![]() |
![]() |

తారాగణం: ఆనంద్ దేవరకొండ, నయన్ సారిక, ప్రగతి శ్రీవాత్సవ, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, కృష్ణ చైతన్య తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
డీఓపీ: ఆదిత్య జవ్వాది
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
రచన, దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి
నిర్మాతలు: కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
బ్యానర్: హై లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: మే 31, 2024
'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం 'గం గం గణేశా'. క్రైమ్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అనాథ అయిన గణేష్(ఆనంద్ దేవరకొండ), తన స్నేహితుడు శంకర్(ఇమ్మాన్యుయేల్)తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. ప్రేమించిన అమ్మాయి శృతి(నయన్ సారిక) తనని కాదని, డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో.. ఎలాగైనా తాను కూడా ధనువంతుడు కావాలనుకుంటాడు గణేష్. ఈ క్రమంలో ఏడు కోట్ల విలువైన డైమండ్ ను దొంగతనం చేసే డీల్ ఒప్పుకుంటాడు. కానీ దొంగతనం చేశాక.. అత్యాశకు పోయి ఆ డైమండ్ ను తానే అమ్మి డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఆ డైమండ్ ని అమ్మడం కోసం చెన్నై వెళ్తుండగా మధ్యలో పోలీసు చెకింగ్ కి భయపడి.. అటుగా వస్తున్న లారీలోని వినాయకుడి విగ్రహం తొండంలో దానిని పడేస్తాడు. అయితే ఆ వినాయకుడి విగ్రహాన్ని నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ రెడ్డి(రాజ్ అర్జున్) ఆర్డర్ మేరకు, ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించుకొని, రుద్ర (కృష్ణ చైతన్య) తీసుకెళ్తుంటాడు. అయితే కిషోర్ రెడ్డి ఊరికి చేరాల్సిన ఆ విగ్రహం.. అనూహ్యంగా అతని ప్రత్యర్థి నాయకుడి ఊరికి చేరుతుంది. అసలు ఆ వినాయకుడి విగ్రహం కథేంటి? అందులో ఉండిపోయిన డైమండ్ ను గణేష్ తిరిగి సంపాదించాడా? తెలియాలంటే సినిమా చూడాలి.
విశ్లేషణ:
ఒక విలువైన వస్తువు.. దాని చుట్టూ హీరో, విలన్ గ్యాంగ్ లు తిరగడం అనే పాయింట్ తో పలు సినిమాలు వచ్చాయి. 'గం గం గణేశా' కూడా ఆ కోవకు చెందినదే. ఈ సినిమాలో 'స్వామి రారా' ఛాయలు కనిపిస్తాయి. అయితే తెలిసిన కథే అయినప్పటికీ.. దానికి తనదైన కామెడీని, థ్రిల్ ని జోడించి ప్రేక్షకులను అలరించడంలో దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే ప్రథమార్థం మాత్రం సప్పగానే సాగింది. హీరో లైఫ్ స్టైల్, లవ్ ట్రాక్ ని చూపిస్తూ.. మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. డైమండ్ దొంగతనం నుంచి అసలు కథ మొదలై, ఆసక్తికరంగా నడుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ మెప్పించాయి. ఓ వైపు కిషోర్ రెడ్డికి చెందిన విగ్రహం, మరోవైపు ఆ విగ్రహంలో ఉండిపోయిన గణేష్ కొట్టేసిన వజ్రం.. దానికితోడు ఆ విగ్రహం కిషోర్ రెడ్డి ప్రత్యర్థి ఊరికి చేరడంతో.. తరువాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను కలిగిస్తూ ఫస్టాఫ్ ముగుస్తుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. విగ్రహం కోసం కిషోర్ రెడ్డి గ్యాంగ్, హీరో గ్యాంగ్ వేసే ప్లాన్ లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా డాక్టర్ ఆర్గానిక్ డేవిడ్ గా వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే మధ్యలో ఆనంద్-ప్రగతి శ్రీవాత్సవ లవ్ ట్రాక్ మాత్రం.. ఇరికించినట్లుగా, కథ ఫ్లోని డిస్టర్బ్ చేసేలా ఉంది. పతాక సన్నివేశాలు మెప్పించాయి.
ఆదిత్య జవ్వాది కెమెరా పనితనం ఆకట్టుకుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
గణేష్ పాత్రలో ఆనంద్ దేవరకొండ చక్కగా ఒదిగిపోయాడు. ఇందులో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఫస్టాఫ్ లో నయన్ సారిక, సెకండాఫ్ లో ప్రగతి శ్రీవాత్సవ అలా మెరిశారు. హీరో స్నేహితుడిగా ఇమ్మాన్యుయేల్ కి మంచి పాత్ర దక్కింది. దానిని ఇమ్మాన్యుయేల్ సద్వినియోగం చేసుకొని, బాగానే నవ్వించాడు. ఇక వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. రాజ్ అర్జున్, కృష్ణ చైతన్య, సత్యం రాజేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా...
కథలో కొత్తదనం లేనప్పటికీ.. కొంచెం కామెడీ, కొంచెం థ్రిల్ ని పంచిన ఈ చిత్రాన్ని పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5/5
![]() |
![]() |