![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవిలోని నటుడ్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుల్లో కె. విశ్వనాథ్ ఒకరు. వీరిద్దరి కలయికలో మూడు సినిమాలు (శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు) తెరకెక్కగా.. అవన్నీ కూడా చిరుకి `ఉత్తమ నటుడు` విభాగంలో అవార్డులను తెచ్చిపెట్టాయి. మరీముఖ్యంగా.. అత్యధిక `ఫిల్మ్ ఫేర్` అవార్డులు అందుకున్న తెలుగు హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన చిరంజీవికి.. ఫస్ట్ `ఫిల్మ్ ఫేర్` పురస్కారం అందించింది కూడా కె. విశ్వనాథ్ కాంబో మూవీనే కావడం విశేషం. ఆ చిత్రమే.. `శుభలేఖ`. వరకట్న సమస్యను చర్చిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో నరసింహ మూర్తిగా ఆకట్టుకున్నారు మెగాస్టార్.
చిరంజీవికి జోడీగా సుమలత నటించిన ఈ చిత్రంలో `శుభలేఖ` సుధాకర్ (తనకిదే మొదటి సినిమా), తులసి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రమణ మూర్తి, రాళ్ళపల్లి, సాక్షి రంగారావు, అనుపమ, నిర్మలమ్మ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన ఈ చిత్రంలో ``రాగాల పల్లకిలో``, `ఐతే..నిజమైతే``, ``నీ జడ కుచ్చులు``, ``ఓహో తద్దిమి`` అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. కె. విశ్వనాథ్ కి `ఉత్తమ దర్శకుడు`గా `ఫిల్మ్ ఫేర్` అవార్డుని, `ఉత్తమ కథా రచయిత`గా `నంది` పురస్కారాన్ని అందించిన `శుభలేఖ`.. హిందీలో `శుభ్ కామ్నా` (రాకేశ్ రోషన్, రతి అగ్నిహోత్రి) పేరుతో విశ్వనాథ్ నిర్దేశకత్వంలోనే రూపొందింది. ప్రశాంతి క్రియేషన్స్ పతాకంపై వి. వి. శాస్త్రి, అల్లు అరవింద్ నిర్మించిన `శుభలేఖ`.. 1982 జూన్ 11న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ జనరంజక చిత్రం 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |