![]() |
![]() |

డైరెక్టర్ శంకర్ తల్లి ముత్తులక్ష్మి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఈ విషయాన్ని శంకర్ పీఆర్వో ఆయన అభిమానులతో పంచుకున్నారు. ముత్తులక్ష్మి అంత్యక్రియలు ఈరోజు చెన్నైలో జరగనున్నాయి. శంకర్, ఆయన కుటుంబ సభ్యులకు అన్ని వైపుల నుంచీ సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
తల్లి ముత్తులక్ష్మి తుదిశ్వాస విడిచారనే విషయం తెలియగానే శంకర్ బిగ్గరగా రోదించారు. చాలా సేపటి దాకా ఆయన మామూలు మనిషి కాలేకపోయారని సన్నిహితులు తెలిపారు. ఈ విషాద ఘటన ఆయనకూ, ఆయన కుటుంబ సభ్యులకూ తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కొన్ని నెలలుగా ముత్తులక్ష్మి వయోభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శంకర్‌కు డైరెక్టర్ చేరన్ సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు. "డియర్ శంకర్, మీ అమ్మగారికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి. ఆమె ఆత్మ శాంతించుగాక." అని ఆయన ట్వీట్ చేశారు.
ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీ విషయంలో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో శంకర్ న్యాయపోరాటం చేస్తున్నారు. 2020 ఫిబ్రవరిలో ఆ సినిమా సెట్స్‌పై ముగ్గురు సిబ్బంది క్రేన్ యాక్సిడెంట్లో చనిపోవడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత కొవిడ్ లాక్డౌన్ వచ్చింది. షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన తర్వాత కూడా 'ఇండియన్ 2' షూటింగ్ కొనసాగలేదు.
ఇటీవల రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో ఓ ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అలాగే హిందీలో రణవీర్ సింగ్‌తో 'అపరిచితుడు'ను రీమేక్ చేయనున్నట్లు శంకర్ ప్రకటించారు.
![]() |
![]() |