Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 6

    "అయితే మీరు గీరు మానేసి నన్ను సురేష్ అనాలి. ఓ.కె. నిజంగా ఈ ఇరవై రోజులలో మనం ఇంత ఫ్రెండ్స్ లా అయిపోయాం అంటే ఆశ్చర్యంగా వుంది ఇప్పుడు. ఈ టైపు ధర్మమా అని మనం ఫ్రెండ్స్ అయ్యాం....రూపా టు టెల్ యూ ఫ్రాంక్ లీ.....ఐ లైక్ యూ, కొంతమంది అమ్మాయిలాలా మాట్లాడితే సిగ్గుతో ముడుచుకుపోకుండా మగాళ్ళతో తప్పన్నట్టు ప్రవర్తించే అమ్మాయిలని చూస్తే నాకు ఎలర్జీ....నీలా ధైర్యంగా, ప్రాంక్ గా, ఫ్రెండ్లిగా వుండే అమ్మాయిలు అరుదు. మీ ఆడపిల్లలు ఎంతసేపూ డ్రస్సులు వేసుకోవడంలో తప్ప మిగతా వాటిల్లో ఫార్ వార్డ్ గా వుండరు. ఎన్ని కబుర్లు చెప్పినా మళ్ళి మగాళ్ళతో ఫ్రీగా వుండరు. అంచేత ఐ లైక్ యూ" అన్నాడు మెచ్చుకోలుగా.
    రూప పొంగిపోయింది ఆ పొగడ్తలకి. అతని ఐ లైక్ యూ అన్నమాట ఆమెకి బాగా నచ్చింది. ఆ రాత్రి రూప ఒక్కక్షణం నిద్రపోలేకపోయింది, ఎటు చూసినా సురేష్ రూపం తప్ప మరోటి కనపడలేదామెకి. 'ఐ లైక్ యూ ' అన్న.....అతని పొగడ్త 'ఐ లవ్ యూ' లా ఆమె మీద పనిచేసింది. 'ఐ టు లైక్ యూ' సురేష్. 'ఐ లవ్ యూ.....ఐ లవ్ యూ....' మనసులో పదే పదే అనుకుంటూ మంచం మీద దొర్లుతూ ఆ రాత్రంతా జాగారం చేసింది.
    తరువాత రెండు నెలల్లోనే వారి ప్రేమ పరాకాష్ట చేరింది. రూప సురేష్ ని మనసారా ప్రేమించింది. అతని కోసం ఏం చేయ్యదనికన్నా సిద్ధపడేంతగా అతని ప్రేమని నమ్మింది. అతనికోసం, ఆ ప్రేమకోసం లోకాన్ని కూడా లెక్కచెయ్యలేదు. ఎవరన్నా చుస్తారేమోనన్నా భయమన్నా లేకుండా అతనెక్కడికి రమ్మంటే అడ్డు చెప్పకుండా విచ్చలవిడిగా తిరిగింది. తల్లీ తండ్రి ఏమంటారోనని కూడా ఆలోచించలేదు. రోజుకో అబద్దం ఆడి రోజు ఆలస్యంగా ఇల్లు చేరేది. మొదట్లో పద్మావతి అడిగినప్పుడల్లా అబద్దాలు చెప్పేది.
    పద్మావతి కేకలు వేస్తె ఏం ఫ్రెండ్స్ తోను ఎక్కడికి వెళ్ళనేమిటి అని దబాయించేది. ఎవరన్నా తెలిసినవాళ్ళు కనిపించితే ఇంట్లో తల్లితండ్రులకి చెప్తారేమోనన్నా ఆలోచన కూడా రాలేదు. అంతలా అతని ప్రేమ మైకంలో మునిగిపోయింది. సురేష్ - సురేష్ తప్ప మిగతాలోకం ఒకటుందన్న విషయం ఆ మూడు నెలల్లో ఆమెకి గుర్తు రాలేదు. సినిమాలు, పబ్లిక్ గార్డెను, టాంక్ బండ్ ఇవన్ని పాతపడిబోయి కొత్త అనుభవం కావాలనిపించింది.....సురేష్ యధాలాపంగా వేసినట్టు మాటలమధ్య ఆమె చెయ్యి మీద చెయ్యి వేశాడు.
    అదే మొదటి పురుష స్పర్శ. అందులో తను ప్రేమించిన సురేష్ స్పర్శకి రూప తనువెల్లా పులకరించింది. అమెనించి ఏమి అభ్యంతరం రాకపోవడంలో ఆ చేతిని లాక్కోకుండా మరి కాస్ ముందుకు జరిపి ఆమె చెయ్యి చేతిలోకి తీసుకుని "రూపా!" అన్నాడు నెమ్మదిగా. ఆమె చెయ్యి తన చేతిలో బిగించి.....రూప మాట్లాడలేని ఏదో స్థితిలో ఉండిపోయింది.
    "కోపం వచ్చిందా రూపా......" మృదువుగా అడిగాడు సురేష్. తల అడ్డంగా మాత్రం తిప్పగలిగింది రూప.
    "అమ్మయ్య....నీకు కోపం వస్తుందేమో, తిడతావేమో ననుకున్నాను రూపా!
