RELATED EVENTS
RELATED NEWS
EVENTS
డాలస్ లో 47వ నెల నెల తెలుగు వెన్నెల: శ్రీకృష్ణదేవరాయల పై ప్రత్యేక ప్రసంగం

డాల్లాస్ – జూన్ 19 2011 ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) వారి సాహిత్య వేదిక సమర్పించే "నెల నెలా తెలుగు వెన్నెల" సాహితీ సదస్సు ఈనెల 19వ తారీఖున ఇర్వింగ్ లోని ఒహ్రి ఇండియన్ రెస్టారెంట్ లో సాహిత్య వేదిక చైర్ పర్సన్ మల్లవరపు అనంత్ గారి అధ్యక్షతన స్థానిక డల్లాస్ ప్రాంత సాహితీ మిత్రులు, తెలుగు భాషాభిమానుల మధ్య ఉత్సాహంగా జరిగింది.

ఈ కార్యక్రమంలొ అంతర్భాగంగా జరిగిన ‘వెండితెర వేదిక’ మహాకవి శ్రీశ్రీ, ఆరుద్రల సినీ సాహిత్యాన్ని స్మరించుకొంది. ముందుగా గోపీనాథ్, జయకల్యాణి, రమేష్ ఈ ఇద్దరు కవుల ప్రఖ్యాత గేయాలు పాడి కార్యక్రమం ప్రారంభించారు.

తరువాత శ్రీశ్రీ గారి సినీ ప్రస్థానం గురించి మద్దుకూరి విజయచంద్రహాస్ చేసిన బహుమాధ్యమిక ప్రదర్శన సభికులను విశేషంగా ఆకట్టుకొంది. మహాకవి సినీ ప్రవేశానికి నేపథ్యం, ఆయన పని చేసిన మొదటి చిత్రాలు, మొదలైన విశేషాలతొ ప్రారంభించి, శ్రీశ్రీ మార్కు విప్లవ గీతాలతో బాటు, ఆయన రచించిన ప్రేమగీతాలు, పద్యాలు, జావళి, హరికథ, బుర్రకథ మొదలైన విభిన్నరీతుల నుండీ ఉదాహరణలు ప్రదర్శిస్తూ సాహిత్యవిలువలు వివరిస్తూ, చంద్రహాస్, శ్రీశ్రీ పాటలలో సాహిత్యపరంగా బాగుండని పాటలు వెదికినా కనబడవనీ, సినిమారంగంలో ప్రవేశించినా మహాకవి స్థానాన్ని ఆయన వదలుకోలేదనీ శ్రీశ్రీకి నివాళి అర్పించారు.

తదనంతరం చేకూరి కేసీ, ‘చీర లేక కోక’ ప్రాచీనసాహిత్యంలోనూ, పురాణగాథల్లోనూ, అన్నమయ్య పదాల్లోనేగాక, అధునిక సాహిత్యంలో, కథల్లొ, సినీగేయాల్లొ ప్రధాన వస్తువుగా అనేకమార్లు కనిపిస్తుందని సోదాహరణంగా, వినోదాత్మకంగా వివరించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా విచ్చేసిన బహుగ్రంథకర్త, నటుడు, అనువాదకుడు, కర్నాటాంధ్ర ద్విభాషారత్న గుత్తి చంద్రశేఖర రెడ్డి గారి పద్యాలను జువ్వాడి రమణ పాడివినిపించారు. ముఖ్య అతిథిని ఊరిమిండి నరసింహారెడ్డి సభకు పరిచయంచేయగా, శ్రీమతి కన్నెగంటి మంజులత పుష్పగుఛ్చంతో స్వాగతం పలికారు.

అనంతరం చంద్రశేఖర రెడ్డి “సాహితీ సమరాంగణ సార్వభౌముడు – శ్రీ కృష్ణ దేవరాయలు” అనే అంశంమీద ప్రసంగిస్తూ రాయల వారిగురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. రాయల పూర్వీకులు కొంతకాలం తుళు ప్రాంతాన్ని పాలించడం వల్ల తుళువ వంశీకులు అనిపించుకున్నారనీ, కన్నడ రాజ్యాన్ని పాలించడం వల్ల కృష్ణరాయలు కన్నడరాయడు అయ్యాడనీ ఐతే స్వతహాగా రాయల పూర్వీకులు తెలుగువారేననీ, రాయలు చూపరులను అకట్టుకునే చక్కని దరహాసవదనం కలవాడనీ, సంస్కృతంతో బాటు దక్షిణ భారత భాషలన్నింటిలొ పండితుడనీ, ఫారశీకం, పోర్చుగీసు తెలిసివాడనీ, వీణావాదన నేర్వడమేకాక క్లారినెట్ వంటి పాశ్చాత్యవాద్యాల లొ ప్రవేశం కలవాడనీ, రత్నపరీక్ష లొ నేర్పుగలవాడనీ, రైతుజన పక్షపాతి అనీ అన్నారు. అపజయం ఎరుగని మహావీరుడనీ, ఆడిన మాట తప్పని వాడనీ, అద్భుతమైన పరిపాలనాదక్షతగల చక్రవర్తి అనీ, ఆముక్త మాల్యదలొ ఆయన రాజనీతిజ్ఞత కు అద్దం పట్టే అనేక పద్యాలున్నాయనీ చెప్పారు. ఆయన రాజ్యంలొ ప్రజలు దొంగల భయం లేక నిర్భయంగా సంచరించేవారనీ, అంగళ్ళరతనాలు అమ్మడం దానికి నిదర్శనమనీ, అన్ని మతాలనూ గౌరవించేవాడనీ, దేవాలయాలతొ బాటు ఆయన కట్టించిన చర్చి, మశీదు ఇంకా ఉన్నాయనీ అన్నారు.

ఇంకా రాయల కావ్యరచన గురించి, యుధ్ధాలగురించీ, జీవితవిశేషాలగురించీ, ఎంతో సాధికారంగా వినోదభరితంగా ప్రసంగించి చంద్రశేఖర రెడ్డి, కృష్ణ దేవరాయలమీద తాను వ్రాసిన కొన్ని పద్యాలను చదివి తన ఉపన్యాసం ముగించారు.

అనంతరం ముఖ్య అతిథిని, TANTEX, TANA నాయకత్వం శాలువతో, సాహిత్య వేదిక కార్యవర్గం జ్ఞాపిక తో సత్కరించడంతొ సభ ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;