![]() |
![]() |

తెలుగునాట రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ ఒకరు. అలా.. వెంకీ నటించిన రీమేక్స్ లో సింహభాగం సంచలనం సృష్టించాయి. వాటిలో `రాజా` ఒకటి. తమిళ చిత్రం `ఉన్నిడత్తిల్ ఎన్నై కొడుత్తేన్` (కార్తిక్, రోజా, అజిత్) ఆధారంగా రూపొందిన ఈ సినిమాని ముప్పలనేని శివ డైరెక్ట్ చేయగా.. వెంకీకి జోడీగా అభినేత్రి సౌందర్య నటించారు. అంజలి (సౌందర్య) అనే అమ్మాయి భవిష్యత్ ని తన ఊపిరిలా భావించి.. ఆమె ఎదుగుదలకి కారణమైన రాజా (వెంకటేశ్) అనే వ్యక్తి కథే.. ఈ `రాజా` చిత్రం. వెంకీ - సౌందర్య మధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్, పాటలు.. `రాజా` సినిమా ఘనవిజయంలో ముఖ్య పాత్ర పోషించాయి.
అబ్బాస్, చంద్రమోహన్, సుధాకర్, వై. విజయ, సన, బ్రహ్మానందం, అన్నపూర్ణ, తనికెళ్ళ భరణి, ఏవీయస్, చక్రవర్తి (సంగీత దర్శకుడు), బేబి శ్రీలలిత, బేబి కీర్తన ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణం, రాజేంద్ర కుమార్ సంభాషణలు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి.
ఎస్. ఎ. రాజ్ కుమార్ స్వరకల్పనలో రూపొందిన పాటలు, నేపథ్య సంగీతం `రాజా`కి ప్రధాన బలంగా నిలిచాయి. ``ఏదో ఒక రాగం`` (రెండు వెర్షన్స్), ``కవ్వించకే ఓ ప్రేమా``, ``పల్లవించు తొలి రాగమే``, ``కన్నుల లోగిలో``, ``మల్లెల వాన``, ``షేపు చూసి``.. ఇలా ఇందులోని ప్రతీ గీతం ప్రేక్షకులను రంజింపజేసింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్. బి. చౌదరి నిర్మించిన `రాజా`.. 71 కేంద్రాలలో 100 రోజులు, 4 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శితమై అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ నటి`, `ఉత్తమ సంగీత దర్శకుడు` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను సొంతం చేసుకుంది. 1999 మార్చి 18న విడుదలై ఘనవిజయం సాధించిన `రాజా`.. నేటితో 23 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |