![]() |
![]() |

రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం 'కాంతార'.. 2022లో విడుదలై వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. తెలుగులోనూ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ తో ఊహించని సక్సెస్ చూసింది. ఇప్పుడు 'కాంతార'కు ప్రీక్వెల్ గా 'కాంతార చాప్టర్ 1' వస్తోంది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. విడుదలకు ఇంకా మూడు రోజులే ఉంది. ఇలాంటి సమయంలో.. తెలుగునాట 'బాయ్ కాట్ కాంతార' ట్రెండ్ సంచలనంగా మారింది. (Kantara Chapter 1)
తాజాగా హైదరాబాద్ లో 'కాంతార చాప్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ లో రిషబ్ శెట్టి.. తెలుగులో కాకుండా కన్నడలో మాట్లాడటాన్ని కొందరు తప్పుపడుతున్నారు. తెలుగు నేల మీద ఈవెంట్ నిర్వహించి.. తెలుగులో మాట్లాడని రిషబ్ సినిమా చూసేది లేదని అంటున్నారు. కొందరైతే #BoycottKantaraChapter1 అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
Also Read: గాయంతోనే కాంతార ఈవెంట్ కి ఎన్టీఆర్..
అయితే కొందరు 'బాయ్ కాట్ కాంతార' అంటుంటే.. మరికొందరు మాత్రం రిషబ్ శెట్టికి మద్దతుగా నిలుస్తున్నారు. "అందరికీ నమస్కారం" అంటూ రిషబ్ తన స్పీచ్ ని తెలుగులోనే స్టార్ట్ చేశాడని.. ఆ తర్వాత తన ఫ్రెండ్ ఎన్టీఆర్ గురించి మనస్ఫూర్తిగా మాట్లాడటం కోసం, తనకి పర్ఫెక్ట్ గా తెలిసిన కన్నడలో మాట్లాడతానని చెప్పాడని.. అందులో తప్పేముందని అభిప్రాయపడుతున్నారు.
ఇక కన్నడ అభిమానులు కూడా తెలుగులో 'బాయ్ కాట్ కాంతార' పిలుపునివ్వడం కరెక్ట్ కాదని అంటున్నారు. తెలుగు సినిమాల ఈవెంట్స్ కర్ణాటకలో జరిగినప్పుడు.. ఎన్టీఆర్ తప్ప మిగతా తెలుగు హీరోలు కన్నడలో మాట్లాడిన సందర్భాలు లేవని చెబుతున్నారు.
కన్నడ అభిమానులు చేస్తున్న ఈ కామెంట్స్ కి.. తెలుగు అభిమానులు ధీటుగా సమాధానమిస్తున్నారు. రిషబ్ తెలుగులో మాట్లాడకపోవడం ఒక్కటే సమస్య కాదని.. గతంలో కర్ణాటకలో పలుసార్లు తెలుగు హీరోలను, తెలుగు సినిమాలను ఇబ్బంది పెట్టారని గుర్తు చేస్తున్నారు. ప్రెస్ మీట్ కి ఆలస్యంగా వచ్చినందుకు అల్లు అర్జున్ తో క్షమాపణలు చెప్పించుకున్నారు. కన్నడ కంటే తెలుగు వెర్షన్ ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతుందని.. పలు తెలుగు సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. తెలుగులో టైటిల్స్ ఉన్నాయని.. కొన్ని సినిమాల పోస్టర్స్ చింపేశారు. ఇటీవల 'ఓజీ' సినిమా విడుదల సమయంలోనూ ఇబ్బందులకు గురి చేశారు.. అంటూ కొందరు తెలుగు ఆడియన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
తెలుగు సినిమాల విడుదల సమయంలో.. కర్ణాటకలో నిజంగానే కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే బాయ్ కాట్ ట్రెండ్స్ కి కర్ణాటక జనరల్ ఆడియన్స్ నుంచి మద్దతు లభించిన సందర్భాలు పెద్దగా లేవు. కంటెంట్ నచ్చిన ఎన్నో తెలుగు సినిమాలను కన్నడ ప్రేక్షకులు ఆదరించారు. అది ఆలోచించకుండా.. ఎవరో కొందరు చేసిన పనిని దృష్టిలో పెట్టుకొని.. కాంతారని బాయ్ కాట్ చేస్తామనడం కరెక్ట్ కాదని కన్నడ ఫ్యాన్స్ కోరుతున్నారు.
మరి తెలుగునాట ఈ 'బాయ్ కాట్ కాంతార' సెగ.. ముదురుతుందో లేక సద్దుమణుగుతుందో చూడాలి.
![]() |
![]() |