గడ్డం వెంట్రుకలు ఎంత తొలగించినా తగ్గడం లేదా? అసలు కారణం చెప్పిన వైద్యులు!

మహిళలను చాలా ఇబ్బంది పెట్టే వాటిలో అవాంచిత రోమాలు ఒకటి. అది కూడా పై పెదవి పైన, గడ్డం మీద వెంట్రుకలు పెరగడం చాలా మంది మహిళలలో జరుగుతూ ఉంటుంది. గడ్డం మీద పెరిగే వెంట్రుకలు మహిళల అందాన్ని పాడుచేస్తాయి. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత, కొంతమంది మహిళల గడ్డం మీద కొన్ని దట్టమైన వెంట్రుకలు ఉండటం సాధారణం, కానీ కొంతమంది మహిళలలో ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఒకవేళ మహిళల గడ్డంలో కూడా మగవాళ్ల గడ్డంలాగే వెంట్రుకలు పెరుగుతుంటే.. అలాంటి మహిళలు హార్మోనల్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
గడ్డం మీద వెంట్రుకలు ఎప్పుడు వస్తాయి?
గడ్డం మీద వెంట్రుకలు ఏ వయసులోనైనా రావచ్చు, కానీ 30 ఏళ్ల వయసు తర్వాత ఈ సమస్య గురించి మహిళలు ఎక్కువగా ఫిర్యాదు చేస్తుంటారు. దీని తర్వాత, మెనోపాజ్ వచ్చే కొద్దీ, గడ్డం మీద వెంట్రుకల పెరుగుదల కూడా పెరుగుతుంది. కొంతమంది మహిళల్లో గడ్డం వెంట్రుకలు మగవారి గడ్డాన్ని పోలి ఉంటాయి. కొంతమంది మహిళల్లో, జన్యుపరమైన కారణాల వల్ల గడ్డం వెంట్రుకలు రావచ్చు, ఇది ఏ వయసులోనైనా సంభవించవచ్చు, కానీ హార్మోన్ల అసమతుల్యత ఉంటే, చిన్న వయసులోనే గడ్డం వెంట్రుకలు రావడం ప్రారంభం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
వయసు పెరిగే కొద్దీ గడ్డం మీద వెంట్రుకలు ఎందుకు వస్తాయి?
గడ్డం మీద వెంట్రుకలు రావడానికి వయసు కారణమైతే హార్మోన్లు మారుతున్నాయని అర్థం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పురుషులలో ఆండ్రోజెన్ అనే హార్మోన్ ఉంటుంది, దానివల్ల వారికి గడ్డం పెరుగుతుంది. కానీ ఈ హార్మోన్ స్త్రీలలో కూడా ఉంటుంది, అయితే పురుషులతో పోలిస్తే చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. స్త్రీలలోని ఆండ్రోజెన్, అండాశయాలు సరిగ్గా పనిచేయడానికి, ఎముకల సాంద్రతను బాగుండటానికి , కండరాల పరిమాణాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ, స్త్రీలు మెనోపాజ్ దశకు చేరుకుంటున్నప్పుడు, ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం ప్రారంభమై, ఆండ్రోజెన్ స్థాయి పెరగడం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో, స్త్రీల గడ్డం మీద, కొన్ని సందర్భాల్లో ముఖం మీద కూడా దట్టమైన, గరుకైన వెంట్రుకలు రావడం జరుగుతుంది.
వ్యాక్సింగ్ లేదా థ్రెడ్డింగ్ చేస్తే వెంట్రుకల పెరుగుదల ఎక్కువ అవుతుందా?
మహిళలకు గడ్డం మీద వెంట్రుకలు ఉంటే వాటిని తొలగించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రోమాలను తొలగించడానికి వాక్సింగ్ , థ్రెడింగ్ అనేవి రెండు అందరూ ఉపయోగించే పద్దతులు . అయితే, వాక్సింగ్ లేదా థ్రెడింగ్ వల్ల రోమాలు మరింత ఎక్కువగా లేదా దట్టంగా తిరిగి పెరుగుతాయని చాలా మంది మహిళలు భయపడతారు. కానీ, చర్మవ్యాధి నిపుణులు ఇది నిజం కాదని చెబుతున్నారు.
నిజం ఇదే..
గడ్డం వెంట్రుకలను తొలగించే ఏ పద్ధతితోనూ గడ్డంపై ఉండే వెంట్రుకలు మరింత దట్టంగా పెరగవు. వాస్తవానికి, ఈ విధంగా వెంట్రుకలను తొలగించిన వెంటనే అవి తిరిగి పెరుగుతాయి. ఈ వెంట్రుకలను ప్లాకర్లు లేదా దారంతో చాలా వేగంగా తొలగిస్తే, చర్మంలో వాపు వచ్చే అవకాశం ఉంది, దాని కారణంగా గడ్డంపై ఇన్గ్రోన్ హెయిర్ ఉంటుంది. అది పెరగడం వల్ల చాలామంది వెంట్రుకలు తొలగిస్తే మరింత దట్టంగా పెరుగుతాయని అనుకుంటారు.
మరొక పద్దతి..
గడ్డం మీద వెంట్రుకలను తొలగించడానికి మరో పద్ధతి కూడా ఉంది, ఆ పద్ధతే షేవింగ్, దీన్ని మహిళలు ఎక్కువగా ఉపయోగించరు. కానీ దీని కోసం మహిళలకు ప్రత్యేక రేజర్లు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల కూడా వెంట్రుకలు పెరుగుతాయని చాలా మంది మహిళలు భయపడతారు. కానీ వాస్తవానికి అది నిజం కాదు, షేవింగ్ చేయడం వల్ల వెంట్రుకలు పెరగవు.
షేవింగ్ వెంట్రుకలను కుదుళ్ల నుండి తొలగించదు, కానీ వాటిని మధ్యలో నుండి కత్తిరిస్తుంది. అందువల్ల, అవి వేగంగా తిరిగి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెంట్రుకలు సాధారణంగా ముందు భాగంలో పలుచగా, వెనుక భాగంలో ఒత్తుగా ఉంటాయి. ఒత్తుగా ఉన్న భాగం నుండి కత్తిరించడం వల్ల అవి మరింత ఒత్తుగా కనిపిస్తాయి. అందువల్ల,షేవింగ్ తర్వాత జుట్టు మరింత ఒత్తుగా పెరుగుతుందని మహిళలు తరచుగా అనుకుంటారు.
మహిళలకు గడ్డం మీద వెంట్రుకలు పెరిగితే వాటిని శాశ్వతంగా తొలగించుకోవడానికి లేజర్ లేదా ఎలక్ట్రోలైసిస్ వంటివి మంచి పద్దతులు. వీటి వల్ల గడ్డం మీద వెంట్రుకల పెరుగుదల శాశ్వతంగా ఆగిపోతుంది.
*రూపశ్రీ.




