![]() |
![]() |

దర్శకుడు శేఖర్ కమ్ముల తెలుగు తెరకు పలువురు నూతన తారలను పరిచయం చేశారు. వారిలో మూవీ మొఘల్ డి. రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తనయుడు అయిన రానా దగ్గుబాటి ఒకరు. శేఖర్ కమ్ముల రూపొందించిన `లీడర్` చిత్రంతో రానా నటుడిగా తొలి అడుగేశారు. అప్పటివరకు ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాలను తెరకెక్కిస్తూ వచ్చిన శేఖర్.. తొలిసారిగా రాజకీయాల నేపథ్యంలో `లీడర్`ని తీర్చిదిద్దారు. అనూహ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యే అర్జున్ ప్రసాద్ అనే ఓ యువకుడి కథే.. `లీడర్` చిత్రం. టైటిల్ రోల్ లో రానా తనదైన అభినయంతో అలరించారు. ఇందులో రానాకి జోడీగా రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ దర్శనమిచ్చారు. వీరిద్దరికీ ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.
Also Read: బాలయ్య చిత్రంలో శ్రీ లీల!?
సుమన్, సుహాసిని, కోట శ్రీనివాసరావు, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్, రావు రమేశ్, ఆహుతి ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకోగా.. ఉదయభాను ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది. మిక్కీ జే మేయర్ బాణీలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీయమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన `లీడర్`.. 2010 ఫిబ్రవరి 19న విడుదలైంది. నేటితో ఈ క్లాసిక్ 12 వసంతాలు పూర్తిచేసుకుంది. అంటే.. నటుడిగా రానా 12 ఏళ్ళ కెరీర్ పూర్తిచేసుకున్నారన్నమాట.
![]() |
![]() |