![]() |
![]() |

1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'భారతీయుడు'కి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'భారతీయుడు 2' (Indian 2). కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా నెగటివ్ ఫీడ్ బ్యాక్ నే తెచ్చుకుంటోంది.
అప్పట్లో 'భారతీయుడు' విజయంలో ఏఆర్ రెహమాన్ సంగీతం కీలక పాత్ర పోషించింది. పాటలు ఒక ఊపు ఊపాయి. "పచ్చని చిలుకలు తోడుంటే" సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. రెహమాన్ నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. ఇలా 'భారతీయుడు' విజయంలో రెహమాన్ పాత్ర ఎంతో ఉంది. అయితే 'భారతీయుడు 2'కి మాత్రం ఈ జనరేషన్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh) సంగీతం అందించాడు. గత పదేళ్లలో ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించి.. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ పేరు తెచ్చుకున్నాడు. అందుకే రెహమాన్ స్థాయిలో కాకపోయినా.. అనిరుధ్ కూడా మంచి మ్యూజిక్ అందిస్తాడని అందరూ భావించారు. కానీ అనిరుధ్ ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. అసలే సినిమా నీరసంగా ఉంటే.. అనిరుధ్ తన సంగీతంతో మరింత నీరసం తెప్పించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిదే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara). సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుధ్ కావడం విశేషం. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ గా 'ఫియర్ సాంగ్' విడుదలైంది. ఈ సాంగ్ ఆకట్టుకున్నప్పటికీ.. ఎన్టీఆర్-అనిరుధ్ కాంబినేషన్ హైప్ కి తగ్గ రేంజ్ లో లేదనే కామెంట్స్ వినిపించాయి. దీంతో మిగతా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే 'భారతీయుడు 2' విషయంలో అనిరుధ్ పూర్తిగా నిరాశపరచడంతో ఎన్టీఆర్ అభిమానులలో ఆందోళన మొదలైంది. తమిళ సినిమా, అందునా భారీ సినిమాకి అనిరుధ్ ఇలా చేస్తే.. తెలుగు సినిమా అయిన 'దేవర' విషయంలో ఏం చేస్తాడోనని టెన్షన్ పడుతున్నారు. మరి 'దేవర'కి అనిరుధ్ విజృంభిస్తాడో లేక ఇలాగే నిరాశపరుస్తాడో చూడాలి.
![]() |
![]() |