![]() |
![]() |
చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలన విజయాలు సాధించి, నిర్మాతకు స్టార్ ఇమేజ్‌ని తీసుకొచ్చిన నిర్మాత మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు. శతాధిక చిత్రాలను నిర్మించి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన తెలుగువాడిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన ఘనత కూడా ఆయనదే. కొందరి భాగస్వామ్యంలో ‘అనురాగం’ చిత్రాన్ని తొలిసారి నిర్మించినప్పటికీ, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా తొలిసారి తెరపై తన పేరు వేసుకున్న సినిమా ‘రాముడు భీముడు’. ఆ తర్వాత ఎన్నో ఆటు పోట్ల తర్వాత నిర్మాతగా ఆయనకు పునర్జన్మనిచ్చిన సినిమా ‘ప్రేమనగర్’. తన బేనర్ ద్వారా ఎంతో మంది దర్శకుల్ని, టెక్నీషియన్స్‌ని, నటీనటుల్ని పరిచయం చేశారు. జూన్ 6 మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు జయంతి సందర్భంగా ‘అనురాగం’ నుంచి ‘ప్రేమనగర్’ వరకు ఎంతో కీలకమైన ఆయన సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.
మనం ఏ రంగంలో ఉన్నా నెంబర్‌వన్‌గా ఉండాలనే తత్వం రామానాయుడిది. కారంచేడులోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన తొలుత వ్యవసాయంలో ఏదో సాధించాలనే పట్టుదలతో ఆ ఊళ్ళో అందరి కంటే ఎక్కువ పండిరచి నెంబర్ వన్ అనిపించుకున్నారు. ఆ తర్వాత అది పక్కన పెట్టి కొన్నాళ్ళు రైస్ మిల్లు నడిపారు. తన నిజాయితీ అందులో పనిచేయదని భావించి అది మూసేసి ఇటుకల వ్యాపారం చేద్దామనుకున్నారు. ఆ వ్యాపారం తన వల్ల కాదని హోటల్ బిజినెస్‌లోకి వచ్చారు. అది కూడా ఆశించిన స్థాయిలో రన్ కాకపోవడంతో మిత్రుల సలహా మేరకు ‘అనురాగం’ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా చేరారు. నిర్మాతగా తన పేరు వేయరని తెలిసినా భాగస్వామిగా చేరి చిత్ర నిర్మాణంలోని మెళకువలు తెలుసుకున్నారు. ఆ తర్వాత తనే సొంతంగా సినిమా నిర్మించాలన్న ఉద్దేశంతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంలోనే మహానటుడు ఎన్.టి.రామారావుతో ‘రాముడు భీముడు’ చిత్రాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమా ఇదే. భారీ తారాగణంతో తాపీ చాణక్య దర్శకత్వంలో నిర్మించిన ఆ సినిమా ఘనవిజయం సాధించింది.
‘రాముడు భీముడు’ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్‌తోనే సినిమా తియ్యాలనుకున్నారు. అయితే ఎన్టీఆర్ డేట్స్ లేకపోవడంతో కాంతారావుతో ‘ప్రతిజ్ఞాపాలన’ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత వరసగా శ్రీకృష్ణతులాభారం, స్త్రీజన్మ, పాపకోసం, సిపాయి చిన్నయ్య, బొమ్మలు చెప్పిన కథ, ద్రోహి చిత్రాలు చేశారు. ఈ ఎనిమిది సినిమాల్లో కొన్నింటిలో డబ్బు వచ్చినా, కొన్ని సినిమాల వల్ల బాగా నష్టపోయారు. 1970 నాటికి ఆ సినిమాల వల్ల రామానాయుడు రూ.12 లక్షల అప్పులో ఉన్నారు. ఇక సినిమా రంగం వదిలేసి వెనక్కి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. అయితే ఎక్కడ పోయింది అక్కడే సంపాదించాలి అని పెద్దలు చెప్పిన మాట గుర్తొచ్చి ఆఖరి ప్రయత్నంగా ఒక మంచి సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నారు. కోడూరి కౌసల్యాదేవి రచించిన ‘ప్రేమనగర్’ నవలను సినిమా తీసేందుకు ఆయన సిద్ధపడ్డారు. అప్పట్లో సినిమాల నిర్మాణానికి పంపిణీదారులే పెట్టుబడులు పెట్టేవారు. అప్పటికి ప్రముఖ పంపిణీదారులైన నవయుగ వారిని సంప్రదించి విషయం చెప్పారు రామానాయుడు. ‘10 లక్షలు మీరు పెట్టండి, 5 లక్షలు నేను పెడతాను. చాలా మంచి సబ్జెక్ట్ నా దగ్గర ఉంది’ అన్నారు. అప్పటికే 12 లక్షలు అప్పు ఉండడంతో వారు పెట్టుబడి పెట్టేందుకు వెనకాడారు. అయితే అంత కాన్ఫిడెన్స్‌తో రామానాయుడు చెప్పడంతో చివరికి ఒప్పుకున్నారు. ఆ సమయానికి ‘దసరాబుల్లోడు’ 14 లక్షలతో నిర్మించారు. దానికంటే ఒక లక్ష ఎక్కువ పెట్టాలని డిసైడ్ అయ్యారు రామానాయుడు. సినిమా ప్రారంభించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. భారీ తారాగణాన్ని ఎంపిక చేశారు. ఎంతో పకడ్బందీగా సినిమాని అనుకున్న టైమ్‌కి పూర్తి చేశారు.
ఇక సినిమాని రిలీజ్ చేద్దామనుకునే సమయానికి భారీ వర్షాలు మొదలయ్యాయి. ఇక వెనక్కి వెళ్ళి వ్యవసాయం చేసుకోవడం తప్పదు అనుకున్నారు రామానాయుడు. 30 కేంద్రాల్లో ‘ప్రేమనగర్’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అంత భారీ వర్షాలను కూడా లెక్క చేయకుండా ప్రేక్షకులు సినిమా చూసేందుకు థియేటర్లకు తరలి వచ్చారు. అన్ని కేంద్రాల్లోనూ హౌస్‌ఫుల్ అయింది. ‘ప్రేమనగర్’ సాధించిన ఘనవిజయంతో రామానాయుడు తన సినీ జీవితంలో తిరిగి వెనక్కి చూసుకునే అవసరం రాలేదు. ఇక అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించారు. పద్మభూషణ్‌తోపాటు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యాపారం చేసినా అందులో నెంబర్ వన్‌గా కొనసాగాలన్న లక్ష్యంతో ఉండే డి.రామానాయుడు జయంతి జూన్ 6. ఈ సందర్భంగా ఆయనకు ఘననివాళి అర్పిస్తోంది తెలుగువన్.
![]() |
![]() |