Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 30


                           ఉత్థిష్టంతు
    ముళ్ళపూడి వెంకటరమణ కథల్రాయటం మానేసేక ఆ తరం వెళ్ళిపోయి రామకృష్ణా బీచ్ వెలవెల బోతూంది. వైజాగ్ లో అబ్బాయిలూ అమ్మాయిలూ శుబ్బరంగా చదువుకుంటున్నారు. రాధలు ముగ్గులేయటం మానేశారు. బామ్మలు బాబాయిలకి డబ్బులివ్వటం ఆపుచేశారు. తెలుగు తనం పారిపోయి ప్లిమత్ కార్లూ, యమా సస్పెన్సులూ వచ్చేశాయి.
    అటువంటి సాయంత్రం జరిగిందీ సంఘటన.
    అసలు శ్రీధరం బాగానే వుంటాడు. కొనదేలిన ముక్కు, రెండ్రోజులకొకసారి గీసే గెడ్డం, పొడుగ్గా చువ్వలా ఉంటాడు.
    శార్వాణి ఆఫీసులో చేరేముందు బామ్మ చెప్పింది "ఓసే పిల్లా, కాలేజీలో చదువుకున్నట్టు కాదు. ఆఫీసులో జాగ్రత్తగా వుండు. అల్లరి చేయకు" అని. శార్వాణి బుద్ధిగా తలూపింది. ఆ అమ్మాయికి ఆఫీసులో కొత్తగా ఏం కనపడలేదు. అంతవరకూ యూనివర్శిటీలో చదివింది. ఇప్పుడు ఆఫీసు కూడా అదే ఏరియా. అందువల్ల ఆఫీసు కొత్తగా ఏమీ లేదు. అందులోనూ సూపర్నెంటెండెంటు మంచాయన. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా వున్నారు. అన్నిటికన్నా చిత్రమేమిటంటే ఆఫీసులో అందరూ దాదాపు చిరునవ్వుతో సంతోషంగా ఉన్నారు. ఒక కుటుంబంలా వున్నారు.
    శార్వాణికి ఆఫీసు బాగా నచ్చింది.
    ఇంటిదగ్గిర బయల్దేరితే బీచ్ ప్రక్కనుంచి పది నిముషాల నడక. దూరంగా యూనివర్సిటీ క్వార్టర్సు.
    ఆఫీసంటే పెద్దహాలు కాదు. ఏదో ప్రైవేటు బిల్డింగు అద్దెకి తీసుకున్నారు. మధ్యలో హాలుంది. అందులో సూపర్నెడెంటు కూర్చుంటాడు. మరో ఆరుగురు వుంటారు. మిగతావి గదులు. ఒక గదిలో శార్వాణి టేబులుంది.
    పక్క టేబులు శ్రీధరానిది. ఆమె ఆఫీసులో చేరినప్పటి నుంచీ అతడు శలవులో వున్నాడు.
    శర్వాణి ఆఫీసులో వున్న మిగతా ముగ్గురమ్మాయిల్లో జయంతి బాగా నచ్చింది. ఆఫీసు విశేషాలన్నీ ఆ అమ్మాయే శార్వాణికి చెప్పింది. అదే ఆఫీసులో ఉన్న కమలకి ఈ శ్రీధరం బీరకాయ పీచు వరసలో అన్నయ్య అవుతాడు. ఇంకో విషయం ఏమిటంటే ఈ సదరు శ్రీధరాన్ని ఆఫీసులో అందరూ ప్రేమిస్తారు. అలా అన్చెప్పి అతడేం రచయిత కాడు. క్రికెటు ప్లేయరూ కాదు. కనీసం నాటకాలు కూడా వెయ్యడు.
    కానీ అందరి తలలో నాలుకలా వుంటాడు. ప్చ్! అతడు లేకపోయే సరికి ఆఫీసంతా డల్ గా వుందోయ్' అని జయంతే చాలా సార్లు అంది. అటువంటి శ్రీధరం అంటే శార్వాణికి ప్రస్తుతం పీకెల్దాకా కోపం వుండటానికి కారణం కనుక్కోవాలంటే నాల్గురోజులు వెనక్కి వెళ్ళాలి.
    టేబుల్ ముందు కూర్చొని పని చేసుకుంటూంది ఆమె. లంచ్ అవర్ దగ్గిరపడటంతో బయట నిశ్శబ్దంగా వుంది. ఆ గదిలో పక్కటేబుల్ మీద, ఫైళ్ళు గుట్టలు గుట్టలుగా పడివున్నాయి. ఆ టేబుల్ శ్రీధరానిది.
    "వచ్చాక ఇంత వర్కు ఎలా పూర్తిచేస్తాడో ఏమో...." అంది జయంతి వాటికేసి చూస్తూ.
    "మనలాగా ఆపసోపాలు పడుతూ మాత్రం చెయ్యడ్లే...." అంది కమల తన కజిన్ ని వెనకేసుకొస్తూ.
    ఆఫీసుకు రాగానే ఒకసారి ఆ టేబుల్ కేసి, తన పనిలో కూర్చోవటం అలవాటయింది శార్వాణికి.
    ఆ రోజు అలాగే చేసింది.
    లంచ్ అవర్ ఇంకో అయిదు నిమిషాలుందనగా అతడు ప్రవేశించాడు. ఆమె తలెత్తి "ఏం కావాలి?" అంది.
    అతడు ఒక క్షణం దెబ్బతిన్నాడు. తడబడి "కోళ్ళు" అన్నాడు.
    ఆమె అతడివైపు కాస్త జాలిగా చూసింది. చదువుకున్న వాడిలాగే కనబడుతున్నాడు. బహుశ వ్యవసాయంలో దిగాక చదువు మర్చిపోయి వుంటాడు.
    "ఇది పౌల్ట్రీ ఫీడ్ అంటే... కోళ్ళకి వేసే ఆహారం అమ్మే ఆఫీసు కాదు. మెన్యూర్స్ డిస్ట్రిబ్యూషన్- అంటే ఎరువుల పంపిణీ ఆఫీసు" అంది ఒక గ్రామీణ వ్యవసాయ విస్తరణాధికారిలా వివరిస్తూ.
    "అలాగా" అన్నాడు తల పైకెత్తి పైన ఫాను కేసి, పక్కనున్న చెక్క బీరువాకేసి చూస్తూ.
    "మీకు కోళ్ళ ఫీడ్ కావాలంటే జగదాంబా టాకీస్ దగ్గరికి వెళ్ళండి. అక్కడుంది.
    "మరిక్కడేమి అమ్ముతారు?"
    "ఇది ఎరువుల ఆఫీసు"
    "నాకు బీరకాయలకి వేసే ఎరువు కావాలి. అలాగే వంకాయలక్కూడా" అన్నాడు అమాయకంగా.
    "ఇది అమ్మేషాపు కాదు. కేవలం డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు. మీకు బీరకాయల ఎరువులు కావాలంటే యూనివర్సిటీ సైకాలజీ డిపార్టుమెంటు పక్క సందులోంచి వెళ్ళండి. దొరుకుతుంది" అంది.
    "మరి వంకాయలకి?" అన్నాడు.
    "మీకెంత పొలముంది?" అని అడిగింది.
    "ఓ ఇరవై ఎకరాలు. సముద్రం ప్రక్కనే" అన్నాడు.
    "వంకాయలకీ, బీరకాయలకీ ఒకటే" అంది ఓపిగ్గా.
    "బంగాళాదుంపలకి!" అన్నాడు.
    కొంచెం విసుకేసింది. "ఆ!... వాటిక్కూడా" అంది.
    "భూమి లోపల వుండేవాటికి, భూమి బయట వుండేవాటికి ఒకే ఎరువులు ఎలా ఉపయోగపడతాయి? ఫార్మర్ రిక్వైర్స్ నెట్రోజన్ అండ్ ది లేటర్ పొటాషియం" అన్నాడు. ఆమె అదిరిపడింది. ఇంతలో కమల లోపలికివస్తూ "హాయ్ అన్నయ్యా, ఎప్పుడొచ్చావురా?" అని అరిచింది.
    దాదాపు ఐదు నిముషాల్లో ఈ సంగతి ఆఫీసు అంతా పాకిపోయింది. తను శ్రీధరాన్ని మోతుబరి అని అనుకోవటం, బంగాళాదుంపలకీ, వంకాయలకీ ఒకే ఎరువు వేయమని సలహా ఇవ్వటం- కథలు కథలుగా అందరూ చెప్పుకుని నవ్వుకుంటున్నారని శార్వాణి గ్రహించింది.
    ఇంతకుముందు ఆ అమ్మాయిని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కొత్తగా వచ్చిన అమ్మాయికదా అని మొహమాటంగా, గౌరవంగా వుండేవారు. కానీ ఇప్పుడు తను క్యాంటీన్ లోకి ప్రవేశించగానే అందరూ ముసి ముసిగా నవ్వటం ఆమె కళ్ళబడుతూంది. ఈ కోపమంతా శ్రీధరం మీదికి తిరిగింది. అతడు మాత్రం ఏవీ పట్టనట్టు తన పని చూసుకుంటున్నాడు.
    ఈ గొడవ ఇక్కడితో ఆగేదే- రెండ్రోజుల తరువాత అది జరక్కపోతే!
    ఆ రోజు అయిదింటికి సీటు కట్టేసి లేచింది. పక్కసీట్లో శ్రీధరం ఇంకా పనిచేసుకుంటున్నాడు. అతడు ప్రతిరోజూ ఆరూ, ఆరున్నర వరకూ వుంటాడు. వున్నంతసేపూ సిన్సియర్ గా పని చేస్తాడు. ఆ విషయం మాత్రం వొప్పుకొని తీరాలి.
    ఆమె వెళ్ళబోతుంటే "ఏమండీ. కాస్త ఈ ఉత్తరం పోస్టు చేసి పెడతారా?" అన్నాడు.
    "పెట్టను." అందామనుకుని బావోదని తీసుకుంది.
    బీచ్ ప్రక్కనే నడుస్తూ దూరంగా ఐస్ క్రీమ్ షాప్ పక్కన పోస్టు బాక్స్ ని చూసింది. దానివైపు వెళుతూ యధాలాపంగా కార్డుకేసి చూసి ఉలిక్కిపడింది. అడ్రస్ అని వున్నచోట-
    వెంకటేశ్వర్రావ్, 
    కేరాఫ్ అలివేలు మంగతాయారు 
    ఏడుకొండలు
    తిరుపతి
    అని వుంది. శార్వాణికి మతిపోయింది. కార్డుమీద ఏముందా అనుకుంటూ, సంస్కారాన్ని కాస్త అవతలపెట్టి చదివింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS