Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 4

   
    
    నూర్జహాన్ పేరుకుమించిన అందగత్తె. నిండు చంద్రుడులా వుండేది. మహాగుణవతి, సౌందర్యవతి, విద్యావతి. సలీంకూడా సుగుణవంతుడు కనుక, నూర్జహాన్ స్నేహం ప్రేమగామారింది వాళ్లిద్దరికీ పెళ్లి అయివుంటే బావుండేది. చక్కని జంట అయ్యేవారు! కానీ నసీరుద్దీన్ కు దురాశ కలిగింది. కవలల్లో కాస్త పెద్దవాడు యాకూబ్. ఇబి రషీద్ తర్వాత రాజ్యానికి కావలసినవాడు అతను. నూర్జహాన్ ను యాకూబ్ కిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు నసీరుద్దీన్.
     ఇబిన్ రషీకు డెబ్బయిఏళ్ళు వచ్చాయి. కొడుకులిద్దరూ ఇరవై ఎనిమిదేళ్ల వాళ్లయ్యారు. రాజ్యభారాన్ని మంత్రుల పైన, యువరాజులపైన వేస్తూ వచ్చాడు. ఒకరోజున గుండె పోటువచ్చి పరలోకాల్లోవున్న పెద్దల్ని చేరుకున్నాడు.


     సింహాసనం యాకూబ్ హస్తగతమైంది... ఒకవేళ సలీం రాజుకాదలచినట్లయితే సైన్యం, ప్రజలు అతని పక్షాన నిలిచేవారు. కానీ సలీం ధర్మమూర్తి. అన్న రాజ్యానికిరాగానే తను విధేయుడైనాడు. అన్నకు బాసటగా నిలిచాడు.
     ఫలితం! యాకూబ్ సలీంనే తన ప్రధమ శత్రువుగా భావించాడు. సలీం నూర్జహాన్ ల మధ్య ప్రేమవ్యవహారాలు యాకూబ్ కు తెలుసు. అందుకు మొదటి ఎత్తుగా నసీరుద్దీన్ ను తన ప్రధానమంత్రిగా నియమించాడు. నూర్జహాన్ ను తనకిచ్చి పెళ్లిచేయమని కోరాడు. ఆమాటకోసమే ఎదురుచూస్తున్న నసీరుద్దీన్ వెంటనే పెళ్ళి ఏర్పాట్లు చేశాడు. అతివైభవంగా పెళ్లిజరిగింది.
     వాస్తవానికి నూర్జహాన్ అంటే యాకూబ్ కు వల్లమాలిన అనురాగం, ప్రేమ లేవు. సలీంను ప్రేమిస్తున్నదని అసూయ. ఆమె తనను ప్రేమించడంలేదని, ప్రేమించదనీ తెలుసు. సలీం సుఖపడకూడదు. అతగాడు  ప్రేమిస్తున్నవ్యక్తిని అతనికి కాకుండానేచేయాలి. అతను ఏడుస్తుంటే తను సంతోషించాలి.
  ఒక్కదెబ్బతో సలీంను చంపివేయవచ్చు. చంపించనూ గలడు. కానీ, అతను  ప్రాణంలో ప్రాణంగా   ప్రేమిస్తున్న నూర్జహాన్ ను అతనికి కాకుండాచేస్తే దిగులుతో కృంగిపోతాడు. ఒకవేళ తిరగబడితే, చంపడం తేలికవుతుంది. ఒక కారణం దొరుకుతుంది. ఈలోగా నూర్జహాన్ ఒకకొడుకునూ, ఇద్దరు కూతుళ్లను కన్నది. ముగ్గురు బిడ్డల తల్లిఅయినా, నూర్జహాన్ రోజూ భర్తచేత అవమానాలు పొందుతుండేది. ఏవో సూటిపోటి మాటలతో యాకూబ్ ఆమెను హింసిస్తుండేవాడు. ఆమె చూస్తుండగా, రకరకాల స్త్రీలను,  అంతఃపురంలోకి పిలిపించుకుని అనుభవించేవాడు.
                                                             *    *    *    *    
    "ఇక్కడ మెహర్ - ఉల్ - నిసా గురించి చెప్పుకోవాలి. ఆమె రంగంలోకి వచ్చింది. ఇరవైఏళ్ళ వయసు.... గొప్పగా నాట్యం చేసేది. ఆ అందాలనర్తకి పొందుకోసం ఎందరో ప్రయత్నించారు. కానీ ఎవరికీ అందలేదు.
    "ఆమె సలీంను మనస్పూర్తిగా ప్రేమించింది. అతను నూర్జహాన్ ను పోగొట్టుకున్న భగ్నహృదయుడని తెలుసు, తానుగా సలీంను వలచివచ్చింది. కానీ సలీం ఆమెను, ఆమె ప్రేమను తిరస్కరించాడు. ఎప్పుడు వచ్చినా ఏదో ఒకసాకుతో పంపించి వేస్తుండేవాడు... అతను నూర్జహాన్ ను మరచి పోగలిగితేగదా! మరొక యువతిని ప్రేమించగలిగేది!
     మెహర్ - ఉల్ - నిసా, ఆ తిరస్కారం గొప్ప అవమానంగా భావించింది. ...తన ప్రేమను తిరస్కరించడమా! సలీం, నూర్జహాన్ ల అంతుచూస్తానని ప్రతిజ్ఞచేసింది.
    యాకూబ్ కన్ను మెహల్ - ఉల్- నిసాపై పడ్డది. అతను అసలే స్త్రీలోలుడు. ఆమె అందాలనర్తకి ..... ఆమె తిరస్కరించినకొద్దీ ఆమె మమతల్ని, వాంఛల్ని పెంచుకోసాగాడు చివరకు మెహర్  లొంగిపోయింది. అయిదు రాత్రుళ్సు, పగల్లు స్వర్గంలో గడిపారు ఇద్దరూ. అతను మత్తులోవున్నాడు. తనపని కానిచ్చుకోవాలనుకుంది. యాకూబ్ తన్మయత్వంలో వుండగా చెవిలో ఊదింది. 'నూర్జహాన్ వ్యభిచరిస్తోంది.... ఆమెకు పుట్టిన వాడు నీకొడుకు కాదు. సలీం కొడుకు... ' పైగా అందుకు నమ్మకంగా ఒకవాదన చేసింది. 'మగాడన్న తర్వాత ఆడదాని తోడు లేకుండా బ్రతకలేడు. పైగా వారిద్దరూ ప్రేమించుకున్న వారు. నీవు ఎన్ని అవరోధాలు కల్పించినా కలుసుకోకుండా వుండలేరు, వుండరు.'
    మెహర్ మాటలు వినినట్లే నటించి, ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు. అప్పటికి అతనికి కావలసింది ఆమె మాటలుకాదు. ఆమె శరీరం... ఆమెను నగ్నంగా అనుభవించాడు. రాత్రి గడిచింది.
     తాను ఆడిన అబద్దం ఎటువంటి ఫలితాలనిస్తుందో  ఊహించలేదు మెహర్ - ఉల్ - నిసా. రాత్రి మెహర్ అందించిన సుఖం తాలూకు  మత్తు ఇంకా పూర్తిగా దిగకముందే ఆమె చెప్పినమాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. బీగం సాహెబా శీలాన్ని శంకించిన నేరానికి, ఆమెను బంధించి, నాలుక తెగకోయించి, సజీవంగా సమాధిచేయించాడు.
     తర్వాత యాకూబ్ దృష్టి సలీం నూర్జహాన్ లపైన పడ్డది. ఆరాత్రి ఇద్దరినీ పిలిపించాడు విచారణకు. యువరాజు రషీద్ లో సలీం పోలికలతో  వుండడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు... నూర్జహాన్ అతని అభిప్రాయం గ్రహించి,  సిగ్గుతో, అవమానంతో తలదించుకున్నది. సలీంకు మతిపోయినట్లయింది. ఏమిటీ అభాండం, అన్యాయం... హృదయం ఆక్రోశించింది. చెప్పకపోయేసరికి తన అనుమానమే నిజమనుకున్న యాకూబ్కు కోపం వచ్చింది.
     మోతీని చూపిస్తూ సలీంను అడిగాడు 'సలీం అది నీ కూతురు! అవునా? కాదంటే ఇది తాగు సోదరా' అంటూ ఒకగిన్నె అందించాడు. "ఇది తాగి నీవు నిర్దోషివని నిరూపించుకో"... ఇందులో ఏమీలేదు. మంచినీళ్లే... అల్లామీద ప్రమాణం చెయ్యి నీవు దోషివి అయితే అది నీగొంతు పట్టేస్తుంది విషం అవుతుంది. నిర్దోషివైతే ఏమీ జరగదు.'
    సలీం ఆగిన్నె అందుకొనేలోగా యాకూబ్ అందులో ఏదో మందుకలపడం గమనించింది నూర్జహాన్.
    "సలీం, దాన్ని నువ్వు త్రాగవద్దు... నిజం నేను నిరూపిస్తాను" అంటూ సలీం చేతిలోని గిన్నెను లాక్కుని ఒక్కగుక్కలో మింగేసింది. క్షణంలో ఆమె విలవిల తన్నుకుంటూ నేలమీద కూలిపోయింది. సలీం పరుగునవెళ్ళి ఆమెను తన ఒడిలోకి చేర్చుకున్నాడు.
     నూర్జహాన్ శరీరాన్ని క్రిందపడుకోబెట్టాడు. సలీంగుండె భగభగ రగులుతోంది. కళ్ళు అగ్నివర్షిస్తున్నాయి. "నీచుడా! ఇంతకింత అనుభవిస్తావు" అన్నాడు యాకూబ్ ను శపిస్తున్నట్లు.
     ఆక్షణంకోసమే యాకూబ్ ఎదురుచూస్తున్నాడు.
     సలీంపైకి కత్తిదూశాడు. ఇద్దరూ హోరాహోరీ పోరాడుతున్నారు. ఎవరికి ఎవరూ తక్కువకాదు... మందిరంలో ఎవరూ వారిని ఆపలేకపోయారు. సైనికులు, వీరులు, ఆడవారు ప్రాణభయంతో తప్పుకున్నారు... అది ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్దం. ...
     క్రమంగా యాకూబ్ బలం కోల్పోసాగాడు. అతని కళ్లు మసకలు వేస్తున్నాయి. చేయి సరిగా తిరగడంలేదు. కత్తి పట్టుకుదరటంలేదు.  అలాగే మరణించాడు సలీంకత్తి యాకూబ్ గుండెను చీల్చివేసింది.
                                                              *    *    *    *    *
     తాను చంపింది, తననోకలిసి, తన తల్లిరక్తం పంచుకుపుట్టిన అన్న అనే గ్రహింపుకలిగింది సలీంకు. తనకత్తి మోకాలిపైన వుంచి, రెండు ముక్కలుగా విరిచాడు. కన్నీరు తుడుచుకుంటూ రాజమందిరంనుండి నడిచాడు. అదే చివరిసారిగా సలీంను చూడడం. మర్నాడు ఉదయం సలీం కోటద్వారా దాటి వెళ్లిపోవడం కొందరు భటులు, ద్వార పాలకులు గుర్తించారు. మాసిపోయిన బట్టలు,ఫకీర్ లా మారి వెళ్లిపోయాడు.
     యాకూబ్ చనిపోయాడు. సలీం ఫకీర్ లా మారి వెళ్లిపోయాడు. ఎవరు రాజుకావాలి? సామంతులలో కలతలు రేగాయి. యాకూబ్ కొడుకు, యువరాజు అలీరషీద్ ను ఎవరో హత్యచేశారు. ఈకోట  మరాటీల వశమైంది... .ఇప్పుడు అదిగో, ఆకోటలో, అమందిరంలో యాకూబ్, సలీం, నూర్జహాన్ లు లేరు. వాళ్ల ఆత్మలు తిరుగుతున్నాయి దయ్యాలై. చీకటి, మృత్యువు.... అక్కడ కనిపిస్తుంది. గబ్బిలాలు పాములు తిరుగుతున్నాయి.
     అతను నిర్వేదంతో ఆగిపోయి కళ్లు వత్తుకున్నాడు.
     "వస్తాను బాబూ" అని లేచాడు వెళ్లడానికి.
     "ఈ విషయాలన్నీ నీకెలా తెలిశాయి" అడిగాను. ఆసక్తిగా.
     "నాకా, బాబూ, నా నూర్జహాన్ చనిపోయింది, ఇక్కడేకదా, నూర్జహాన్ సౌందర్యం వెలిగింది, ఆమె తిరిగింది ప్రేమించింది, భంగపడింది, అన్నీ ఇక్కడే కదా బాబూ. నా అత్యాశ, నా దాహం,  నాబిడ్డకు అన్యాయం చేశాయి. నా అధికార దాహమే, నాబిడ్డను, సుఖంలేకుండా చేసింది. నేను నూర్జహాన్ కన్నతండ్రిని - నషీరుద్దీన్ ని నేనే బాబూ" అని నెమ్మదిగా వెళ్లి, చీకట్లో కలసిపోయాడు... అతని చేతిలో దీపం ఎప్పుడో ఆరిపోయింది.
                                    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS