మహిళలలో నడుము నొప్పి.. ఈ ఆహారాలతో చెక్ పెట్టవచ్చు!


మహిళల శరీరం ప్రతి దశలో చాలా రకాల మార్పులకు లోనవుతుంది. ఋతుచక్రం మొదలైనప్పటి నుండి.. వివాహం, గర్బం,  ఆపరేషన్లు, మెనోపాజ్..  ఇలా చాలా కారణాల వల్ల మహిళల శరీరం పోరాడుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు  వయసు పెరిగే కొద్దీ నడుము నొప్పి వస్తుంది.  కింద కూర్చోవడం లేవడం,  బరువులు ఎత్తడం,  పిల్లలను ఎత్తుకోవడం, కొన్ని సార్లు ప్రశాంతంగా పడుకోవడానికి కూడా నడుము నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది.  40 ఏళ్ల వయసు తర్వాత, పోషకాహార లోపాలు, ఎముకల బలహీనత , జీవనశైలి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఎక్కువ సేపు కూర్చోవడం, సరైన పొజిషన్ లేకపోవడం , వ్యాయామం లేకపోవడం కూడా వెన్నెముకపై ఒత్తిడిని పెంచి, ఎప్పుడూ నడుము నొప్పిగా ఉండటానికి కారణం అవుతాయి. నడుము నొప్పికి చెక్ పెట్టాలంటే మహిళలు కొన్ని ఆహారాలు తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకూ నడుము నొప్పికి చెక్ పెట్టడానికి ఏ ఆహారాలు తినాలో తెలుసుకుంటే..

నడుము నొప్పికి ప్రత్యేక ఆహారం ఎందుకు ముఖ్యం..

నడుము నొప్పి కేవలం కండరాల సమస్య మాత్రమే కాదు, ఇది ఎముకల బలహీనత, వాపు , పోషకాహార లోపాలతో కూడా ముడిపడి ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి , మెగ్నీషియం లోపం శరీరాన్ని బలహీనపరిచి, నొప్పిని పెంచుతుంది. అందువల్ల  రోజువారీ ఆహారంలో పోషకమైన ఆహార పదార్థాలను చేర్చుకోవడం ముఖ్యం.

అల్లం, పసుపు..

అల్లం , పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది నడుము నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. పసుపు పాలు లేదా అల్లాన్ని టీ , ఆహారంలో కలుపుకోవచ్చు, ఇది కూడా నడుము నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

గుడ్లు,  రాగులు..

గుడ్లు కాల్షియం , విటమిన్ డికి మంచి మూలం, ఇవి ఎముకలను బలపరుస్తాయి. శాకాహారులకు రాగి ఒక అద్భుతమైన కాల్షియం కాంపౌండ్, ఇది ఎముకలను బలపరచడంలో సహాయపడుతుంది.

ఆకుకూరలు..

పాలకూర, మెంతి , క్యాబేజీ వంటి ఆకుపచ్చ ఆకు కూరలలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది , గాయాలను నివారించడంలో సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్, ద్రాక్ష..

డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం ఉంటుంది, ఇది ఎముకలకు చాలా అవసరం. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

చేపలు, ఆలివ్ నూనె..

చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి వాపును తగ్గిస్తాయి. ఆలివ్ నూనెలోని బలమైన మూలకాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతారు.

పులియబెట్టిన ఆహారాలు..

పెరుగు, ఇడ్లీ , దోస వంటి పులియబెట్టిన ఆహారాలలో విటమిన్ బి12 , ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి నాడీ వ్యవస్థను మెరుగుపరిచి, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

ఏ ఆహారాలు తీసుకోకూడదంటే..

కొన్ని రకాల ఆహారాలు నడుము నొప్పిని తీవ్రతరం చేస్తాయి. అధిక చక్కెర, ఉప్పు,  మైదా పిండితో చేసిన ఆహార  పదార్థాలు, వేయించిన ఆహారాలు , ప్రాసెస్ చేసిన ఆహారాలు వాపును పెంచి, ఎముకలను బలహీనపరుస్తాయి. అంతేకాకుండా, అధిక ఉప్పు శరీరం నుండి కాల్షియంను బయటకు తీసి, సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. కేవలం ఆహారపు అలవాట్లే కాకుండా, జీవనశైలిలో మార్పులు కూడా చాలా అవసరమని వైద్యులు నొక్కి చెబుతున్నారు. క్రమం తప్పకుండా  వ్యాయామం, సరైన పొజిషన్ లో కూర్చోవడం, నడవడం, నిలబడటం చాలా ముఖ్యం.   సమతుల్య ఆహారం నడుము నొప్పిని బాగా కంట్రోల్ లో ఉంచగలుగుతుంది.

                          *రూపశ్రీ.