    నిన్ను చూస్తుంటే......నిన్నలా చూస్తూ ఊరికె వుండాలని ఎంత కష్టంగా వుందోతెలుసా? అసలు నీవు ఎందుకు ఈ టైపు ఇన్ స్టిట్యుట్ కి వచ్చావు? అసలు నీవు ఇంత అందంగా ఎందుకున్నావు రూపా?" అన్నాడు ఏదో పడరాని యాతన పడుతున్నట్టు
    రూప ఆ మాటలకి కరిగిపోయింది. తనమీద అతనికి కల్గిన ప్రేమకి మురిసిపోయింది.
    "రాకపోతే నీవెలా కన్పించేవాడివి సురేష్. మనిద్దరం దగ్గరయ్యేవాళ్ళం......"
    "దగ్గరెక్కడ అయ్యాం. దగ్గరెక్కడ అవనిచ్చావు. చూడు మన మధ్య ఎంత దూరం వుందో" గడుసుగా తమ మధ్య దూరం చేతితో కొలిచి అన్నాడు.
    "ఇన్నాళ్ళకి చెయ్యి పట్టుకోనిచ్చావు" అని కూడా చేర్చాడు.
    "ఏయ్.....నేరం నా మీదకి తోస్తావా? నిన్ను గిరిగిసి నిల్చోమన్నానా?" సురేష్ మొహం విప్పారింది.
    "ఈజిట్ వాటే ఫూల్ ఐయామ్! చూశావా ఇన్నాళ్ళు ఎలా వృధా చేశానో" అంటూ రూప ప్రోత్సాహంతో అతని మనసు ఉరకలు వేసింది.
    "ఇంత అందాన్ని పక్క నుంచుకుని ఎన్ని రోజులు కాలయపం చేశాను. పశ్చాతాపడుతున్నట్టు అంటూ ఆమె చెయ్యి అందుకుని "రూపా ఇంకా ఫూల లా ప్రవర్తించను" అంటూ ఆమె దగ్గరికి జరిగి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి "మై రూపా! మై లవ్! మై డార్లింగ్.....ఐ లవ్ యూ" అంటూ ఆమె పెదాలు అందుకున్నాడు.
    రూపకి ప్రపంచం అంతా గిర్రున తిరిగి చికటయినట్లు పరవశురాలైపోయింది ఒక్కక్షణం తరువాత ఆవేశంగా రెండుచేతులు అతని మెడచుట్టు వేసి గట్టిగా బిగించింది.
    "సురేష్..." అంటూ గొణిగింది.
    సురేష్ కి అదే మొదటి అనుభవం కాబోలు సన్నగా వణికాడు.
    "రూపా, ముద్దు ఇంత తియ్యగా వుంటుందని తెలిస్తే నీవు చెంపదెబ్బ కొట్టినా ముందురోజే పెట్టుకునేవాడిని. రెండు నెలల్లో ఎన్ని కిస్ లు..... రోజుకొకటి చూసినా అరవై మిస్సయ్యేవాడ్ని గాను చచ్చినా"అన్నాడు ఆమె మొహం అంతా పెదాలతో అద్దుతూ.
    "సురేష్....సురేష్" ఆమె ఇంకేమి చెప్పలేకపోయింది ఆ క్షణాలలో.
    అలా అవకాశం వచ్చినప్పుడల్లా ఏకాంతం కోసం వెతుక్కుని ఏ గార్డెన్సు లోనో, సినిమా హాలులోనే అవకాశం వున్నంత మేరకు సురేష్ ఆ అవకాశాన్ని వృధా పోనిచ్చేవాడు కాడు. అందుకు రూప ప్రోత్సాహమూ తక్కువ లేదు. అలా ఒక నెల గడిచాక ఆ చిన్న చిన్న అనుభవాలు, అనుభూతులతో సురేష్ తృప్తి పడలేకపోయాడు. కాస్త రుచి చూసి పూర్తిగా తినకుండా వదలడం ఎవరికన్నా కష్టమే. స్రీతో అనుభవం అసంపూర్తిగా విడిచిపెట్టడం ఏ పురుషుడికి ఇష్టం ఉండదు. రూప అతని దూరంగా హద్దులో వుంచితే ధైర్యం చేయడానికి జంకేవాడెమో కాని, రూప వైపు నించి అభ్యంతరం ఏమి లేకపోవడంతో తను వట్టి ఫూల్ లా ఇన్నాళ్ళు అందిన అవకాశాన్ని వృధా పోనిచ్చేస్తున్నాన్న భావం కల్గింది సురేష్ కి.
    ఇంత ముందుకు వెళ్ళినవాడు మరికాస్త ముందుకు వెళ్ళడానికి భయం ఎందుకు? రూప అంతగా వద్దంటే అప్పుడు చూడొచ్చు మగాడు తను ముందడుగు వేయాలి గాని రూప ఎలా వేస్తుంది అని ఆలోచించి ఓ రోజు
    "రూపా? రేపు నీకో సర్ ప్రైజ్" అన్నాడు ఊరిస్తున్నట్టు.
    "ఏమిటి?" అంది కుతూహలంగా,
    "ఉహూ .....ఇప్పుడు నీకేం చెప్పను. రేపు సాయంత్రం సరిగ్గా ఆరుగంటలకి హోటల్ 'ద్వారకా' దగ్గరకు రావాలి నీవు అన్నాడు.
    "ఏమిటి పార్టీ ఇస్తావా, రేపు నీ బర్త్ డేనా? ప్లీజ్ సురేష్! చెప్పు చెప్పు సేస్పెన్సులో పెట్టి చంపకు" అంది బతిమాలుతూ.
    రూప ఎంత ప్రాధేయపడినా వూరించాడు తప్ప చెప్పలేదు. ఆఖరికి మర్నాడు ఆరుగంటలకి వచ్చాక చెబుతానని తప్పించుకున్నాడు. ఆ రాత్రంతా ఏమై వుంటుందా అని ఊహగానాలు చేసింది రూప. ఆఖరికి సురేష్ బర్త్ డే అయివుంటుంది పార్టీ ఇస్తాడు అనుకుంది.
    మర్నాడు హోటలు కెళ్ళాలని మరికాస్త శ్రద్దగా అలంకరించుకుని, మరింత మంచి చీరకట్టుకుని ఇంట్లో-ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కనుక కాస్త ఆలస్యం అవుతుంది రావడం అని చెప్పి బయలుదేరింది. హోటలు బయట సురేష్ ఎదురుచూస్తూ నిల్చున్నాడు.
    "ఇప్పుడు చెప్పు ఏమిటి సంగతి?" అంది ఆరాటంగా రూప.
    "అరే అంత గాభరా ఎందుకు? లోపలికిరా తెలుస్తుంది" అంటూ ఆమెని వెంటబెట్టుకుని రెండో అంతస్థులో ఒక రూము దగ్గరికి తీసుకెళ్ళాడు. రూము తాళం తీస్తుంటే రూపకి కాస్త అనుమానం వచ్చింది. తాళం తీసి రూప లోపలికి రాగానే ఒక్క ఉదుటున రూప గట్టిగా కౌగలించుకుని గుండెలకి హత్తుకుని ఆవేశంగా నలిపేస్తూ "ఇందుకు రమ్మన్నాను అర్ధమైందా డార్లింగ్" అన్నాడు వణుకుతున్న గొంతుతో.
    రూప అతని కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి అయింది ఒక్కక్షణం.
    అతని ఆవేశం చూడగానే మొదటిసారిగా రూప భయపడింది. ఏదో తెలియని భయంతో ఆమె మొహం పాలిపోయింది. అతని కౌగిలినించి విదిపించుకోడానికి ప్రయత్నిస్తూ
    "వదులు సురేష్! ముందు వదులు. ఇందుకా తీసుకొచ్చావు ఇలా అంటే రాకపోదును వుండు సురేష్ ప్లీజ్ నాకు భయంగా వుంది. నన్ను వదులు" అంది దీనంగా. ఆమె పరిస్థితి ఏమిటో ఆమెకే తెలియదు. సురేష్ కౌగిలిలో కరిగిపోవాలని అతని సన్నిధిలో మైమరచిపోవాలని వుంది ఒక పక్క ఏదో భయం ఏదో తప్పు చేస్తున్నాన్న భావం, ఎవరికన్నా తెలిస్తే, ఏదన్నా అయితే, అమ్మో, అమ్మ, నాన్న చంపేస్తారు. ఈ భయాలు ఆమె వివేకాన్ని తట్టిలేపాయి.
    "రూపా డార్లింగ్! నీ కోసం తపించిపోతున్నాను ఇన్నాళ్ళు. ఈ అవకాశం కోసం ఎంతలా వెయిట్ చేశానో తెలుసా?" తమకంగా చూస్తూ ఆమె పెదాలు అందుకున్నాడు.
    నిగ్రహించుకోవడం రూప వశం కాలేకపోయింది. అతని భుజం మీద తల వాల్చి కంపిస్తున్న గొంతుతో
    "వద్దు సురేష్! పెళ్ళవకుండా ఇది వద్దు సురేష్! ఇన్నాళ్ళు నిన్నేప్పుడయినా వద్దన్నానా .....ఇది వద్దు సురేష్. మా అమ్మ నాన్నకి తెలిస్తే చంపేస్తారు. పెళ్ళవకుండా ఇది వద్దు" అంది అతని కొగిలినించి తప్పించుకుంటూ.
    సురేష్ మొహం ఎర్రబడింది. అతని ఉత్సాహం చప్పున చల్లారిపోయింది.
    డిసపాయింట్ మెంట్ తో అతనికి కోపం వచ్చింది. జేబులో డబ్బులేకపోతే ఒక ఫ్రెండు దగ్గిర అప్పు తెచ్చి ఒక గంట కోసం! ముప్పై నలభై ఖర్చు పెట్టడానికి సిద్దపడి ఆశగా ఎదురుచూసింది అనుభవంలోకి రాకుండా రూప వారించడంతో సురేష్ మొహం గంటు పెట్టుకున్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS