Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 5


    
                                              3
    
    మంజుభార్గవితో స్నేహం ఎంత వదిలించుకుందామన్నా కుదరటంలేదు. తాను వాళ్ళింటికి వెళ్ళకుండా వున్నా ఆమె ఏదో పని కల్పించుకుని తమ ఇంటికి వస్తూ వుండేది. ఆమె మాట్లాడే తీరుకూడా చాలా యిబ్బంది కలిగిస్తూ వుండేది.
    
    "మీరు కొత్తగా కాపురం పెట్టారుకదా ఫామిలీ ప్లానింగ్ చేస్తున్నారా?"
    
    "ఫామిలీ ప్లానింగ్ చెయ్యడానికి మీరు ఏ మెథడ్స్ ఉపయోగిస్తున్నారు?
    
    "మీది కొంచం అర్ధడాక్స్ ఫ్యామిలీ అనుకుంటాను. నెఫ్ షెల్స్ ముహూర్తం పెట్టి పెద్దవాళ్ళు ఎరేంజ్ చేశారా? లేక మీరే..."
    
    "మీరు మరీ అంత పూర్వోత్తరంగా వుంటే లాభంలేదు. పూజలూ అవీ ఎక్కువగా చేస్తే శరీరానికీ, మనస్సుకూ శ్రమేగాని, ఊరట వుండదు. ప్రతి మనిషికీ పురుషుడికి గాని స్త్రీకిగాని రిలీఫ్ వుండాలి. యీ జీవితానికి ప్రయోజనం శూన్యం."
    
    "అన్నట్లు మీ హజ్బెండ్ కి గర్ల్ ఫ్రెండ్స్ వున్నారా?"
    
    చిన్మయికి ఆ మాటలు వింటూంటే శరీరమంతా కంపరంగా వుండేది. ఆమెతో చాలా కటువుగా వ్యవహరించాలనుకునేది. కాని మొహమాటం అడ్డొచ్చి ముక్తఃసైర్గా జవాబు ఇచ్చేది.
    
    భవానీపతిరావుకు యాభయి అయిదేళ్ళుంటాయి. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు కొడుకులు లేరు. పెద్దకూతురికి యిరవై ఏడేళ్ళుంటాయి. తర్వాతమ్మాయికి పాతిక, ఆ తర్వాత యిరవైమూడు. వాళ్ళలో ఎవరికీ పెళ్ళిళ్ళు కాలేదు. ఆయన కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసే ప్రయత్నాలుకూడా ఎక్కువగా చేసినట్లు కనబడడు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదన్న బాధకూడా ఆయనలో వున్నట్లు లేదు. ఎప్పుడూ నీట్ గా బట్టలేసుకుని, జరదా కిళ్ళీ నముల్తూ పూలరంగడిలా కనబడతాడు. ఆయన ఏం బిజినెస్ చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. స్థలాలు కొనటం, అమ్మటం, బ్రోకరేజ్ లాంటివి చేస్తుంటాడని చెప్పుకుంటారు. ఆయన ఏం చేస్తున్నదీ యింట్లో పెళ్ళానికి కూడా చెప్పడు. ఎప్పుడన్నా పెళ్ళాం అడిగితే "నీకెందుకు? యింట్లోకి ఏం కావాలన్నా తెచ్చిపడేస్తున్నా కదా?" అంటాడు. కూతుళ్ళ పెళ్ళిళ్ళగురించి భార్య ఎప్పుడన్నా ప్రస్తావిస్తే "అవుతాయి, తొందర పడితే అవుతాయా? అప్పటికీ అందరితో చెబుతూనే వున్నాను" అనేవాడు తాపీగా రాత్రుళ్ళు వంటిగంట లోపున ఎప్పుడూ ఇంటికి వచ్చేవాడు కాదు. ఏం చేసేవాడో, ఎక్కడ తిరిగేవాడో ఎవరికీ తెలిసేది కాదు ఎప్పుడూ ఖుషీగా నిశ్చింతగా కనిపించేవాడు.
    
                                                                * * *
    
    రాత్రి ఎనిమిది దాటింది. కళ్యాణచక్రవర్తి యింకా యింటికి రాలేదు. ఆనందకు మూడ్స్ మారిపోవడం క్షణాలమీద జరిగిపోతూ వుంటుంది. అంత చకచకా మూడ్స్ మార్చుకునే ఆనందను చూస్తుంటే అది ఓ గొప్ప కళేమో అనిపిస్తుంది. ఆమె చీటికీ మాటికీ మొహం మాడ్చుకోవడం చూస్తూ వుంటే అల అమోహం మాడ్చుకోవడం ఆమె జీవితధ్యేయమేమో ననిపిస్తుంది.
    
    సర్వెంట్ మెయిడ్ తను చెప్పినట్లు చెయ్యకపోయినా, ఏ చెంచానో, పట్టకారో వెంటనే కనిపించకపోయినా, గ్యాస్ అయిపోగానే వెంటనే సిలెండర్ రాకపోయినా, యింట్లో కరెంట్ పోయినా వెంట వెంటనే ఆమె మూడ్స్ మారిపోతూ వుంటాయి. గంటకున్న అరవై నిముషాల్లో పదినిముషాలసేపు ఆమె మామూలుగా వుంటుంది. యాభయి నిముషాలు మూడ్స్ లో వుంటుంది.
    
    ఆమెకి మనుషులమీద నమ్మకంలేదు. మనుషుల కేరక్టర్ మీద నమ్మకం లేదు. మనుషుల మంచితనంమీద నమ్మకంలేదు. ఆమె కళ్ళకెప్పుడు యితరులు దోషులుగా కనిపిస్తూ వుంటారు.
    
    పైగా తన ప్రవర్తనమీద, తన అభిప్రాయాల మీద ఆమెకు విపరీతమైన నమ్మకం. నిముషాలు గడచిన కొద్దీ ఆనందకు కోపం పెరిగిపోతోంది. భర్తంటే అసహ్యం పెరిగిపోతోంది.
    
    కాసేపు తనమీద తనకి జాలివేసింది. తాను ఆడది. పెళ్ళయ్యేముందు ఎంతోహాయిగా, అల్లరిగా, ఆనందంగా వుండేది. ఇటీవల సుఖమే కరువై పోయింది.
    
    మనస్సుకి సంతోషం వుండడం లేదు. తాను చాలా కష్టాలు పడిపోతోంది. అన్యాయానికి గురయిపోతోంది.
    
    అసలు ఈ మొగుళ్ళంతా దుర్మార్గులు, వ్యసనపరులు ప్రతివాళ్ళు సిగరెట్టు కాలవడమో, త్రాగడమో, యింట్లో బంగారంలాంటి పెళ్ళాన్ని పెట్టుకొని ప్రక్కఆడవాళ్ళని చూసి గుటకలు వెయ్యటమో చేస్తూ వుంటారు. వీళ్ళని ఓ కంట కనిపెట్టి వుండాలి.
    
    ఒక్కొక్క నిముషం గడిచినకొద్దీ ఆమె రెచ్చిపోతోంది. చివరకు రాత్రి తొమ్మిది గంటలకు భర్త యింటికి వహ్చేసైర్కి మహంకాళిలా మూలకూర్చుంది.
    
    కళ్యాణచక్రవర్తి నిజానికి ఆరుగంటలనించి ఇంటికి వద్దామని నిజాయితీగా ప్రయత్నిస్తూనే వున్నాడు. కాని ఆ రోజు బాంబేనించి డైరెక్టర్సు రావడంవల్ల వాళ్ళతో అతి ముఖ్యమైన సమస్యలు చర్చిస్తూ అతిథి మర్యాదలు చేస్తూ, వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ వుండిపోయాడు. అతని మనసులో తర్వాత తనభార్య పెట్టే గొడవ, ఆమె మొహం మాడ్పు గిరగిర తిరుగుతూనే వున్నాయి. అయినా డ్యూటీ, నిస్సహాయస్థితిలో వుండిపోయాడు.
    
    వాళ్ళని హోటలులో దించి వచ్చేస్తోంటే, "నువ్వుకూడా వుండు మిస్టర్ కళ్యాణచక్రవర్తి లెటజ్ ఎంజాయ్ డ్రింక్స్" అన్నారు వాళ్ళు చాలా ఆప్యాయంగా.
    
    "ఎక్స్ క్యూజ్ మీ. నా వైఫ్ కు సుస్తీగా వుంది. లేకపోతే తప్పకుండా మీకు కంపెనీ ఇచ్చేవాడిని" అన్నాడు కళ్యాణచక్రవర్తి.
    
    "మీ మిసెస్ కు సిక్ గా వుందా? సారీ! దట్సాల్ రైట్ గో ఎ హెడ్" అన్నారు వాళ్ళు.
    
    కళ్యాణచక్రవర్తి ఆఫీసుకారులో యింటిముందు దిగి, లోపలకు రాగానే నాళిక ఎండిపోతున్నట్లనిపించింది. ఐస్ వాటర్ త్రాగుదామని ఫ్రిజ్ దగ్గరకు వెళుతున్నాడు.
    
    "ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు?" ఓ పక్కనుంచి ఆమె స్వరం కటువుగా వినిపించింది.
    
    అతను తలతిప్పి చూశాడు సోఫాలో ఆనంద భద్రకాళి అవతారమెత్తినట్టు కూచొని వుంది.
    
    ఒక్కసరిగా అతనిలో ఆవేశం పొంగినట్లయింది. అతను నిజంగా మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయి వున్నాడు. ఆ సమయంలో అతను కోరుకుంటున్నది యిలాంటి దండయాత్ర కాదు. అలసిపోయిన తనకు ఒకింత ఊరట కలిగించే సపర్యలు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS