![]() |
![]() |

నటరత్న నందమూరి తారక రామారావు అంటేనే శక్తిమంతమైన పాత్రలకు చిరునామా. అలా.. ఆయన పోషించిన పవర్ ఫుల్ రోల్స్ లో `కొండవీటి సింహం` చిత్రంలోని ఎస్పీ రంజిత్ కుమార్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. తమిళ చిత్రం `తంగ పతకం` ఆధారంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్.. తండ్రి పాత్రైన ఎస్పీ రంజిత్ కుమార్ ని తన అభినయంతో మరో స్థాయికి తీసుకెళ్ళారు. టైటిల్ రోల్ లో నట విశ్వరూపాన్ని ప్రదర్శించి.. బాక్సాఫీస్ ముంగిట సరికొత్త రికార్డులు సృష్టించారు. మరో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఎన్టీఆర్ కి జంటగా శ్రీదేవి, జయంతి నటించిన ఈ సినిమాలో మోహన్ బాబు, రావుగోపాల రావు, సత్యనారాయణ, కాంతారావు, అల్లు రామలింగయ్య, నగేశ్, చలపతి రావు, గీత, సుభాషిణి, పుష్పలత, శ్రీలక్ష్మి, గిరిజ, మాస్టర్ హరీశ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతమందించగా.. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ``అత్తమడుగు వాగులోన``, ``బంగినపల్లి``, ``వానొచ్చే వరదొచ్చే``, ``పిల్ల ఉంది``, ``ఈ మధుమాసంలో``, ``మా ఇంటిలోన``.. ఇలా ఇందులోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. రోజా మూవీస్ పతాకంపై ఎం. అర్జునరాజు, కె. శివరామరాజు నిర్మించిన `కొండవీటి సింహం`.. 1981 అక్టోబర్ 7న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ సంచలన చిత్రం 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |