![]() |
![]() |

షార్ట్ ఫిలిం ప్రపంచం నుంచి వచ్చి సిల్వర్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు దర్శకుడు సుభాష్ చంద్ర. అనన్య, ప్రియాంక జవాల్కర్ వంటి టాలెంటెడ్ హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు సుభాష్ చంద్ర, ఇప్పుడు 'గోదారి గట్టు పైన' (Godari Gattupaina) అనే అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా, నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ 'తెలుగువన్ సినిమా'తో ముచ్చటిస్తూ ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
గోదారి గట్టు పైన.. పేరు వెనుక ఆంతర్యం
సినిమా టైటిల్ గురించి దర్శకుడు సుభాష్ చంద్ర మాట్లాడుతూ, "గోదావరి గట్టు మీద నలుగురు స్నేహితులు సాయంత్రం వేళ కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, ఈ సినిమా కూడా ప్రేక్షకులకు అంతే చల్లని అనుభూతిని ఇస్తుంది" అని తెలిపారు. మహేష్ బాబు పాట ప్రభావం కన్నా, కథలోని సహజత్వమే ఈ టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఒక స్వచ్ఛమైన భావోద్వేగపూరిత ప్రయాణాన్ని ఈ సినిమా అందిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
హీరోయిన్ నిధి ప్రదీప్ మెమరీ పవర్ కి డైరెక్టర్ ఫిదా!
తమిళ నేపథ్యం ఉన్నప్పటికీ, తెలుగు డైలాగులను నిధి ప్రదీప్ నేర్చుకున్న తీరు పట్ల దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు. నిడివి ఎక్కువున్న డైలాగులను కూడా నిధి సింగిల్ టేక్‌లో చెప్పేదని, చివరకు పక్కన ఉన్న ఆర్టిస్టులు డైలాగ్ తప్పు చెబితే కూడా ఆమె కరెక్ట్ చేసేదని సుభాష్ గుర్తు చేసుకున్నారు.
నిధి మాట్లాడుతూ, తన పాత్ర తండ్రి గౌరవానికి ప్రాణమిచ్చే ఒక బాధ్యతాయుతమైన అమ్మాయి అని, ప్రతి అమ్మాయి తన పాత్రకు కనెక్ట్ అవుతుందని ధీమా తెలిపారు.
జగపతి బాబు, లైలా వంటి దిగ్గజాలతో..
ఈ సినిమాలో జగపతి బాబు మరియు లైలా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జగపతి బాబు పాత్ర గురించి చెబుతూ, సునీల్ నారాయణ్ గారు సూచించిన వెంటనే ఆయన ఈ కథలోకి వచ్చారని, చాలా నేచురల్ అండ్ హంబుల్ పాత్రలో ఆయన కనిపిస్తారని దర్శకుడు తెలిపారు. సీనియర్ నటుల రాకతో సినిమా స్థాయి మారిందని ఆయన పేర్కొన్నారు.
"వేసవి కాలంలో ఒక చల్లని గాలిలా, అచ్చమైన తెలుగింటి భోజనం తిన్న తృప్తిని ఈ సినిమా ఇస్తుంది" అని సుభాష్ చంద్ర ముగించారు. తరుణ్ భాస్కర్, సుజిత్ వంటి తన స్నేహితుల ప్రోత్సాహం కూడా ఈ ప్రాజెక్ట్‌కు మెండుగా ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. మరి మే 8న థియేటర్లలో ఈ గోదావరి గట్టు పైన సాగే ప్రేమకథ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!
మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూలు, సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) ఛానల్ ను సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
![]() |
![]() |