![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎన్నో మరపురాని చిత్రాలున్నాయి. అయితే నటుడిగా కృష్ణకి ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది మాత్రం `అల్లూరి సీతారామరాజు` అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే.. `అల్లూరి సీతారామరాజు`కి ముందు, తరువాత అన్నట్లుగా కృష్ణ కెరీర్ సాగింది. అంతేకాదు.. `అల్లూరి సీతారామరాజు` తన 100వ చిత్రం కావడం విశేషం. `అల్లూరి సీతారామరాజు` అంటే కృష్ణ.. కృష్ణ అంటే `అల్లూరి సీతారామరాజు` అన్నంతగా పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసి.. `వెండితెర అల్లూరి`గా తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతస్థానం దక్కించుకున్నారు సూపర్ స్టార్.
వి. రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కృష్ణ సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ నిర్మించడం మరో విశేషం. అలాగే, 1974లో విడుదలైన చిత్రాల్లో హయ్యస్ట్ గ్రాసర్ గానూ నిలిచిందీ సినిమా. 175 రోజులకి పైగా ప్రదర్శితమై.. రూ. కోటి షేర్ చూసిన తొలి తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. అదేవిధంగా.. దక్షిణాది తొలి `సినిమా స్కోప్` చిత్రమైన `అల్లూరి సీతారామరాజు` పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
కృష్ణకి జంటగా విజయనిర్మల నటించిన ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ లో జగ్గయ్య, చంద్రమోహన్, శ్రీధర్, కాంతారావు, మంజుల, రాజశ్రీ, గుమ్మడి, త్యాగరాజు, రావు గోపాల రావు తదితరులు ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
పి. ఆదినారాయణ రావు స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. ``తెలుగు వీర లేవరా`` (ఘంటసాల, వి. రామకృష్ణ గానం), `` వస్తాడు నా రాజు`` (పి. సుశీల గానం) ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా నిలిచిపోయాయి.
`ఉత్తమ గీత రచన` (తెలుగు వీర లేవరా) విభాగంలో ఈ సినిమాకి గానూ మహాకవి శ్రీశ్రీ `జాతీయ` పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే.. `ఉత్తమ చిత్రం` విభాగంలో `నంది` పురస్కారం సైతం దక్కింది.
ఇలా.. ఎన్నో విశేషాలు, రికార్డులు, రివార్డులు, అవార్డులకు చిరునామాగా నిలిచిన `అల్లూరి సీతారామరాజు` 1974 మే 1న జనం ముందుకొచ్చింది. నేటితో 47 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |