Previous Page Next Page 
షా పేజి 4

 

    స్టెనో వచ్చి అతనికెదురుగా కూర్చుంది.
    శ్రీధర్ మనసు దిటవు చేసుకొని తన టేబుల్ మీదున్న ఫైల్స్ తీసి మరోసారి చదువుకుని వరుసగా లెటర్స్ డిక్టేట్ చేయసాగాడు. ఈ కార్యక్రమం ముగిసేసరికి సాయంత్రం నాలుగయిపోయింది.
    సాయంత్రం అయిదింటికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది.
    చాలా ముఖ్యమయిన మీటింగ్ అది. ఎన్నో నిర్ణయాలు ఆరోజు తీసుకోవాల్సి ఉంది.
    మీటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిదయింది.
    సుభద్ర ఇంకా అతనికోసమే ఎదురు చూస్తుంది.
    "ఏమిటి ఇవాళ .....మధ్యాహ్నం భోజనమే చేయలేదు" అతనితో బాటే గదిలోకి నడుస్తూ ఆదుర్దాగా అడిగింది.
    "కొంచెం పని ఎక్కువగా వుంది సుభద్రా...."
    "ఎంత పనుంటేమాత్రం భోజనం చేసే వ్యవధి లేదా?"
    "ఊహూ! ఎప్పుడన్నా ఓసారి అంతే....."
    బట్టలు మార్చుకుని స్నానం చేసి డైనింగ్ రూమ్ లో కొచ్చాడతను. ఇద్దరికీ భోజనం వడ్డించడం చూసి ఆశ్చర్యపోయాడు.
    "అదేమిటి? నువ్వెందుకు తినలేదింతవరకూ?"
    "తోడేవ్వరున్నారని? మీరు రాలేదు! సృజన్ సినిమా కెళ్ళాడు.
    "సినిమా కు వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళాడా?"
    "ఊహూ! పిల్లలిద్దరినీ తీసుకెళ్ళాడు. అదేదో చిన్నపిల్లల పిక్చర్ అని వాళ్ళు గొడవ చేశారు----"
    వాళ్ళు భోజనం చేస్తుండగానే సృజన్, పిల్లలిద్దరితో తిరిగొచ్చాశాడు.
    "ఏం సినిమా చూసారు?" పిల్లలను దగ్గరకు తీసుకుని అడిగాడు శ్రీధర్.
    "ఇటి. డాడీ? చాలా బావుంది."
    "ఇంగ్లీష్ అర్ధమయిందా మరి?"
    "ఓ! అయినా బాబాయి చెప్తాడుగా అర్ధం కాకపోతే-"
    అందరూ భోజనాలు చేశారు.
    సృజన్ సుభద్ర వేపు చూస్తూ రహస్యంగా సైగలు చేశాడు.
    "పొద్దున్న అన్నయ్యతో ఏదో చెప్పాలని అనుకున్నట్లున్నావు కదు వదినా!" సుభద్ర కేమీ అర్ధం కాలేదు.
    "నేనా! నేనేమీ అనుకోలేదే?"
    "అదే వదినా?" అంటూ స్టీరింగ్ తిప్పుతున్నట్లు అభినయించాడు.
    సుభద్రకు నవ్వొచ్చింది.
    "అదా! సరే! చెప్తాన్లే---"
    "ఏమిటది?" అడిగాడు శ్రీధర్ టేబుల్ దగ్గర్నుంచీ లేచి నిలబడుతూ.
    "మరేం లేదు. పాపం సృజన్ గారికి "మారుతీ సుజికి" కారు కావాలట. పాపం స్కూటర్ మీద వెళ్ళటం చాలా కష్టంగా వుందిట....."
    "ఏమిటటా ఆ కష్టం?"
    "అదే అన్నయ్యా! వర్షం అది వస్తే ఆగిపోవాల్సి వస్తుంది. అయినా వున్న కారేమో నువ్వేసుకేళుతున్నావు! వదిన పాపం ఎక్కడి కయినా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతోంది. నాక్కోడా కారుంటే నేను వదినను జాగ్రత్తగా తిపుకోస్తాను కదా."
    శ్రేధర్ నవ్వేశాడు.
    "సరే చూద్దాంలే"
    "కారుంటే యింకా చాలా ఉపయోగముందన్నయ్యా! మన శంకునీ, సీత నూ నేనే కార్లో స్కూల్ దగ్గర డ్రాప్ చేసి - ఇంటికి తీసుకొస్తుంటాను. వాడినాను కూడా ఎక్కడికయినా తీసుకు వెళ్ళాలంటే -----"
    సుభద్ర మళ్ళీ చెవులు మూసుకుంది.
    "అబ్బబ్బ - చెప్పిందే మళ్ళా చెప్తున్నావ్ బాబూ! కొత్త పాయింటేదయినా చూడు-"
    సృజన్ నాలిక్కోరుక్కుని చెప్పటం ఆపేశాడు.
    శ్రీధర్ గట్టిగా నవ్వేశాడు.
    "ఓ.కే. వదినా ! నో రిపీటింగ్ బిజినెస్ . పదండ్రా సీతా, శంకూ మనం వెళ్ళి పడుకుందాం."
    ముగ్గురూ అక్కడ నుంచి పక్కగదిలోకి నడిచారు. అతని మంచం మీదే చెరో వేపూ పడుకున్నారిద్దరూ.
    "కధ చెప్పు బాబాయ్--"
    "కదా! ఇవాళ కధలేదు , పడుకోండి."
    "నాకేం! కధ చెప్పాలి " మొండికేశారిద్దరూ.
    "ఆ! మర్చేపోయాను. కదేందుకూ నిన్నరాత్రి మీరు నిద్ర పోయాక భలే ...ఓ పెద్ద రాక్షసుడు మన గదిలోకి కొచ్చాడు తెలుసా?"
    "ఛీ! అబద్దం" అంది సీత.
    "అబద్దమేమిటి నీ తలకాయ్. నేనేప్పుడయినా అబద్దాలు చెప్తానా? ఆ రాక్షసుడొచ్చెసరికి ఫిజిక్స్ చదువుకుంటున్నానన్నమాట. అప్పుడు వాడెం చేశాడో తెలుసా? నెమ్మదిగా మీ ఇద్దరినీ భుజాన్న వేసుకుని మన పెరట్లో వున్న చిక్కుడు చెట్టు ఎక్కి వెళ్ళిపోయాడు. నేను అలికిడి విని చూసి వాడిని వెంబడించాను. మీ ఇద్దరినీ చాలా పైకి తీసుకెళ్ళిపోయి ఓ మంత్రాల గృహంలో పడుకోబెట్టాడు. ఆ తరువాత వాడు టిఫిన్ చేయడానికి వంటింట్లో కెళ్ళేసరికి నేను మీ ఇద్దరినీ మళ్ళీ భుజం మీదేసుకుని రాబోతుంటే -- అక్కడ కాపలా ఉన్న ఓ పెద్ద ఎలుగుబంటి భీమకరంగా అరుస్తూ నా మీద పడింది. వెంటనే నా జేబులో సీత తెలుగు వాచకం తీసి దాని మీదకు విసిరేశాను. అది రక్తం కక్కుకుని చచ్చింది. సీత ఆశ్చర్యపోయింది. "అదేమిటి తెలుగువాచకం వేస్తె ఎందుకు చచ్చింది?" "మన గవర్నమెంట్ తయారు చేసే తెలుగు వాచకాలు అంత విషపూరితం అన్నమాట. సరే నేను మీతో నాలుగడుగులు వేశానో లేదో రాక్షసుడు వచ్చేశాడు. నేను చిక్కుడు చెట్టు మీదనుంచి కిందికి జారి పోతుంటే వాడు స్పీడుగా వచ్చేయటం మొదలెట్టాడు. అప్పుడు నా జేబులో నుంచి శంకు గాడి ఎక్కాల పుస్తకం తీసి వాడి మీదకు విసిరేశాను అంతే వాడు వెనక్కు పరుగెత్తాడు."

    "ఎందుకని?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS