Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 3

చెప్పులు లేకుండా రెండుకిలోమీటర్లు నడిచి ఇంటర్వ్యూకి వెళ్ళాలా? వాటిని భుజాన వేసుకుని రెండు కిలోమీటర్లు నడిచి ఇంటికెళ్ళిపోవాలా? ఏం చెయ్యాలి 'చెప్పు' మా!
'నడిసంద్రములో నావా...' అన్నపాట గుర్తొచ్చి నవ్వొచ్చింది.
"బస్ కోసం నిలబడ్డారా? బస్టాపు ఇంకా ముందుంది" అని వినబడిందో కంఠస్వరం. వెయ్యిగొంతుల్లో కూడా ప్రత్యేకంగా వినబడే ఆ స్వరాన్ని వెంటనే గుర్తుపట్టింది లత.
అతను! ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో కనబడే అతను!
పాత స్టయిల్ టై కట్టుకుని ఉన్నాడు. తన ఆకుపచ్చ చీరలాగే అతని టై కూడా ఇంటర్వ్యూలకి ప్రత్యేకమని తెలిసిపోతోంది. అతడి చేతిలో ఒక ఫైలు. దానిలో ఏముందో గ్రహించగలదు తను. సర్టిఫికెట్లు, టెస్టిమోనియల్స్, రిగ్రెట్ లెటర్స్!
లత పెదవుల మీద పలకరింపుతో కూడిన నవ్వు కనబడింది. అలాగే కదలకుండా నిలబడింది.
"ఓహో! ఆటోలో వెళుతున్నారా?"
కాదన్నట్లు తల వూపింది. కొద్దిగా చిరాకేసింది లతకి. ఇతను వెళ్ళిపోడేం?
అతనికి అనుమానమొచ్చింది.
"అసలు ఇంటర్వ్యూకేనా మీరు?"
"ఇంటర్వ్యూకనే బయలుదేరాను. ఇంటికెళ్ళి పోతున్నాను."
అతనర్ధం కానట్లు చూశాడు.
"ఎందుకని?"
మాట్లాడకుండా, కదలకుండా నిల్చుంది లత.
"భలేవారే! అసలు ఇంటర్వ్యూ కాల్స్ రావడమే గగనమైపోతుంటే వచ్చిన కాల్స్ కూడా అటెండవకపోతే ఎలా?"
"కాల్ వచ్చింది బాగానే ఉంది. కానీ కాలు కదిల్చే స్థితిలో లేను."
"ఎందుకని?" అంటూ అతను లతా పాదాలవైపు చూశాడు. వెంటనే అతనికి అర్ధమైపోయింది.
"అరెరె! చెప్పు తెగిపోయిందా?"
లత నవ్వింది.
"ఆ సెంటర్లో చెప్పు కుట్టేవాడున్నాడు పదండి" అన్నాడతను.
"ఆ నాలుగురోడ్ల కూడలి దగ్గర చెప్పులు కుట్టేవాడు ఉండవచ్చు. కానీ నా దగ్గిర నాలుగు పైసలుకూడా లేవు" అంది నిస్సంకోచంగా. వెంటనే, "డబ్బులు బ్యాగులో వేసుకురావడం మర్చిపోయాను" అంది చిన్న అబద్దం ఆడేస్తూ.
అతను తటపటాయించకుండా వెంటనే జేబులో చెయ్యిపెట్టి చిల్లర తీస్తూ "ఐ గాట్ ఎ హాఫ్ రుపీ! అర్ధ రూపాయి ఉంది నాదగ్గర. ముందర వాటిని కుట్టించేసుకోండి. తర్వాత నడిచి పోదాం" అన్నాడు.    
అతనూ తన లాంటి వాడేన్నమాట!
"నో! థాంక్స్!" అంది.
"మీరు మొహమాటపడుతున్నారు. ఫర్వాలేదు. తీసుకోండి."
ఒక క్షణం ఆలోచించి, "మళ్ళీ ఇచ్చేస్తాను" అంది.
"ఇట్సాల్ రైట్!"
చెప్పులు కుట్టించుకున్న తరువాత థాంక్స్ చెప్పింది లత.
"మెన్షన్ నాట్!" అన్నాడు.
ఆమె నడక సాగించింది. ఆమె పక్కనే నడుస్తున్నాడతను.
మరో పదడుగులు నడిచాక "నా పేరు చెప్పనే లేదు మీకు. నాపేరు శ్రీమంత్!" అన్నాడతను చొరవగా. ఆ చెప్పడంలో "మీ పేరేమిటి?" అన్న ప్రశ్న కూడా వుంది.
"నా పేరు లత"
"ఉత్త లతేనా?"
నవ్వింది లత.
"నా అసలు పేరు లలిత. స్కూలు రికార్డుల్లో మధ్యక్షరం పొరబాటున మింగేసి లత అని రాసుకున్నారు. అప్పటి నుంచి లతనే!"
కింగ్స్ వేలో ఉంది ఆ ఆఫీసు. బిజీగా ఉన్న మెయిన్ రోడ్డుమీదే ఉంది.
ఇంటర్వ్యూ మెదలయ్యేసరికి ఒంటిగంటయింది. అతి తక్కువ జీతానికి, అతి ఎక్కువ చాకిరీ చెయ్యగల కాండిడేట్ కోసం చూస్తున్నాడు మేనేజర్.
చివరగా లతను పిలిచారు. శ్రీమంత్ టర్న్ అప్పుడే అయిపోయినా, రిజల్టు ఆ రోజే చెప్పేస్తామన్నారు కాబట్టి అక్కడే కాచుకుని కూర్చున్నాడు.
ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలెట్టిన తొలిరోజుల్లో ఇంటర్వ్యూ అంటే జీవన్మరణ సమస్యలా ఫీలయ్యేది లత. ఆ ఉద్యోగమొస్తుందో రాదోనని చెప్పలేని ఆరాటం! 'వస్తే ఎంత బావుండు!' అనే ఆశ! 'రాకపోతే ఎలా?' అనే దిగులు!    
దాదాపు ఇరవై ఆఫీసుల్లో, ఇరవై ఇంటర్వ్యూలకి హాజరైన తరువాత, మనసు కొద్దిగా మొద్దుబారిపోయింది. మొదట్లో ఉన్న ఉద్వేగం లేదిప్పుడు. అప్పట్లో 'వస్తుందా, రాదా' అన్న సందేహం. ఇప్పుడు 'మనకెక్కడ వస్తుందిలే!' అన్న అదోరకం నిరాశతో కూడిన తెగింపు!
తనపేరు పిలిచాడు ఒక క్లర్కు. తటపటాయించకుండా లోపలికెళ్ళిపోయి, మేనేజర్ కూర్చోమనేలోగా అక్కడున్న కుర్చీలో కూర్చుని, "థాంక్యూ!" అంది - అతడి పర్మిషన్ తోనే కూర్చున్నాననే అర్ధం ధ్వనించేలా.
మేనేజర్ కి నిండా ముఫ్ఫయ్ ఏళ్ళుండవు. పంజాబీ అయి ఉండవచ్చు. గులాబీరంగు కలిసిన తెలుపు. మొహం మృదువుగా వుంది. తెలివిగా కనబడుతున్న కళ్ళు.
లత వైపు నవ్వుతూ చూశాడు.
"మిస్ లత?"
తన పేరు అదేనన్నట్లు తలపంకించింది.
"ఇంతకుముందు ఎక్స్ పీరియన్స్ ఉందా?"
"ఉద్యోగమే దొరకలేదు. లేకపోతే రెండు మూడేళ్ళ అనుభవం ఉండేది." అంది లత నవ్వుతూనే.
అతను ఆమెని కొలిచి చూస్తున్నప్పుడల్లా, పట్టి పట్టి చూస్తూ, ఇంకొన్ని ప్రశ్నలడిగాడు. మెషిన్ గన్ పేలుస్తున్నట్లు చకచక జవాబులు చెప్పింది లత.
అంతగా అలవాటయిపోయాయి, ఆప్రశ్నలూ, జవాబులూనూ! అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగేశాక, ఆమె పేరు కెదురుగా "చొరవపాలు ఎక్కువ. ఇంగ్లీషు ఫరవాలేదు. చాలా సులభంగా పెదిమలమీదకి వచ్చేసే చిరునవ్వు. ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్స్ - పి.యమ్.బి.ఎక్స్, షార్ట్ హాండ్, టైప్ రైటింగ్, ఫ్రెండ్లీ, ఈజీ గోయింగ్ నేచర్ - సెలెక్టెడ్" అని రాసి "యూ ఆర్ సెలెక్టెడ్ మిస్ లతా! వెన్ కెన్ యూ జాయిన్?" అన్నాడతను. అతని ఇంగ్లీషులో ఖరీదైన పబ్లిక్ స్కూలు యాస వినబడుతోంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS