూరు రేవ్ పార్టీ ఇప్పుడు ఇండస్ట్రీలో, తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వారిలో మహిళలు కూడా అధికంగానే ఉన్నారని తేలింది. ముఖ్యంగా నటి హేమ ఈ పార్టీలో పాల్గొనడమే కాకుండా డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంలో ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నట్టికుమార్ బెంగళూరు రేవ్‌పార్టీ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ‘డ్రగ్స్ మాఫియా ఎక్కడ జరిగినా, రేవ్ పార్టీలు ఎక్కడ జరిగినా... ఎక్కడో ఒకరు సినిమావాళ్లు పాల్గొన్నా, పట్టుబడినా ఆ నేరాన్ని సినీ పరిశ్రమ అంతటికీ ఆపాదిస్తున్నారు. దీనివల్ల సినిమా వారిని బయట ఛీప్‌గా చూస్తున్నారు. తప్పు చేసినవారు ఎవరైనా, ఎంతటి వారైనా శిక్షార్హులే. అందుకే సినీ పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా, నిజంగా తప్పు చేసారని నిరూపణ అయితే అలాంటి వారిని నిషేధిస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, పరిశ్రమకు చెందిన ఛాంబర్ వంటి సంస్థలు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నటి హేమ విషయంలో వాస్తవాలు బయటకు రావాలి. ఒకవేళ ఆమె తప్పు చేసినట్లు రుజువైతే ‘మా’ అసోసియేషన్ చర్యలు తీసుకోవాలి. ఆ మధ్య గోవాలో సురేష్ కొండేటి తాను ఏర్పాటు చేసిన అవార్డుల ఫంక్షన్‌లో ఏవో లోపాలు జరిగాయని ఫిర్యాదులు వస్తే, అతనిని నిషేధిస్తూ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అతను ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ ఫంక్షన్ అది. ఆ విషయంలోనే పరిశ్రమ వర్గాలు అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు హేమ విషయంలో కూడా వాస్తవాలను పరిగణనలోనికి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలి. నిజంగా బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొనకపోతే, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ద్వారా కర్ణాటక గవర్నమెంట్‌తో మాట్లాడి దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
![]() |
![]() |