Previous Page Next Page 
సంకల్పం పేజి 3

   

    "ఎడ్వయిజా"
   
    "అలాంటిదే.... మీ కళ్ళు విశాలంగా, పెద్దగా వుంటాయి. అవునా" కళ్ళవేపు చిలిపిగా చూస్తూ అడిగింది లిఖిత.
   
    "అవు...ను...." సిగ్గుపడుతూ అన్నాడు వికాస్.
   
    "అప్పుడప్పుడు ఐబ్రో పెన్సిల్ తో టచ్ చేసుకొండి.... బావుంటుంది. ఇంతే.... ఓ.కె..." సర్రుమని కారు ముందుకెళ్ళి పోయింది.
   
    ఏవో చెప్దామనుకున్న మాటలు వికాస్ నోట్లోనే వుండిపోయాయి.
   
    డాషింగ్ అండ్ డేరింగ్.... రేర్ కేరెక్టర్.... భలే అమ్మాయి.... ఎవరీ లిఖిత?
   
    బస్సు కోసం చూస్తూ పదినిమిషాలు నిలబడ్డాడు. రెండు బస్సులొచ్చినా ఎక్కడా ఖాళీ లేదు.
   
    బస్సులకోసం ఎదురుచూడడం అనవసరమనిపించింది వికాస్ కు.
   
    నడక ప్రారంభించాడు.
   
    కె.జి.హెచ్. దగ్గరకొచ్చేటప్పటికి ఆరు నిమిషాలు పట్టింది.
   
    చౌరస్తాకి ఎడమవేపు ఏదో హోటల్. వెళ్ళి కూర్చున్నాడు.
   
    "ఏం కావాలి సార్?"
   
    "వేడి కాఫీ"
   
    "కాఫీ చల్లగా ఇస్తారేంటి సార్" జోక్ వేసి వెళ్ళిపోయాడు బేరర్.
   
    నవ్వొచ్చింది వికాస్ కి.
   
    "ఇదిగో మీరడిగిన వేడి కాఫీ" టేబిల్ మీద పెడుతూ అన్నాడు బేరర్.
   
    కాఫీ సిప్ చేశాడు. నాళిక చుర్రుమంది.
   
    తన గురించి చైర్మన్ కి ఎలా తెల్సింది? చైర్మన్ తనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు. చైర్మన్ తరహా ఎలాంటిదో? లిఖిత అన్నట్టు ఇది తన జీవితానికో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
   
    లిఖిత ఎవరు? తనని ఆ అమ్మాయి అభిమానించడానికి గల కారణం? ఆమెతో మొదట మాట్లాడిన ఆ పది నిమిషాల్లో తను వ్యక్తం చేసిన అభిప్రాయాలేనా?
   
    హోటల్లో బిల్ చెల్లించి బయటికొచ్చాడు వికాస్. నడుస్తున్నాడు.
   
    అంతులేని జన సమూహం మధ్య అంతులేని ఒంటరితనం.
   
    వారం రోజుల క్రితం లిఖితతో మొదటి పరిచయం గుర్తుకొచ్చింది.
   
                              *    *    *    *    *
   
    డాబా గార్డెన్స్ లో-
   
    జింఖానా ఆటో మోబైల్స్ షోరూం కౌంటర్లో వికాస్ కూర్చున్నాడు.
   
    ఉదయం సరిగ్గా 11 గంటలు- షోరూం ముందు ఓ క్రీమ్ కలర్ ఫియట్ కారాగింది.
   
    అందులోంచి ఓ అమ్మాయి దిగి, గబగబా లోనికొచ్చింది.
   
    "ఎస్ మేడమ్.... వాట్ కెన్ ఐ డూ... ఫర్ యు" వినయంగా అడిగాడు వికాస్.
   
    "మీ కంపెనీ ప్రొడ్యూస్ చేసే లేటెస్ట్ కార్ల డిటైల్స్ ఇవ్వగలరా"
   
    ఆ అమ్మాయి ముఖం ప్రశాంతంగా వుంది.
   
    "ప్లీజ్ టేక్ యువర్ సీట్"
   
    "థాంక్యూ" కూర్చుంటూ, చుట్టూ చూసింది. ఇంటీరియర్ డెకరేషన్ నీట్ గా వుంది.
   
    ఓ మూల టైపిస్ట్ చేసే టకటక శబ్దం తప్ప షోరూం అంతా ప్రశాంతంగా ఉంది.
   
    ఆమెకు కావలసిన మెటీరియల్ కోసం లోనకెళ్ళిన వికాస్, రెండు నిమిషాల్లో బయటికొచ్చి కొన్ని బ్రోచర్స్ ఆమె ముందు పెట్టాడు.
   
    వాటిని ఆసక్తిగా చూస్తూ-
   
    "మీ షోరూంలో మీతో కలిపి ఇద్దరే స్టాపున్నారా?" అలవోకగా అడిగిన ఆ మాటకు ఆమెవేపు విచిత్రంగా చూశాడు వికాస్.
   
    ఆ ప్రశ్నకు సరైన జవాబు.
   
    'మైండ్ యువర్ బిజినెస్' ఆ అమ్మాయిని చూడగానే అలా అనలేక పోయాడు వికాస్.
   
    "బాస్ తో పాటూ అందరూ ఫీల్డ్ కెళ్ళారు" జవాబు చెప్పాడు.
   
    "ఆఁహా... చూడండి మిస్టర్..."
   
    "వికాస్"
   
    "వికాస్... ఇప్పటి జనరేషన్ మారుతీ అంటే క్రేజ్ గా వున్నారు. ఈ సమయంలో మీరు జింఖానా 1000 ఇంట్రడ్యూస్ చేశారు. అవునా... మీ జింఖానా ధౌజండ్ ద్వారా అదనంగా కస్టమర్ కి మీరిచ్చే సౌకర్యాలేమిటో చెప్పగలరా?"
   
    "మారుతీని మీరు అపురూపంగా చూసుకోవాలి. కాస్మొపాలిటన్ సిటీస్ లో మాత్రమే మారుతీని మీరు ఎంజాయ్ చెయ్యగలరు. ఏమాత్రం రోడ్లు బాగులేకపోయినా... ఆ ఇబ్బంది నేను చెప్పాల్సిన పని లేదు... మా జింఖానా థౌజండ్ విషయంలో మాత్రం అలాక్కాదు. ఇచ్చే మైలేజ్ చూడండి....మారుతీలో మీరు కూర్చుంటే కన్ జెస్టెడ్ గా ఉంటుంది. మా జింఖాలో అలాక్కాదు. మారుతీడోర్స్ చూడండి, మా డోర్స్ చూడండి. సిటీలోనైనా, రిమోట్ విలేజ్ లోనైనా... ఎంతసేపు డ్రైవ్ చేసినా చేసినట్టే ఉండదు. ఇంకో విషయం...మా జింఖానా థౌజండ్ బాడీ ఫైర్ ప్రూఫ్. ఫైర్ ఏక్సిడెంట్లు మీ జోలికి రావు. మీరొక్కసారి బోచర్సి పూర్తిగా చదివితే మీకే అర్ధమౌతుంది...." చెప్పి, లోనకెళ్ళి ఫ్రిజ్ లోంచి కూల్ డ్రింక్ తెచ్చి ఆమె ముందు పెట్టాడు.
   
    "వచ్చిన ప్రతి కస్టమర్ కీ కూల్ డ్రింక్ ఆఫర్ చేస్తారా.... మీరు?" బ్రోచర్ చూస్తూనే అడిగింది లిఖిత.
   
    "ప్రతివాళ్ళకీ ఎలా ఇస్తాం? లిమిటెడ్ పీపుల్" నవ్వేశాడు వికాస్. అలా నవ్వుతున్నప్పుడు అతని కళ్ళవేపు చూసి ఆశ్చర్యపడింది లిఖిత.
   
    "నేను బుక్ చేస్తే, ఎన్నిరోజుల్లో మీరు కారు డెలివర్ చెయ్యగలరు." వికాస్ ఇచ్చిన మెటీరియల్ ని, హేండ్ బేగ్ లో పెట్టుకుంటూ లేచి నిలబడింది లిఖిత.
   
    "పార్టీ ఎయిట్ అవర్స్"
   
    "ఈజ్ ఇట్ ట్రూ"
   
    "బుక్ చేసి చూడండి... మీకే తెలుస్తుంది"
   
    "బైదిబై నాదో చిన్న డౌటు.... ఇండియాలో వున్న కార్ల కంపెనీలన్నీ, తమ కస్టమర్లు లక్షాధికారులే అన్నట్టుగా వారికోసమే కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ పరిస్థితి మారుతుందంటారా" జవాబు ఏం చెప్తాడో విందామని కుతూహలంగా వుంది లిఖితకు.
   
    "జపాన్ వారి నేషనల్ వెహికల్ సైకిల్.... మనవారి నేషనల్ వెహికల్ ఎడ్లబండి.... అవునా? ఇక్కడ మధ్యతరగతి మనిషి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సైకిల్ మీద వెళ్తాడు. స్కూటర్ కొనుక్కోవడం అతని జీవితానికో మధుర స్వప్నం. అలాంటి పరిస్థితుల్లో అతనిచేత కారు కొనిపించాలి అంటే..."
   
    "దశాబ్దాలు గడుస్తున్నా... మధ్యతరగతి మనిషి... కారనే బ్రహ్మ పదార్ధానికి అతీతంగా ఉండాలని మీ కార్ల కంపెనీల యాజమాన్యాలు కోరుకుంటున్నాయా?" ఆమె ప్రశ్న అతన్ని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది.
   
    "నో.... నో... నా పాయింట్ అదికాదు. ఫర్ ఎగ్జాంపుల్.... మా జింఖానా కంపెనీనే తీసుకొండి..... సంవత్సరానికి నాలుగువందల కోట్ల టర్నోవర్ వుంది. ఇండియాలో ఉన్న అయిదు కంపెనీల్లో అతి ముఖ్యమైన కంపెనీగా గుర్తింపుంది. ఏమిటి లాభం? ప్రొడక్షన్ సైడ్ లో నావల్టీ లేదు. ఉన్న మోడల్ని కొంత చేంజ్ చేసి, కస్టమర్ కి అంటగట్టడం తప్ప- ఒక వెరైటీ మోడల్ని క్రియేట్ చేసి, సెన్సేషన్ సృష్టించాలన్న తపన లేదు. ప్రొడక్ట్ మార్కెట్లోకి వెళ్తోందా.... లేదా.... అనుకున్న ప్రాఫిట్స్ అటు ఇటూ వున్నాయా లేదా....అంతే. మా చైర్మెన్ ఏటి ట్యూడ్ ఇదే.... చైర్మెన్ అలా ఉంటున్నప్పుడు మిగతావాళ్ళెలా వుంటారో చెప్పండి...." కస్టమర్తో ఎక్కువ మాట్లాడుతున్నానేమోనని అన్పించింది వికాస్ కి.
   
    "ప్రతి కంపెనీలో వున్న గొడవలే ఇవి...." ఆ ప్రసంగానికి ఫుల్ స్టాఫ్ పెట్టబోయాడు వికాస్.
   
    "ఏదో చెయ్యాలని, ఏదో సాధిద్దామని మీకుంది.... మీలాంటివాళ్ళు ఇంకా మీ కంపెనీలో వుంటారు కదా.... మీ చైర్మన్ తో మాట్లాడొచ్చు కదా...."
   
    "ఏం మాట్లాడతాం మేడమ్... కార్ల మీదున్న ఇంట్రెస్ట్ తో ఈ ఫీల్డ్ లో కొచ్చాను. ఎలా వచ్చానో అదంతా ఓ కధ.... నాకు డిజైనింగ్ సైడ్ ఇష్టం......సేల్స్ సైడ్ వేశారు.... ఇక్కడకొచ్చే మీలాంటి కస్టమర్ల దగ్గర బాధ వెళ్ళగక్కుకోవడం తప్పించి, నాలాంటి వాళ్ళేం చెయ్యగలరు...." ఏదో సెన్సేషన్ క్రియేట్ చెయ్యాలని తపన వికాస్ మాటల్లో వ్యక్తమైంది.
   
    "దేనికైనా వెయిట్ చెయ్యాలి మిస్టర్ వికాస్... సడన్ గా మీ చైర్మెన్ దగ్గర్నించి మీకు పిలుపొచ్చిందనుకోండి .....ఒక అద్భుతమైన కారుకి రూపకల్పన చెయ్యమని ఆఫర్ వచ్చిందనుకోండి.... ఏం చేస్తారు?" నవ్వుతూ అంది లిఖిత.
   
    "సేల్స్ డిపార్ట్ మెంట్లో వున్న, ఓ ట్రైనీ ఇంజనీర్ కి చైర్మన్ దగ్గరన్ దగ్గర్నించి మేసెజ్ రావడం.... అనుకోవడానికి బాగుంటాయి మేడమ్.... కానీ ఇలాంటివి జరగవు...." కొట్టి పారేశాడు వికాస్.
   
    "వస్తే ఏం చేస్తారు...." సూటిగా అడిగింది లిఖిత.
   
    "వస్తేనా.... నిజంగా చెప్పమంటారా... ఆ దెబ్బతో ఆటోమోబైల్ ఇండస్ట్రీ చరిత్ర మారిపోతుంది.... ఇప్పుడున్న కంపెనీలన్నీ పడుకుంటాయి...." చాలా ధైర్యంగా, స్థిరంగా, నమ్మకంగా చెప్పాడు  వికాస్.
   
    "థాంక్యూ.... మీ టైంని వేస్ట్ చేశాను...."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS