Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 4


    గ్లాసు చేతిలోకి తీసుకుని కొంచెం కొంచెం త్రాగసాగింది.
    
    "మీకు మాటలు రావా?" అన్నాడు రజనీకాంత్.
    
    చిన్మయి నవ్వి ఊరుకొంది.
    
    "మీవారేం చేస్తారు?"
    
    "ఇంజనీర్"
    
    "మీరు ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడతారనుకుంటా."
    
    చిన్మయి మళ్ళీ నవ్వి వూరుకుంది.
    
    మంజుభార్గవి టిఫిన్ చెయ్యడం పూర్తయింది. "ఇప్పుడే వస్తాను" అని బాత్ రూమ్ కేసి వెళ్ళింది.
    
    "ఒక విషయం చెప్పనా?" అన్నాడు రజనీకాంత్ చాలా మెల్లగా.
    
    చిన్మయి ప్రశ్నార్ధకంగా చూసింది.
    
    "మీరు చాలా అందంగా వుంటారు."
    
    ఉలిక్కిపడింది. ఎవరితను? కేవలం కొన్ని నిముషాల పరిచయంతో ఎందుకలా దూసుకొస్తున్నాడు?
    
    "షటప్" అందామనుకుంది. ఆమెకు నిజంగా చాలా కోపమొచ్చింది. కాని పెదవులు దాటి ఆ మాట బయటకు రాలేకపోయింది.
    
    "మీ రూపమేకాదు. "మీరేం చేసినా అందంగానే వుంటుంది. ముభావంగా వున్నా, గ్లాస్ చేతిలోకి తీసుకున్నా అందులో గొప్ప సౌందర్యం, ఆర్టిస్టిక్ గా వుంటుంది."
    
    చిన్మయి చేతిలోని గ్లాసు అతని మొహం మీదకి విసిరేద్దామనుకుంది. కాని ఆ పని చెయ్యలేకపోయింది.
    
    మంజుభార్గవి తిరిగివచ్చింది. "చిన్మయిగారు అలా సైలెంట్ గానే వున్నారా? ఏమైనా మాట్లాడుతున్నారా" అంటూ.
    
    "పెదవి కదల్చబోయి, ముత్యాలు రాలిపోతే అవి నేనెక్కడ ఏరుకుంటానో నన్న భయంతో వూరుకున్నారు" అన్నాడు రజనీకాంత్.
    
    మంజుభార్గవి కిలకిలమని నవ్వింది.
    
                                                            * * *
    
    ఆ సాయంత్రం రాజీవ్ ఆఫీసునుండి ఇంటికి వచ్చాక అతనితో నిర్మలంగా మాట్లాడలేకపోయింది. ఏదో తప్పు చేసినట్లు. జరగకూడనిది జరిగినట్లు గిల్టీగా ఫీలవుతోంది. ఇందులో తన తప్పేమీ లేదు. అయినా మనసంతా వ్యాకులపాటుతో, అసంతృప్తిగా నిండిపోయి అతనితో సహజంగా మసులుకోలేకపోయింది.
    
    ఆమెలో వచ్చిన చిన్న మార్పు అతను గమనించాడు.
    
    "చిన్మయీ! అలా వున్నావేం?" అనడిగాడు.
    
    మంజుభార్గవితో బయటకు వెళ్ళటం, రజనీకాంత్ తో పరిచయం కావటం, అతను తన అందాన్ని పొగడటం అన్నీ చెప్పెయ్యాలనుకొంది. కాని ఎందుకనో ధైర్యం చాలలేదు. చెబితే అతనేమన్నా బాధపడతాడేమో, అనవసరమైన విషయాలను అతని తలలోకి ఎక్కించటమవుతుందేమోనని భయపడింది.
    
    "ఏమీలేదు" అంది.
    
    "ఏమీ లేకపోతే అలా ఎందుకుంటావు? నువ్వలా మూడీగా వుండటం నేనెప్పుడూ చూడలేదు"
    
    "తలనొప్పిగా వుంది."
    
    "తలనొప్పిగా వుందా? అయ్యో! ఏమిటి చిన్మయీ నువ్వేదో దాస్తున్నావు నిజం చెప్పటంలేదు."
    
    నిజం!
    
    ఈ నిజం అనేది ఎన్నో కారణాలవల్ల, ఎన్నో సందర్భాలలో దాచబడుతూ వుంటుంది. ప్రాణభయంవల్ల, అవతల వాళ్ళు అసహ్యించుకుంటారన్న భయం వల్ల, అవతలివాళ్ళని బాధపెడుతున్న భావంవల్ల, అపార్ధం చేసుకుంటారన్న అనుమానంవల్ల, అనర్ధాలు జరుగుతాయన్న భయంవల్ల, సున్నితమైన పొరలు ఏర్పడతాయన్న భావనవల్ల, చెప్పి ప్రయోజనం లేదనే నమ్మకంవల్ల ఈ నిజం దాచబడుతూ వుంటుంది.
    
    "ఏమీ లేదు" అంది.
    
    వెంటనే గుండె కళుక్కుమంది. తనబద్దం చెప్పింది. తనకు గుర్తువున్నంత వరకూ పెళ్ళయ్యాక రాజీవ్ తో ఏ చిన్న సందర్భంలో కూడా అబద్దం చెప్పలేదు. అసలంత అవసరం రాలేదు. ఏదో తప్పు చేస్తున్నట్లూ, భర్తని మోసం చేస్తున్నట్లూ బాధ కలిగింది. ఈరోజు మంజుభార్గవితో బయటకు వెళ్ళటం, రజనీకాంత్ అనే వ్యక్తితో పరిచయం కావటం, అతను తన అందాన్ని పొగడటం, వున్నది వున్నట్లు చెప్పెయ్యాలనిపించింది. కాని  ఎందుకో భయం వేసింది. అతని ముఖంలోకి, కళ్ళలోకి... అలా చూసింది.
    
    "ఏమిటలా చూశావు?"
    
    "ఊ"
    
    "ఏమిటలా... ఆ చూపు... ఎన్నెన్నో భావాలు పలుకుతోంది."
    
    మౌనంగా వూరుకుంది.
    
    దగ్గరకు లాక్కుని వళ్ళో కూచోబెట్టుకుని పెదిమలమీద పెదిమలు ఆన్చి ముద్దు పెట్టుకున్నాడు.
    
    ఎంత ప్రేమ, ఎంత నమ్మకం తనంటే? అలాంటి అతన్ని...
    
    మళ్ళీ వెంటనే ఆత్మ పరిశీలన చేసుకుంది. తానేమంత అపరాధం చేసిందని అంతగా బాధపడాలి! ప్రతి చిన్న విషయమూ అతనికి చెప్పి బాధపెట్టడం కన్నా దాచి వుంచితేనే మంచిదేమో.
    
    "చెప్పు."
    
    "ఏమిటి?"
    
    "ఎందుకలా...?"
    
    "ఏమీలేదు."
    
    "మీ వాళ్ళు గుర్తుకొచ్చారా?"
    
    "లేదండీ."
    
    "అలాంటిదేమైనా వుంటే చెప్పు. నాలుగైదు రోజులపాటు మీ యింటికి పంపిస్తాను."    

    'వద్దండీ! నేను వెళ్ళను. మిమ్మల్ని విడిచి ఒక్కరోజు కూడా వుండలేను' ఈసారి తనే అతని ముఖాన్ని దగ్గరకు లాక్కుని చెంపలమీద, పెదవులమీదా తనివితీరా ముద్దులు పెట్టుకుంది. ఇంకా తనివితీరక అతని తలని గట్టిగా గుండెకు అదుముకొని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నవ్వుతూ, దగ్గరగా, యింకా దగ్గరగా హత్తుకుపోయింది.
    
    మనసుకు వూరట కలిగించినట్లయింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS