Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 5

    "దాన్ని నీవే పాడు చేస్తున్నావు. దాని ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు నీ ఇష్టం, నీ కూతురిష్టం నాతో ఎందుకు చెప్పడం" అని విసుక్కుని ఊరుకున్నరాయన.
    రూప సంబరంగా టైపు ఇన్ స్టిట్యుట్ కి వెళ్ళడం ఆరంభించింది. మొదటిరోజు అక్కడ అంతమంది అపరిచితుల మధ్య సురేష్ ని చూడగానే చాలా సంతోషం కలిగింది. పెద్ద హాలు, టైపు మిషన్స్  వున్నాయి. పది పన్నెండు మంది ఆడపిల్లలు, మిగతా అంతా మగవాళ్ళు. వాళ్ళలో టినేజ్ వాళ్ళున్నారు. కొందరు 30-40 ఏళ్ళ వాళ్ళున్నారు. పార్ట్ టైంగా సాయంత్రం వచ్చి నేర్చుకునేవాళ్ళు చాలామంది వున్నారు.
    టైపు నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో చాలామంది నేర్చుకుంటున్నారు. టైపు, షార్టుహ్యాండ్, నేర్చుకుంటే అన్నింటికి మంచిదని సెలవుల్లో వచ్చి నేర్చుకునే కాలేజి పిల్లలూ వున్నారు. రోజుకి ఆరు షిప్టులతో ఎప్పుడు ఆ ఇన్ స్టిట్యుటట్ బిజీగానే వుంటుంది.
    సురేష్ ఇల్లు అక్కడికి దగ్గరవడం, ఖాళీగా వున్నానని అతను నేర్చుకోవడానికి పదిహేనురోజులనించి రావడం ఆరంభించాడు. సురేష్ బి.కాం. రూప బి.ఏ. రూపకి సీనియర్ అయినా ఇద్దరూ ఒకే కాలేజి అవడంతో చాలాసార్లే చూసింది రూప. అంతేకాక సురేష్ కాలేజి డ్రామాలలో చాలా సార్లు యాక్టు చేశాడు. ఏకపాత్రభినేయాలు, ఫాన్సీ డ్రస్సులు అన్నింట్లో ఫస్టు ఫ్రైజులు కొట్టేసి అమ్మాయిల దృష్టిలో హిరో అయ్యాడేమో - రూపకి అతను బాగా గుర్తే.
    సురేష్ అమ్మాయిలు కలలుకనే హిరోలా వుంటాడు. 5అడుగుల 11 అంగుళాలు. మంచి రంగు, పొడవుకు తగ్గ లావు -షోగ్గా పెంచిన మీసాలు, సైడ్ బరన్స్- మంచి మడత నలగని డ్రస్సులు. టిప్ టాప్ గా చాలా కలివిడిగా, జోక్స్ కట్ చేస్తూ అందరిని చుట్టూ తిప్పుకునే చకా చక్యాలున్నవాడు. నాటకాలలో అతని వేషాలు చుసిన చాలామంది అమ్మాయిలకి హిరో వర్షిప్ అతనంటే ఆ కాలేజిలో, రూప క్లాస్ మేట్స్ కూడా అతడంటే పడి చచ్చేవారు కొంతమంది. అప్పుడు అతని గురించి రూప అంత పట్టించుకోలేదు. ఏదో ఒకటి రెండుసార్లు మామూలు మాటలు తప్ప అంత పరిచయం లేదు అతనితో.
    కాని ఆ రోజు అంతమంది అపరిచిత అమ్మాయిలు. అబ్బాయిల మధ్య సురేష్ కనబడగానే ఏదో అప్తమిత్రుడిని ఏదో చాలా రోజుల తర్వాత చూసినంత ఆనందం కలిగింది. సురేష్ కూడా రూప చూడగానే కాలేజిమేట్  అని గుర్తించి సంతోషంగా "అరే! మీరు టైపు నేర్చుకోడానికి వచ్చారా?" అన్నాడు.
    "ఊ....మీరూ నేర్చుకుంటున్నారా? ఎన్నాళ్ళనించి?" కుతూహలంగా అడిగింది రూప.
    "ఏది మొన్నే! పది పదిహేను రోజులనించి వస్తున్నాను. సెలవుల్లో తోచడంలేదు.
    పోనీ సాయంత్రం ఏదో కాలక్షేపం. ముందు ముందు ఎందుకన్నా పనికొస్తుందని. ఇంకా ఉద్యోగం దొరక్కపోయినా ఏ టైపిస్టూగానో, ఏ ఆఫీసులోనే పని దొరక్కపోతుందా అని వచ్చాను నేర్చుకోవడానికి" అన్నాడు నవ్వుతూ.
    "మరి మీరు? టైపు షార్టుహండు కూడా నేర్చుకుంటే మీలాంటి అందమైన అమ్మాయిలకి సెక్రటరిలుగా, రిసెప్షనిస్టులుగా మంచి ఉద్యోగాలు గ్యారంటిగా దొరుకుతాయి" అన్నాడు చనువుగా.
    అందమైన మీలాంటి అమ్మాయిలు అన్న అతనిమాట రూప మీద మొదటి క్షణంలోనే పని చేసింది. తన అందాన్ని పరోక్షంగా పొగడిన అతను ఆమెకి చాలా నచ్చాడు. ఒక టినిజ్ ఆడపిల్ల హృదయాన్ని ఎలా మిటాలో అలా మిటి వదిలాడు ఆ ఒక్కమాటతో సురేష్.
    "నేనూ వురికే కాలక్షేపానికి వచ్చాను. అబ్బ ఈ నెలకే యింట్లో కూర్చునేసరికి బోర్ కొట్టిపోయింది. మా ఇల్లు హిమాయత్ నగర్ లో . వాకింగ్ డిస్టెన్స్ సరే అని వచ్చాను." అంది రూప.
    "అరే మీ ఇల్లు హిమాయత్ నగర్ లోనా! చూశారా ఇన్నాళ్ళబట్టి వా విషయం తెలియదు. ఆఫ్కోర్స్ మీరు క్లాస్ మేట్ కాదుగా. లేకపోతే మీ ఎడ్రసు? బయోడేటా అంతా మాకు చేరేది ఎప్పుడో. పోనిలెండి ఇప్పుడు ఎక్కించుకొంటాను డైరీలో" అన్నాడు గమ్మత్తుగా నవ్వుతూ, రూప ఆ నవ్వుకి ఆ చూపుకి ముగ్డురాలైంది మొదటి క్షణంలోనే.
    ఆ తర్వాత మూడు నెలల్లో వాళ్ళిద్దరూ చాలా సన్నిహితులయిపోయారు. మొదట్లో ఇద్దరూ టైపు నేర్చుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు. ఇంటికేల్లెటప్పుడు నెమ్మదిగా ఈ మాట ఆ మాట మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి వెళ్ళేవారు. కాలేజి విషయాలు సినిమాలు, పుస్తకాలు, ఫ్రెండ్సు......ఇద్దరి కబుర్లకి అంతు వుండేది కాదు.
    రూపకి స్నేహితులుంటే చాలు మాటలు అలా దొర్లిపోయాయి. అందులోసురేష్ చమత్కరమో ఆ మాటల ప్రభావానికి చాలా తొందరలోనే ఆకర్షితురాలైంది.
    వారి పరిచయం పదిహేను రోజులు గడిచేసరికి మంచి స్నేహంగా మారింది.
    "ఇంకా ఆరు కూడా అవలేదు. అప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తారు? కాసేపు అలా టాంక్ బండ్ మీద కూర్చుందామా" అనేవాడు సురేష్. అంతకంటే రూపకేం కావాలి 'ఓ యస్' అంది రూప.
    "అరే లిబర్టిలో మంచి ఇంగ్లిషు పిక్చర్ వచ్చిందే" అనాడొకరోజు. సినిమా అయితే చాలు ఎంత చెత్తయినా చూడడానికిష్టపడే రూప సంబరంగా "వెడదామా?" అంది ఆరాటంగా.
    తను పిలిస్తే అభ్యంతరం చెపుతుందేమోనని సందేహించిన సురేష్ ఆమె అడగ్గానే చాలా ఆనందించాడు. ఆ రోజు సురేష్ తో కల్సి చూడటం రూపకి కొత్త అనుభవం. ఇదివరకు గర్ల్ ఫ్రెండ్సుతో వెళ్ళింది. ఒకటి రెండుసార్లు క్లాసు పిల్లలందరూ ఫేర్ వెల్ పార్టీ అంటూ పార్టీ చేసుకుని పిక్చరు కెళ్ళారు. ఇలా బాయ్ ప్రెండుతో ఒంటరిగా రావడం అదే ప్రధమం రూపకి. సురేష్ పక్కన కుర్చుని పిక్చర్ చూడటం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది ఆమెకి.
    అసలే ఇంగ్లిషు పిక్చరు, దానికి తోడు రొమాంటిక్ పిక్చరేమో సినిమా అంతా ముద్దులు, కౌగలింతలు, సురేష్ ని పక్కనుంచుకుని అవన్నీ చూస్తుంటే ఏదో అయింది. దానికి తోడు సురేష్ తెరమీద అలాంటి దృశ్యాలు వచ్చినప్పుడల్లా రూప వైపు కొంటెగా చూస్తూ నవ్వాడు. చీకట్లో కూడా అతని కళ్ళలో మెరుపు, ఆ కళ్ళలో మెదలిన భావం స్పష్టం చూసి రూప సిగ్గుపడింది.
    సురేష్ చెయ్యి అంటి అంటనట్టు అప్పుడప్పుడు ఆమెకి తగులుతుంటే ఏదో తెలియని పులకింత, మరేదో తెలియని అనుభూతిని కల్గించింది. రూప మొదటిసారిగా సినిమా సరీగా చుదలేకపోయింది. తెరవైపు చూసున్న కధ ఏం జరుగుతుందో అసలు తలకెక్కలేదు. రూప సిగ్గుపడటం చూసి సురేష్ "వై యూ ఆర్ సో అన్ కంఫర్టబుల్, సిగ్గేస్తుందా?" అని చెవి దగ్గర నోరుపెట్టి కొంటెగా అన్నాడు.
    "బాగోలేవు ఆ సీన్లు. మనవాళ్ళ లవ్ సీన్లు వల్గర్ గా వుంటాయి. ఇవి చూడండి ఎంత నేచురల్ గా వుంటాయి చూస్తుంటే? అసహ్యం అన్పిస్తుందా నిజం చెప్పండి బాగులేదు హౌ డు యూ లైకిట్" అన్నాడు ఆమె వైపు వంగి. ఆమె మొహం మీదని అతని వెచ్చని ఊపిరి తగిలింది. "ఊడో" సువాసన, అతను రాసుకున్న "లిరిల్" పౌడరు వాసన రూపని మైమరుపులో పడేశాయి.
    అతని కళ్ళలో కళ్ళు కలపలేక తలదించుకుంది. ఆమె శరీరం చిన్నగా వణికింది. రూపాలి అలజడి గుర్తించాడు సురేష్. అతనికి అమ్మాయితో ఇలాంటనుభవం మొదటిదే! రూప వైఖరి అన్ని విధాలా పోత్సహకరంగా వుండటంతో అతనిలో ఉత్సాహం పెరిగింది. తను ఎక్కడికి రమ్మన్నా అభ్యంతరం చెప్పకపోవడం, సినిమాకి కూడా ఒంటరిగా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారని కూడా భయపడకుండా రావడం అతన్ని ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించాయి.
    "రూపా!...." హాఠాత్తుగా అన్నాడు. అన్నాళ్ళు 'రూపగారు' అనే సురేష్ 'రూపా' అనగానే ఆ గొంతులో మార్పుకి ఆశ్చర్యపడి తలతిప్పి చూసింది.
    "సారీ రూపగారు...."
    "వద్దు వద్దు.... అలాగే పిలవండి" అంది రూప.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS