![]() |
![]() |

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను సంపాదించుకున్నారు. అడివి శేష్ అంటేనే వైవిధ్యమైన కథలు, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే గుర్తుకొస్తాయి. తన తాజా చిత్రం 'డెకాయిట్' (Dacoit) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శేష్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, తన తదుపరి ప్రాజెక్టుల గురించి శేష్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
'డెకాయిట్' ఒక మనసుతో ఆడిన గేమ్
శేష్ మాట్లాడుతూ, "ఇప్పటివరకు నేను బ్రెయిన్‌తో ఆడే థ్రిల్లర్ గేమ్స్ చేశాను, కానీ ఈసారి మనసుతో ఆడే గేమ్ 'డెకాయిట్' చేశాను. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ" అని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని, ముఖ్యంగా స్మోకింగ్ చేయని తనకు ఈ సినిమాలో స్మోకింగ్ సీన్స్ చేయడం చాలా కష్టమైందని చెప్పుకొచ్చారు.
ప్రకాష్ రాజ్ రూమర్స్ & అకీరాతో బంధం
సినిమాలో ప్రకాష్ రాజ్‌ను కావాలనే పక్కన పెట్టారనే వార్తలపై స్పందిస్తూ, "ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్. పాత్ర పరిధిని బట్టే నటీనటులను ఎంచుకుంటాం తప్ప మరే ఇతర కారణాలు లేవు" అని క్లారిటీ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్‌తో తనకున్న సంబంధం గురించి మాట్లాడుతూ.. ఇద్దరం 'లెఫ్ట్ హ్యాండర్స్' కావడం వల్ల ఒక ప్రత్యేకమైన బాండ్ ఏర్పడిందని, అకీరా అప్పుడప్పుడు తనను కలుస్తుంటాడని, అతని డెబ్యూ కోసం అందరిలాగే తాను కూడా ఎదురుచూస్తున్నానని తెలిపారు.
మార్కెట్ గ్రోత్ & రెమ్యునరేషన్:
వరుస హిట్లతో మార్కెట్ పెరిగినప్పుడు రెమ్యునరేషన్ పెంచారా అన్న ప్రశ్నకు శేష్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆయన రెమ్యునరేషన్‌ను కేవలం ఒక నంబర్‌లా కాకుండా, ప్రాజెక్ట్ డైమెన్షన్స్ బట్టి నిర్ణయిస్తానని చెప్పారు."నేను అనుకుంటే రూ.1000 కోట్ల సినిమా, లేదంటే రూ.1 కోటి సినిమా చేసే ఫ్రీడమ్ నాకు ఉండాలి. కేవలం ఇమేజ్ అనే చట్రంలో ఉండిపోకూడదు" అని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ బడ్జెట్, దాని పరిధిని బట్టి తన పారితోషికం ఉంటుందని, ఒక కమర్షియల్ సినిమాకు తీసుకున్నంత చిన్న సినిమాలకు తీసుకోలేమని ఆయన వివరించారు.
తండ్రి తీరని కోరిక - శేష్ ప్రయాణం
అడివి శేష్‌కు కేవలం 5 ఏళ్ల వయస్సు నుంచే సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. దానికి ప్రధాన కారణం ఆయన తండ్రి. శేష్ తండ్రికి నటుడు అవ్వాలని చాలా బలమైన కోరిక ఉండేది. కానీ డాక్టర్ అయ్యారు. డాక్టర్‌గా సెటిల్ అయిన తర్వాత ఆయన హీరో అవుదామని ప్రయత్నించారు కానీ అది వర్కౌట్ కాలేదు. శేష్ చిన్నప్పుడే తన తండ్రి చేయించుకున్న ఫోటో షూట్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవారట. శేష్ తండ్రి చాలా హ్యాండ్సమ్‌గా ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
డైరెక్టర్ సుజిత్ గురించి శేష్ ఏమన్నారంటే?
అడివి శేష్ తన సమకాలీన దర్శకులలో సుజిత్ పనితీరును చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతానని చెప్పారు. "సుజిత్ చాలా చిన్న వయసులోనే డెబ్యూ ఇచ్చాడు. నా దృష్టిలో ప్రస్తుతం ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్షన్ డైరెక్టర్ తనే" అని శేష్ కొనియాడారు. సుజిత్‌కి కావాల్సిన వనరులు ఇచ్చి వదిలేస్తే, స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తాడని అభిప్రాయపడ్డారు.
G2 & తదుపరి ప్రాజెక్టులు
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గూఢచారి 2'(G2) గురించి కూడా శేష్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందని, ఇది మునుపటి కంటే గ్రాండ్‌గా ఉండబోతోందని చెప్పారు. దీని తర్వాత రాహుల్ రవీంద్రన్, సాయి మార్తాండ్ దర్శకత్వంలో రెండు లవ్ స్టోరీస్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందని స్పష్టం చేశారు.
ఇతర పాన్ ఇండియా సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించడంపై అడివి శేష్ స్పందించారు. మన భుజాలపై సినిమా నిలబడుతుంది అనుకునే లాంటి పాత్రలు చేయడానికి రెడీ అని శేష్ అన్నారు. ఒక్క సన్నివేశమైనా పర్లేదు, పవర్ ఫుల్ గా ఉండాలని.. 'పెదరాయుడు'లో రజినీకాంత్ గారు పోషించిన లాంటి పాత్రలు పడాలని చెప్పారు.
అడివి శేష్ పూర్తి ఇంటర్వ్యూ కోసం, మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
![]() |
![]() |