Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 4


    
 అప్పటి దాకా నిర్భయంగా, అతడిని లక్ష్యం చేయకుండా కూర్చున్న లత చటుక్కున కొద్దిగా సర్దుకుని కూర్చుంది. ఈ క్షణం నుంచీ అతను తన బాస్! తనకి ఉద్యోగమొచ్చేసింది!
"ఐయామ్ సతీష్ ఛోప్డా. మేనేజర్ ని. మీకు వీలుగా ఉంటే ఇవాళే జాయినయిపోవచ్చు" చెప్పాడతను.
ఒక్కక్షణం ఆలోచించి, "రేపొచ్చి చేరతాను" అంది లత.
"ఓకే! యాజ్ యూ విష్!"
"థాంక్స్!" చెప్పి బయటికొచ్చింది లత.
బయట ఇంకా కూర్చునే ఉన్నాడు శ్రీమంత్. "ఐయామ్ సారీ! నేను సెలక్టయ్యాను" అందామె ఇబ్బందిగా.
శ్రీమంత్ నవ్వాడు.
"సారీ చెప్పాల్సిన అవసరం లేదు. శారీ కట్టుకునేవాళ్ళే అతని దగ్గర పనిచెయ్యగలరు. అతనే ఆడపిల్లలా ఉన్నాడు. నన్నుచూసి బెదిరినట్లున్నాడు" అన్నాడు శ్రీమంత్!
చిరునవ్వు నవ్వింది.
"ఫస్ట్ తారీఖు రాగానే ప్రతి ఆఫీసుముందూ ఫస్ట్ కనబడేది కాబూలీ వాలాలు! నేనూ అలాంటి రక్తాన్నే! బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చాను" అన్నాడు.
"అవును! నేను మీకు అర్ధరూపాయి బాకీ!" అని నవ్వుతూ బ్యాగు తెరిచి అర్ధరూపాయి చిల్లర తీసింది.
శ్రీమంత్ అది అందుకోడానికి ప్రయత్నం చెయ్యలేదు.
"కాబూలీవాలాలు వడ్డీ దారుణంగా వసూలుచేస్తారు తెలుసా?"
"విన్నాను. ఎంతేమిటి వడ్డీ?"
'అసలర్ధరూపాయ్. వడ్డీ ఒక స్వీటు, ఖారా, కాఫీ!"
బ్యాగులోంచి ఒక పది రూపాయలనోటు తీసి అందించింది.
"రెండు స్వీట్లు, రెండు ఖారా, రెండు కాఫీ తీసుకోండి. థాంక్యూ సోమచ్" అంది.
వద్దని తలూపాడు శ్రీమంత్.
"మీరు కూడా వస్తేనే!"
అడ్డంగా తల వూపింది లత.
"సరే వెళ్లొస్తాను" అంటూ వెనక్కి తిరిగాడు శ్రీమంత్.
కొద్ది క్షణాలు అతను వెళ్ళినవైపే చూసి, నోటు బ్యాగ్ లో పడేసుకొని, బస్ స్టాప్ వైపు నడిచింది లత.
పదడుగులు వేశాక, "పోనీ వడ్డీ తగ్గిస్తాను ఒక కాఫీ అయినా చాలు! ఏమంటారు?" అనడిగాడు. వెనక్కి ఎప్పుడొచ్చాడో కానీ దాదాపు లత పక్కనే నడుస్తున్నాడు.
"లాభంలేదు! ఐదూ ఇరవై ఐపోయింది. ఇప్పటికే అమ్మ భయంతో తలక్రిందులుగా నిలబడి ఎదురుచూస్తూ ఉంటుంది." అందామె.
"ప్లీజ్? ఒక్క ఐదు నిమిషాలే!"
నవ్వుతూనే వద్దన్నట్లు తలూపి ముందుకి నడిచిందామె.
"ప్లీజ్! ఒక్క కాఫీ! నిరుద్యోగిని అడుగుతున్నాను"
నిస్సహాయంగా అతడి వైపు చూసి ఆగింది లత. దగ్గరలోనే ఉంది తాజ్ మహల్ హోటల్. అతను దారి తీశాడు. ఒక నిశ్చయానికి వచ్చినట్లు అతడివెంట నడిచిందామె.
"ఉత్త కాఫీనే!" అంది హోటల్లో ఫామిలీ రూమ్ లో కూర్చుంటూ.
"మీకు మరీ అంతపొదుపు పనికిరాదు" అంటూ స్వీటు ఆర్డరిచ్చాడతను.
చురుగ్గా చూసింది లత. "పొదుపుకాదు. అమ్మ తిడుతుందేమోనన్న భయం! అంతే!"
"ఇంకోళ్ళని చూసి భయపడేవాళ్ళలా కనబడరు మీరు."
"నా మనసుకి కరక్టే అని తోచినంతవరకూ ఇంకోళ్ళకి భయపడను."
"ఇలా నాతో రావడం తప్పని తోస్తోందా?"
"ఏమో! తేల్చుకోలేకుండా వున్నాను."
"తప్పుకాదని నేను భరోసా ఇస్తున్నాను చాలా?"
పెదిమలు బిగించి అతన్ని చూసింది లత.
"ఎలా వుంది మీ ఉద్యోగం?"
"బోర్ గా లేదు. మీ ట్రయల్స్ ఎంతవరకూ వచ్చాయ్?"
"ఎక్కడున్న గొంగళి అక్కడే!' అన్న సామెత కూడా వర్తించదు నా విషయంలో. 'నానాటికీ తీసి కట్టు నాగంభొట్టు' అంటారు చూడండి. అలా క్రమక్రమంగా జారిపోతున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే కనీసం జూనియర్ ఆఫీసర్ పోస్టన్నా వస్తుందనుకున్నాను. తర్వాత తర్వాత జూనియర్ క్లర్క్ అయినా ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జూలో జంతువులకి గడ్డిపెట్టే ఉద్యోగమైనాసరే, ఎగిరి గంతేసి చేస్తాను" అని కన్నుగీటి, "మరేమి చెయ్యను చెప్పండి! మీలాంటి అమ్మయిలు కాంపిటీషన్కొచ్చేసి, ఉద్యోగాలన్నీ ఎగరేసుకుపోతుంటే..." అన్నాడు.
సరదాగా ఏదైనా చెప్పాల్సివచ్చినప్పుడు కన్నుగీటి మాట్లాడటం అతని అలవాటని గ్రహించింది లత.
"మీకు నన్ను చూస్తే జెలసీగా ఉన్నట్లుంది" అంది. సమాధాన మివ్వకుండా తలవెనక్కి వాల్చి నవ్వాడు శ్రీమంత్. గాజుకప్పులో బాసుందీ చిక్కగా పేరుకుని లత బుగ్గలా మృదువుగా వుంది. ఆ మాటే అనుకున్నాడు అతను. స్పూను ఎడమచేతితో పట్టుకుని అంటోంది లత.
ఆసక్తిగా చూస్తూ, "మీరు లెఫ్ట్ హాండరా" అన్నాడు.
నోట్లో పెట్టుకోబోతున్న స్పూను తీసి, "అవును! ఏం?" అంది లత.
"అన్ని పనులూ ఎడం చేత్తోనే చేస్తారా? ఐ మీన్ రాయడం అదంతా?"
"ఎడమ చేతితోనే రాస్తాను. ఏం? వింతగా వుందా?" అంది అతని వైపు బింకంగా, డిఫెన్సివ్ గా చూస్తూ.
"వింతేముంది? లెఫ్ట్ హాండెడ్ నెస్ ని సినిస్ట్రాలిటీ అంటారు. మెదడులో కుడివైపు భాగం ఎడమ భాగం కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటే ఎడమచేతి వాటం వస్తుంది. కొంతమంది మిక్సెడ్ హాండెడ్ గా వుంటారు. అంటే కొన్ని పనులు వాటంగా ఉండే చేత్తో చేస్తూ, మిగతా పనులు రెండో చేతితో చేసేవాళ్ళు. వాళ్ళని ఆంబీడెక్ట్రస్ అంటారు. జనాభాలో ఎడమ చేతివాటం వాళ్ళు మూడు నుంచీ ముఫ్ఫయ్ అయిదు శాతం వరకూ ఉండొచ్చు. తీసుకున్న శాంపిల్ ని బట్టి ఈ శాతం మారుతూ ఉంటుంది. లియొనార్డోడావిన్సీ మీలాగే లెఫ్ట్ హాండరు. అలాగే..."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS