Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 3

       
    
                                   మరో నూర్జహాన్ కధ
                
                                                                        ---శార్వరి
 
    
    శిధిలమైన కోటలు. ప్రాసాదాలు చరిత్రకారుడికి ప్రసాదాలు. పాడువడిన దేవళాలు, పూడిపోయిన నగరాలు, పురాతత్త్వ వేత్తలకు నిక్షేపాలు, కథా రచయితకు అవి కల్పనలు కాని వాస్తవాలు, కథావస్తువులు.
     మనదేశంలో, ఆమాటకొస్తే ఏ దేశంలోనైనా శిధిలమై జీర్ణించిపోతున్న కోటలు, మందిరాలు, ఎన్నో కథల్ని చెబుతాయి. ఒకసారి  ఔరంగాబాద్ పరిసరాల గుహల్ని చూడడానికి వెళ్లాను. చుట్టుప్రక్కల కొండల్లో గుహల్లో, అనేక చారిత్రకాంశాలు దొరికాయి.
     అది ఒక పెద్దకోట. పాడుబడిన కోట రాత్రికి అక్కడ మకాం వేశాం. చుట్టు చీకటి, మనసులో గజిబిజిగా ఆలోచనలు, తెచ్చుకున్న భోజనం తిని, టీ తాగి, సిగరెట్ వెలిగించాను. చుట్టు చీకటి.


     ఆ చీకటిని, భయాన్ని చీల్చుకుంటూ ఎవరిదో దగ్గు, అడుగులసవ్వడి వినిపించింది. లాఠీ నేలమీద కొడుతున్నద్వని. కాపలాదారై వుండాలి. దూరంనుంచి చీకటిని చీల్చుకుంటూ వస్తున్న వెలుతురు. ఆ వెలుతురును  తెస్తున్న  మనిషి తాలూకు నీడ ..... అతని చేతిలో లాంతరు.... అది ఏనాటిదో?
    అతను 'సలాం ఆలేకుం' అన్నాడు వస్తూనే....
    'వాలేకుం  సలాం' ప్రతి నమస్కారం చేసి, అతని వైపు చూచాను, అతనిలో రాజసం.... కరిగిపోతున్న దర్పం, ఠీవి.... రాజవంశపు ... దర్జా ఏదో కనిపించింది.
    "సాబ్ ...నిద్రవస్తోందా?" అని అడిగాడు.
     "అప్పుడేనా?" అన్నాను. అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడనిపించింది.
     'నువ్వు ఇక్కడ పనిచేస్తావా' అడిగాను.
    'అవును. చాలా ఏళ్ళుగా ఇక్కడే వున్నాను... ఇక్కడే తిరుగుతున్నాను' అన్నాడు.
     'ఊఁ చెప్పు'
    ఏం చెప్పమంటారు, జీ! ఆనాటి వైభవం లేదు. నేనూ ముసలివాణ్ణయ్యాను.... ఆరోజుల్లో ఈకోట ఎంత గొప్పగా వుండేదని ...ఒకనాడు, మహాప్రభువులకు ఇది నెలవు. ఇప్పుడు ఆ ప్రభువులు లేరు..... వారి స్మృతులూ లేవు'
    లాంతరు వెలుగులో అతని మొహం చూచాను. ముడతలు పడివుంది. ప్రాచీనశిల్పం ప్రాణం పోసుకుని వచ్చినట్లుంది దీపాన్ని దూరంగా పెట్టివచ్చాడు. చీకటిలో కధ చెప్పసాగాడు.
                                                               *    *    *    *    *    
     ఔరంగజీబు గురించి చదివారు కదా! ఆయన చనిపోవడానికి ముందు, ఈకోట, ఈప్రాంతం ఒక ఫౌజుదార్ చేతుల్లో వుండేది. అతనిపేరు మహమ్మద్ ఇబిన్ రఫీద్. అతను యువకుడేకాదు, గొప్పయోధుడు, సమర్దుడు, పరిపాలనా దక్షుడు... అతను మరాటా వీరుల్ని ఎలాజయించేవాడో. ఆడవాళ్ళ హృదయాలను అలాగే జయించేవాడు. ఇబిన్ రషీద్ ఈ ప్రాంతాలకు వచ్చేనాటికి బ్రహ్మచారి. పదిహేనేళ్లు అవివాహితుడుగానే వుండిపోయాడు.
     'అప్పటికి ఔరంగజీబు మరణించాడు. ఆయన సామ్రాజ్యం ముక్కలైంది. ఈ ప్రాంతాలను మహమ్మద్ ఇబిన్ రషీద్ స్వాధీనం చేసుకుని  తానే స్వతంత్రంగా రాజైనాడు. అతని వయస్సు అప్పటికి నలభైఏళ్ళు. మహావీరుడు..... యుద్దంలో సింహం ఎలాటి పోరాటాలలోనైనా ముందుండే వాడు. ప్రతిఘటన ఎంత ఎక్కువగావుంటే, అంతగా విజృంభించేవాడు. చేజిక్కిన శత్రువున్ని ప్రేమగా చూచేవాడు. అందుకే అతని పరిపాలనలో ప్రజలు సుఖపడ్డారు. మిత్రులు, శత్రువులు అతనిని అభిమానించి ప్రేమించేవారు.
    ఒకరోజున, వేటకు వెళుతుండగా ఒక అందాల  సుందరిని చూచాడు. ఆమె సామాన్య కుటుంబీకురాలు. బావివద్ద  నీళ్లు తోడుతున్నది. ఆమె అందంచూచి ఇబిన్ ముగ్దుడైనాడు అతని హృదయంలో స్పందన కలిగింది. ఆమెను పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. పెళ్లిఅయింది. వారం రోజులపాటు నగరం పండుగ చేసుకుంది. ఏడాదినాటికి బీగంసాహేబ్ కవలల్ని కన్నది. యాకూబ్, సలీం..... ఆయువరాజులు.
    ఇద్దరు కవలలు అంత దగ్గరపోలికలు వుండడం అరుదు. విడివిడిగాచూస్తే, ఎవరెవరో, కన్నతల్లిదండ్రులకే తెలిసేది కాదు. చిన్నతనంనుండి గారాబంగా పెరిగారు కలిసి చదువులు చదివారు. విద్యలు నేర్చారు. కత్తిసాము, గుర్రపుస్వారి, రాజనీతి.... అన్నింటిలోనూ వారికి వారేసాటి! వారిని ఓడించడం ఆదేశంలో ఎవరివల్ల అయ్యేదికాదు.
     వారి పోలికలు అలావున్నా స్వభావాలూ భిన్నంగా వుండేవి, యాకూబ్ పరమమూర్ఖుడు. కిరాతుడు,  దుర్మార్గుడు స్త్రీలోలుడు, త్రాగుబోతు. సలీం పరమసాత్త్వికుడు, మంచివాడు, ఉదారుడు, స్నేహశీలి, ఆడవారి విషయంలో ఇద్దరి స్వభావాలు స్పష్టంగా తెలిసేవి. ఒక అందమైన స్త్రీ కనిపిస్తే యాకూబ్ చూపులతోనే  ఆమెను వివస్త్రను చేసి, ఆమె నగ్న సౌందర్యాన్ని ఊహించుకుంటూ, అనుభవిస్తున్న అనుభూతి చెందేవాడు. సలీం తలదించుకుని లోలోపల నమస్కారం చేసేవాడు. ఏదో పవిత్రమైన దాన్ని, తనచూపులు అపవిత్రం చేస్తున్నంతగా తలవంచేవాడు. అయినా సలీంను అటు కోటలోను, బయట నగరంలోను అందరూ ప్రేమించేవారు. యాకూబ్ ను భయంతో గౌరవించినట్లు నటించేవారు. లోపల అతనంటే అసహ్యం, ద్వేషం, భయం.
     "ఆ విషయం యాకూబ్ కు తెలుసు. అంత తెలిసికోలేనంతటి మూర్ఖుడు, అజ్ఞానికాదు. సలీం అంటే అసూయ ఏర్పడింది. గుండెభగ్గుమనేది. రక్తం సలసల కాగేది. రోజు రోజుకు సలీంపట్ల ద్వేషం, అసూయ ఎక్కువకాసాగాయి. అనేక విషయాల్లో సలీంకు అడ్డొచ్చి, అవమానించేవాడు. కాని ఏంచేసినా ప్రజలకు సలీంపట్ల వున్న ప్రేమాదరాలను, తను సంపాదించలేక పోయాడు. యాకూబ్ తనను ద్వేషిస్తున్నా, సలీం తను యాకూబ్ ను అమితంగా ప్రేమించేవాడు. ద్వేషించేవానిని  ప్రేమించడంలోనే భగవదంశ వుందేమో.
    ముసలతను ఒక నిమిషం ఆగి, సిగరెట్ వెలిగించుకున్నాడు. "ఇక్కడ కొంతఆపి, నూర్జహాన్ గురించి చెప్పాలి" అన్నాడు.
     "నూర్జహాన్ అంటే జహంగీర్ భార్యకదూ?' అడిగాను.
     'కాదు బాబూ, కాదు.... నసీరుద్దీన్ కూతురు. మహమ్మద్ ఇబి రషీద్ కొలువులోని ఒక ఉద్యోగి నసీరుద్దీన్.... మహారాణి నూర్జహాన్ జ్ఞాపకంగా ఆపేరు తన కూతురుకు పెట్టుకున్నాడు. ఈ నసీరుద్దీన్ ఇబిన్ రషీదుకు ప్రాణమిత్రుడు. యువరాజులకు నాలుగేళ్లు వయస్సురాగానే నసీరుద్దీన్ కు నూర్జహాన్  పుట్టింది. పెద్దవాళ్ల స్నేహంవల్ల రాకుమారులిద్దరు నూర్జహాన్ స్నేహితులైనారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS