![]() |
![]() |

హీరోల కెరీర్ లో కొన్ని సినిమాలకు ప్రత్యేక స్థానముంటుంది. అలా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాలలో 'టెంపర్' ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త ఎన్టీఆర్ పరిచయమయ్యాడు. అలాగే ఈ సినిమా తర్వాత పదేళ్లుగా అపజయం అనేది ఎరుగకుండా దూసుకుపోతున్నాడు. (10 Years For Temper)
'టెంపర్' సినిమాకి ముందు నాలుగేళ్ల పాటు పలు ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు ఎన్టీఆర్. ఆ నాలుగేళ్లలో ఆరు సినిమాలు చేయగా.. అందులో 'బాద్షా' తప్ప మిగతా ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచాయి. ముఖ్యంగా చివరి రెండు సినిమాలు 'రామయ్యా వస్తావయ్యా', 'రభస' దారుణంగా నిరాశపరిచాయి. అలాంటి సమయంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'టెంపర్' మూవీ చేశాడు ఎన్టీఆర్. ఈ చిత్రానికి ముందు పూరి కూడా వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు. పైగా గతంలో ఎన్టీఆర్-పూరి కాంబినేషన్ లో వచ్చిన 'ఆంధ్రావాలా' మూవీ డిజాస్టర్ గా నిలిచింది. చుట్టూ ఇన్ని నెగటివ్ లు ఉన్నప్పటికీ.. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో విడుదలకు ముందు టెంపర్ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. పైగా ఈ మూవీ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇక నుంచి అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తానని స్టేజ్ మీద చెప్పాడు. ఎన్టీఆర్ చెప్పినట్టుగానే.. టెంపర్ విడుదల తర్వాత అభిమానులు కాలర్ ఎగరేసుకున్నారు. టెంపర్ తో సరికొత్త ఎన్టీఆర్ ను పరిచయం చేశాడు పూరి. ఎన్టీఆర్ మ్యానరిజమ్స్ కి, డైలాగ్ డెలివరీకి అందరూ ఫిదా అయ్యారు. "దండయాత్ర ఇది దయ గాడి దండయాత్ర" అంటూ గ్రే షేడ్స్ ఉన్న ఇన్స్పెక్టర్ దయ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ఒదిగిపోయాడు. వన్ మ్యాన్ షో అంటే ఏంటో చూపించాడు. ఎప్పుడూ లేనిది సిక్స్ ప్యాక్ లో దర్శనమిచ్చి సర్ ప్రైజ్ చేశాడు. డ్యాన్స్ లతోనూ అదరగొట్టాడు. ఇక క్లైమాక్స్ లో ఎన్టీఆర్ నటనకు క్లాప్స్ కొట్టనివారు లేరు. అందుకే ఎన్టీఆర్ అభిమానుల హృదయాలలో టెంపర్ కి ప్రత్యేక స్థానముంటుంది. సాధారణ ప్రేక్షకులను సైతం, ఈ సినిమా ఎంతగానో మెప్పించింది.

'టెంపర్' సినిమా 2015 ఫిబ్రవరి 13న విడుదలై ఘన విజయం సాధించింది. నేటితో ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. అసలు ఈ టెంపర్ సినిమా.. ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఆ చిత్రం వచ్చినప్పటి నుంచి గత పదేళ్లుగా ఫ్లాప్ అనేది తెలియకుండా.. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. అలాగే డైరెక్టర్ పూరి అభిమానులకు సైతం టెంపర్ అనేది స్పెషల్ మూవీ. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న పూరి లాస్ట్ బెస్ట్ వర్క్ అంటే అభిమానులు టెంపర్ అనే చెబుతారు. ఇలా టెంపర్ అనేది అటు ఎన్టీఆర్ అభిమానులకు, ఇటు పూరి అభిమానులకు ఎంతో స్పెషల్ మూవీ.
![]() |
![]() |