Previous Page Next Page 
సంకల్పం పేజి 2

 

         "అవును కదా.... మొదటిరోజు నుంచి ఇప్పటివరకూ మీరు నా వివరాలు తెల్సుకోవడం కోసం ట్రై చేస్తున్నారు... అవునా...? అబద్దం చెప్పకండి....."
   
    ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు వికాస్.
   
    "అవును..." నెమ్మదిగా అన్నాడు.
   
    "ఇప్పుడు మిమ్మల్నో ప్రశ్న సూటిగా అడుగుతాను... చెప్తారా.... అబద్దం చెప్పకండి...?"
       
    "మీరు నన్ను ప్రేమిస్తున్నారా...." ఏ సంకోచం లేకుండా డైరెక్టర్ ఆ అమ్మాయి అలా అడగటంతో వికాస్ ఖంగు తిన్నాడు. చల్లటి, తియ్యటి ఐస్ క్రీమ్ చప్పగా, ఉప్పగా వున్నట్టనిపించింది.
   
    "నో... నో... అలాంటిదేం లేదు... జస్ట్.... అవుటాఫ్ క్యూరియాసిటీ... అంతే...."
   
    "అంతే... కదా... అయితే ఓ.కే... ఇప్పుడు చెప్తాను.... వినండి.... వారం రోజుల క్రితం.... ఓ పర్సనల్ పనిమీద ఈ సిటీకొచ్చాను....మువ్వలవాని పాలెంలో ఓ ఫ్రెండింట్లో దిగాను..... ఇక్కడ ఓ రెన్నెల్లు వుంటాను కాబట్టి, నాకో కారు కావాలి..... అంచేత మీ కంపెనీ కొచ్చాను.... అక్కడ మీరు పరిచయమయ్యారు.... ఇక్కడ పరిచయమైన మొదటి వ్యక్తి మీరు..... నాకు బోర్ కొట్టినప్పుడల్లా ఎవరికయినా ఫోన్ చేసి 'డిస్ట్రబ్' చెయ్యడం అలవాటు.....ఇక్కడ తెచ్చిన వ్యక్తి మీరే గనక..... ఫోన్ చేశాను..." ఆగి నెమ్మదిగా ఐస్ క్రీం తింటోందా అమ్మాయి.
   
    భలే విచిత్రమైన కేరక్టర్, ఇలాంటమ్మాయి తనకు ఇంతవరకూ ఎదురుపడలేదు. మనసులోనే నవ్వుకున్నాడు వికాస్.....

    "సారీ..."       
   
    "నో సారీస్... బీ స్పోర్టివ్.... ఏదో న్యూస్ చెప్తారన్నారు-" సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది అమ్మాయి.
       
    ఆమె కళ్ళల్లోంచి ఏదో అంతులేని ఆకర్షణ. ఆ కళ్ళవేపు చూడలేక తల దించుకుని-
   
    "ఇవాళ మా ఆఫీసులో ఓ సెన్సేషనల్ ఇన్సిడెంట్ జరిగింది.... అది మా చైర్మన్ నుంచి ఓ పర్సనల్ టెలెక్స్ మెసేజ్ నాకు రావడం.... రెండ్రోజుల క్రితం మీరన్న మాట నిజమైంది..."

    "ఎప్పుడెళ్తున్నారు....?" ఆసక్తిగా అడిగిందా అమ్మాయి.
   
    "రేపు గోదావరికి..." ఆగి.
   
    "మా చైర్మన్ గురించి మీకు తెల్సా....? మా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కే ఆయనెలా వుంటాడో తెలీదట... ఆయనకున్న యూనిట్లలో ఓ యూనిట్ లో ఆఫ్ట్రాల్ ఓ ట్రైనీ ఇంజనీర్ ని నాతో ఆయనకేం పనుంటుంది... అయినా, నా గురించి ఆయనకెలా తెల్సుంటుంది.... అదే మిస్టరీగా వుంది.... నిజంగా ఆ మెసేజ్ నాకే వచ్చిందో, లేదోనని కన్ ఫమ్ చేసుకోవడమే పెద్ద టాపిక్ అయి పోయింది తెల్సా..." ఎక్సయిటింగ్ గా చెప్పాడు వికాస్.
   
    "మీ చైర్మెన్ని కలవడమే జీవిత ధ్యేయమన్నారు కదా... తీరా ఆయన దగ్గర్నుంచే మీకు మెసేజ్ వచ్చేసరికి... ఆశ్చర్యపోతున్నారు..... తన స్టాఫ్ మెంబర్ని కలవాలనుకోవడం చైర్మన్ తప్పు కాదు గదా....?" నవ్వుతూ అందామ్మాయి.   
   
    "నా పాయింట్...." ఏదో చెప్పబోయాడు వికాస్.
   
    "చూడండి వికాస్.... ఆఫర్ వచ్చింది.... అదృష్టాన్ని చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీ చైర్మన్ తో మీ కలయిక మీకో టర్నింగ్ పాయింట్ కావచ్చుకదా."
   
    వెలుతురు పోయి చీకటి వస్తున్నట్టుగా బీచ్ నిండా టక్, టక్, టక్ మని పక్షులొక్కసారే రెక్కలు కొట్టుకుంటూ ఎగిరినట్టు దీపాలు వెలిగాయి.
   
    "వెళదామా..." లేస్తూ అందా అమ్మాయి.
   
    "ఓ.కె." వికాస్ కి ఆ అమ్మాయితో ఏదో మాట్లాడాలని వుంది. కానీ ఆ అమ్మాయి ధోరణి అందుకు వ్యతిరేకంగా వుండడంతో అనీజీగా వుందతనికి.
   
    ఇద్దరూ నడుచుకుంటూ కారు దగ్గరకొచ్చారు. పార్లర్ లో చాలాసేపు గడిపిన వాళ్ళిద్దరివేపు ఒకరిద్దరు ప్రత్యేకంగా చూడటం గమనించింది ఆ అమ్మాయి.
   
    "చూడండి... చిన్న క్వశ్చన్.... జవాబు చెప్తారా....ఇంతసేపు మనం ఎవర్నీ పట్టించుకోకుండా మాట్లాడుకున్నాం కదా.... మన చుట్టూ వున్న మిగతావాళ్ళు ఏమనుకుంటారో వూహించండి...."
   
    "విచిత్రమైన క్వశ్చన్లు వేస్తారు... మీరు ఏమనుకుంటారు.... ఏదో సీరియస్ విషయాన్ని డిస్ కస్ చేస్తున్నారనుకుంటారు..." కీ చెయిన్ని గాల్లోకి తిప్పుతూ అన్నాడు వికాస్.
   
    "అదే... ఏ విషయాన్నని..."
   
    "ఏదయినా కావచ్చు... మనమెలా చెప్పగలం......" మళ్ళీ అన్నాడు వికాస్.
   
    "ఆన్సరేం చెప్పాలో మీకు తెల్సు.... కానీ చెప్తే నేనేమనుకుంటానోనని చెప్పటం లేదు.... అవునా...?" కీ చెయిన్ తిప్పుతున్న అతని చేతిని చూస్తూ అంది ఆ అమ్మాయి.
   
    "ఆన్సర్ చెప్పటానికి తటపటాయిస్తున్నానా.... ఎలా చెప్పగలరు" ఆసక్తిగా అడిగాడు వికాస్.
   
    "మీరు కీ చెయిన్ ని తిప్పే వేగాన్ని బట్టి....." భుజాలమీంచి పైటను కప్పుకుమ్తూ అంది ఆ అమ్మాయి చలిగాలి రివ్వున వీస్తోంది.
   
    టక్ మని కీ చెయిన్ ని తిప్పడం ఆపేశాడు వికాస్. తనలో తనే నవ్వుకుంది ఆ అమ్మాయి.
   
    "మళ్ళీ తిరుగు ప్రయాణం ఎప్పుడు...."
   
    "శుక్రవారం మీటింగు.... శనివారం బయలుదేరి, ఆదివారం ఉదయానికి ఇక్కడే వుంటాను" చెప్పాడు వికాస్.
   
    "ఆదివారం సాయంత్రం యిక్కడే కలుద్దామా...." అతని కళ్ళల్లోకి చూస్తూ  అందా అమ్మాయి.
   
    "మీ యిష్టం... సరిగ్గా అయిదు గంటలకు...." చెప్పాడు వికాస్.
   
    "ఒకవేళ మీరు కాలేకపోయారనుకొండి..... ఊర్లోకి వచ్చాక కూడా నేను మీ రూమ్ కి రానా...."
   
    "వూర్లోకి వచ్చాక రాకపోవడం ప్రశ్నలేదు. ఎందుకంటే మన మధ్య పరిచయం తక్కువయినా... నా కెరీర్ గురించి మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి.... మిమ్మల్ని కలవడం బావుంటుంది" చెప్పాడు వికాస్.
   
    "మీ ఎడ్రస్ చెప్పండి"
   
    రఫ్ పేపర్ కోసం అటూ యిటూ చూశాడు వికాస్.
   
    "పేపర్ మీద రాసివ్వక్కర్లేదు.... చెప్పండి"
   
    "3-3-758/346/19, సింహాచలం నార్త్ ఎక్ ష్టన్షన్, ప్రహ్లాదపురం, డోర్ నెంబర్ పొడవుగా ఉంది కదా.... గుర్తుంటుందా చెప్పమంటారా.....3-3-758/346/19.... కరెక్టేనా" నవ్వుతూ అంది ఆ అమ్మాయి.
   
    "ఏక సంధాగ్రాహిలా వున్నారు మీరు" పొగిడాడు.
       
    "బైదిబై... మీరు బేచిలరేనా...."
   
    "ఏం అలా అడిగేరు?"
   
    "ఏం లేదు.... నేను మీ రూమ్ కొచ్చేసరికి.... మీ ఫ్రెండ్స్ తో మీరు అల్లకల్లోలంగా వున్నారనుకోండి..." చెప్పడం ఆపి చిలిపిగా చూసింది.
   
    "అల్లకల్లోలం లేదు... హడావుడీ లేదు... మీరే చూస్తారు కదా.....యూ ఆర్ ఆల్వేస్ వెల్ కమ్..." ఆ అమ్మాయి కార్లోకి ఎక్కి, స్టీరింగ్ ముందు కూర్చుంది.
   
    చటుక్కున వికాస్ కేదో జ్ఞాపకం వచ్చింది.
   
    "ఇందాక ప్రశ్న.... ప్రశ్నలాగే వుండిపోయింది..... దానికి ఆన్సర్ చెప్పాలి."
   
    "చెప్పాలా... తప్పదా.... ఈ ఏజ్ వాళ్ళు, ఎవర్నీ పట్టించుకోకుండా సీరియస్ గా మాట్లాడుకుంటుంటే, చూసేవాళ్ళేవనుకుంటారో తెల్సా..... పెళ్ళి విషయం డిస్ కస్ చేసుకుంటున్నారనుకుంటారు... యామై కరెక్ట్"
   
    "ఎస్. పర్ ఫెక్ట్ లీ.... ఎ గుడ్ అబ్జర్వేషన్" పొగడ్తగా అన్నాడు వికాస్.
   
    "ఓ.కె. సీయూ... విష్ యూ ఆల్ ది బెస్ట్...."
   
    "థాంక్యూ.... మిస్...."
   
    "నా పేరు ఇప్పటివరకూ మీకు తెలీదా... లిఖిత"
   
    'బ్యూటిఫుల్ నేమ్' మనసులోనే అనుకున్నాడు వికాస్. అప్పటికే కారు ముందుకెళ్ళిపోయింది.
   
    వెలుతురంతట్నీ చీకటి మింగేసింది. నియాన్ లైట్ల వెల్తురులో రోడ్లన్నీ పసుపుపచ్చగా ఉన్నాయి.
   
    రోడ్డుమీద వందలాది మనుషుల పొడవాటి నీడలు.
   
    హుసేన్ 'ఎబ్ స్ట్రాక్ట్ పెయిటింగ్'లా వుంది.
   
    రామకృష్టా బీచ్ రోడ్డు మలుపు దగ్గర నిలబడ్డాడు వికాస్ సిటీ బస్సు కోసం.
   
    సడన్ గా తన ముందు ఆగిన కారువేపు చూశాడతను.
   
    మళ్ళీ లిఖిత.
   
    "దారి తప్పిపోయారా" నవ్వుతూ అడిగాడు వికాస్.
   
    "మీతో ఓ విషయం చెప్దామనుకున్నాను.... మర్చిపోయి వెళ్ళి పోయాను.... చెప్పాలనుకున్న విషయం చెప్పకపోతే, మళ్ళీ మీరు కలిసేంత వరకూ నాకు చాలా అనీజీగా వుంటుంది. అంచేత...;. చెప్పేద్దామని...."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS