![]() |
![]() |

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి.. ``మంచి కాఫీలాంటి సినిమా`` `ఆనంద్` తరువాత వచ్చిన చిత్రం `గోదావరి`. ``ఈ వేసవి.. చాలా చల్లగా వుంటుంది`` అంటూ 2016 వేసవిలో వినోదాలు పంచిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ట్యాగ్ కి తగ్గట్టే `కూల్` హిట్ గా నిలిచింది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు - దిగ్గజ దర్శకుడు బాపు కాంబినేషన్ లో వచ్చిన `అందాల రాముడు` (1973) స్ఫూర్తితో రూపొందిన `గోదావరి`లో ఏయన్నార్ మనవడు సుమంత్ హీరోగా నటించడం విశేషం. శేఖర్ `ఆనంద్`తో ఆకట్టుకున్న కమలిని ముఖర్జీ ఇందులోనూ నాయికగా అలరించగా.. నీతూ చంద్ర, కమల్ కామరాజు, తనికెళ్ళ భరణి, కరాటే కళ్యాణి, సీవీఎల్ నరసింహారావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కేఎం రాధాకృష్ణన్ స్వరాలకు దిగ్గజ రచయిత వేటూరి సాహిత్యమందించారు. ``ఉప్పొంగెలే గోదావరి``, ``అందంగా లేనా``, ``మనసా వాచా``, ``మనసా గెలుపు``, ``రామచక్కని``, ``టిప్పులు టిప్పులు``.. ఇలా ఇందులో అన్నీ పాటలు కూడా వీనులవిందుగానే కాకుండా కనువిందుగానూ సాగాయి. `ద్వితీయ ఉత్తమ చిత్రం`, `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ సంగీత దర్శకుడు`, `ఉత్తమ ఛాయాగ్రాహకుడు` (విజయ్ సి. కుమార్), `ఉత్తమ గాయని` (సునీత - అందంగా లేనా) విభాగాల్లో `నంది` పురస్కారాలను సొంతం చేసుకున్న `గోదావరి`ని జీవీజీ రాజు నిర్మించారు. 19 మే 2006న విడుదలై జననీరాజనాలు అందుకున్న `గోదావరి`.. నేటితో 15 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |