Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 3

           

                         

 

                           అధ్యాయం - 2
   
   
    ధరణిని ఆఫీసు ముందు డ్రాప్ చేసిన శ్రీధర్, స్కూటర్ స్టార్ట్ చేస్తూ "సాయంత్రం ఆలస్యం అవుతుంది. బస్ లో వెళ్ళిపో!" అన్నాడు.
   
    "అయ్యో!.... కూరలు కొనుక్కోవాదానికి మార్కెట్ కి వెళదామనుకున్నాం కదండీ!" అంది ధరణి.
   
    "చిన్న పని పడింది కానీ నువ్వు వెళ్ళి కూరలు తీసుకుని బస్ లో వెళ్ళిపో!"
   
    "ఏం పనిటా?" శ్రీధర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది ధరణి.
   
    "పర్సనల్!" అన్నాడు కళ్ళు వాల్చుకుని.
   
    "నాతో చెప్పకూడదా?"
   
    "పర్సనల్ గా అన్నాగా. ఆ మాటకి అదే అర్ధం" విసుగ్గా అన్నాడు.
   
    ధరణి వెనక్కి చూసి "అరె....మా కొలీగ్ జిలానీ వస్తున్నాడు. మీరెళ్ళిపోండి. అతనితో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలి!" అంది.
   
    శ్రీధర్ ఎర్రగా చూసి "ఏం నేనెందుకు వెళ్ళిపోవాలీ? నేను వినకూడని సంగతులా?" అన్నాడు.
   
    "పర్సనల్ అంటే అదేగా అర్ధం!" కవ్విస్తున్నట్లుగా అంది.
   
    శ్రీధర్ కి నవ్వొచ్చేసింది. "సాయంత్రం కబీర్ గాడు పార్టీ ఇస్తున్నాడు. చాలా రోజులయింది కదా...." అన్నాడు.
   
    ధరణి నవ్వుతూ "మరి ఆ మాట ముందే చెప్పొచ్చుగా! భార్యకి తెలియని పర్సనల్ సంగతులు భర్తకీ, భర్తకి తెలియని పర్సనల్ సంగతులు భార్యకీ ఏం వుంటాయి?" అంది.
   
    "చెప్తే ఒప్పుకోవనీ..." నసిగాడు శ్రీధర్.
   
    "ఫ్రాంక్ నెస్ ని నేను ఎప్పుడూ ఒప్పుకుంటాను. ఇంకెప్పుడూ ఏదీ నా నుంచి దాచాలని చూడకండి. వెళ్ళండి, సాయంత్రం నేను బస్ లో వచ్చేస్తాలెండి" అంది.
   
    "థాంక్యూ మైడియర్ రాకాసీ!" అని స్కూటర్ స్టార్ట్ చేసుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు శ్రేధర్.
   
    పదిన్నర అవుతోంది.
   
    ధరణి వాచ్ వైపు చూసుకుని త్వర త్వరగా తన ఆఫీస్ వున్న బిల్డింగ్ వైపు నడిచింది. సంఘమిత్రా ఇంజనీరింగ్ ఆఫీస్ థర్డ్ ఫ్లోర్ లో వుంది. ఓ నిమిషం లిఫ్ట్ కోసం నిలబడింది. అది రాకపోవడంతో నడిచి ఎక్కుదాం.... అని కదుల్తూ వుండగా లిఫ్ట్ వచ్చింది. ధరణి లోపలికి వెళ్ళి డోర్ వెయ్యబోతుండగా చీఫ్ ఇంజనీర్ రావు హడావుడిగా లోపలికి వచ్చేశాడు.
   
    "గుడ్ మార్నింగ్ సార్...." ఇబ్బందిగా గోడవైపు జరుగుతూ అంది ధరణి.
   
    "ఆ ... గుడ్ మార్నింగ్.... ఏవిటీ డల్ గా కనిపిస్తున్నావూ? కళ్ళు కూడా నిద్రలేనట్లు ఎర్రగా కనిపిస్తున్నాయి!" ఆయన ఆమెకి దగ్గరగా జరుగుతూ అన్నాడు. నోట్లో వున్న కిళ్ళీ తుంపరలు ఆమె మీద పడుతున్నాయి.
   
    ధరణికి లిఫ్ట్ ఆపేసి దిగి నడిచి వెళ్ళిపోవాలనిపించినా వోర్చుకుంది. ఆమెకి అతను ఇమీడియెట్ బాస్.
   
    అతడి కుడిభుజం ఆమెకి తగుల్తోంది.
   
    "వాస్తుమీద నేనో పుస్తకం రాశాను. ఆదివారం మా ఇంటికి రాకూడదూ చూపిస్తాను" అన్నాడు.
   
    "సన్ డేస్ నేను ఎక్కడికీ రాను సార్. పిల్లలొస్తారు" చెప్పి లిఫ్ట్ ఆగడంతో బైటికి నడిచింది.
   
    రావు ఆమెని దాటి గబగబా తన ఛాంబర్ లోకి వెళ్ళిపోయాడు. ఆమెకి తెలుసు. అతని ప్రపోజల్ ని కాదన్నందుకు పర్యవసానం ఎలా వుంటుందో!
   
    రిసెప్షనిస్ట్ గీత ఓ చేత్తో ఫోన్ పట్టుకుని ఎవరితోనో మాట్లాడుతూనే ఇంకొ చెయ్యి, ధరణిని విష్ చేస్తున్నట్టు వూపింది. నవ్వుతూ ధరణి కూడా చెయ్యి వూపింది. గీత చాలా అమాయకమైన అమ్మాయి. త్వరలోనే ఆమెకి పెళ్ళి కాబోతోంది. వివాహం తరువాత భావిజీవితం గురించిన తన కలలన్నీ భోళాగా ధరణికి చెప్తూ వుంటుంది. ధరణి వాటిని నవ్వుతూ తీసిపారెయ్యదు. నిజమవ్వాలని కోరుకుంటుంది.
   
    గీతని చూడగానే తన భర్త గుర్తొచ్చాడు. మొదటిరాత్రే 'జీవితంలో తాగన' ని భర్తతో గీత ఒట్టు వేయించుకుంటుందట! శ్రీధర్ లాటివాడు భర్తయితే ఏం చేస్తుందా అని నవ్వుకుంటూ తన సీట్ లో కూర్చుంది.
   
    ఫ్యూన్ వచ్చి బాస్ పిలిచారని చెప్పాడు. ధరణి వెళ్ళింది.
   
    రావు ధరణిని నిశితంగా చూశాడు.
   
    నల్ల చుక్కలున్న వైట్ ఆర్గండి చీర కట్టుకుని లూజ్ గా జడవేసుకుని నుదుట కుంకుమబొట్టుతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మొత్తం బ్రాంచ్ కి అతనే హెడ్డు కాబట్టి ఓ అమ్మాయిని టాకిల్ చెయ్యడానికి అతనికి ఇంతకాలం ఎప్పుడూ పట్టలేదు. కాని ధరణితో మాట్లాడటానికి కాస్త జంకుగా వుంటుంది.
   
    "ధరణీ.... మనం సైట్ మీదికి వెళ్ళాలి" అన్నాడు. ఆమెకి నిస్సత్తువ ఆవరించింది.
   
    ఓ సివిల్ ఇంజనీర్ గా అది తప్పదు. కాదు అనలేని విధంగా ఇరికించేశాడు. ఇదివరకు అతని చేష్టలకి అడ్డుపడిన మణిమాలని నీళ్ళుకూడా దొరకని ఎడారిలాంటి సైట్ ఆఫీసుకి బదిలీ చేయించేశాడు. అంతా అతని చేతిలో పని ..... ధరణి తలవూపి బయల్దేరింది. కారుకన్నా వేగంగా ఆమె ఆలోచనలు కదులుతున్నాయి.
   
    ఫిజికల్ హెరాస్ మెంట్ ని మించినది మెంటల్ హెరాస్ మెంట్. ఇష్టంలేని వ్యక్తులతో గంటల తరబడి గడపవలసిరావడం నరకం. ఒకరి ఉనికి ఒకరు భరించలేం అని నిర్ణయించుకోగానే భార్యాభర్తలు విడాకులు తీసుకునే సౌలభ్యం వుంది. కనీ ఆఫీసుల్లో ఈ ఎంప్లాయీ, ఎంప్లాయర్ రిలేషన్లో అలాంటి సౌకర్యం లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా కొని సంవత్సరాలపాటు భరించాల్సి రావచ్చు. ఇటువంటి హెరాస్ మెంట్ భరించలేకే కొంతమంది ఉద్యోగాలు వదిలేసి నానాకష్టాలూ పడడం.... లేదా అసహనంతో ప్రస్టేషన్ భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తుంటారు.
   
    "ఆఫీసర్ తో పడకపోతే ప్రాణం తీసుకుంటారా? చోద్యం కాకపోతేనూ!" అంటారు విన్నవాళ్ళు. కానీ అది ఎంత దుస్సహంగా వుంటుందో భరిస్తూన్న వాళ్ళకి తెలుస్తుంది అనుకుంది ధరణి. రావు ఏదో మాట్లాడుతున్నాడు. ఆమె వినటంలేదు. ఆ మాటకొస్తే రావుతో ఎవరూ సంభాషించలేరు కేవలం వినడం తప్ప! ధరణి అధీ చెయ్యడంలేదు. ఆమె మనసంతా మార్కెట్ లో తను కొనాల్సిన వస్తువుల మీదే కేంద్రీకృతమై వుంది. శ్రీధర్ కి ఇష్టమైన కూరగాయలూ, పిల్లలకి నచ్చే చిరుతిండ్లూ గురించి ఆమె ఆలోచిస్తోంది.
   
    కార్లో బ్యాక్ సీట్ లో ధరణీ, ఆమె ప్రక్క రావూ కూర్చున్నారు. అతను కూర్చున్న భంగిమా, మాట్లాడ్తూ తన పొట్టమీద చెయ్యివేసి నిమురుకోవడం ఆమెకి చాలా ఇరిటేటింగ్ గా వున్నాయి. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. అతని శరీరాన్ని అతను నిమురుకుంటే మధ్యలో తనేం అనగలదూ? అందుకే భరిస్తూ కూర్చుంది. తను అన్ని రంగాల్లో ఎంత సక్సెస్ ఫుల్లో అతను చెపుతున్నాడు. అన్యాపదేశంగా అతను పంపిస్తున్న సంకేతాలు రిసీవ్ చేసుకోలేని అమాయకురాలు కాదు ధరణి! అతని బారినుంచి తప్పించుకోవటానికి ఆమె బ్యాగ్ లోంచి నవలొకటి తీసి అందులో తలదాచుకుంది. సాధారణంగా మనుషులతో మాట్లాడటం ఎవాయిడ్ చెయ్యడానికి ఆమె ఎంచుకునే ప్రక్రియ అది!
   
    ఆమె ఆ పని చేశాక రావు ఇదివరకటిలా లొడా లొడా తన గొప్పతనం గురించీ, మేధస్సు గురించీ మాట్లాడలేకపోయాడు. అయాన్ రాండ్ నవల చదివే అమ్మాయికి తను చేసే పేలవమైన సంభాషణ ఏ విధమైన ఇంట్రెస్టూ కలిగించలేదని అనుభవపూర్వకంగా అతనికి తెలుసు! రావుకి యాభైఏళ్ళు ఇటువంటి అమ్మాయిల్ని ఎంతమందినో చూసుంటాడు. అతను కార్యదీక్ష కలవాడు. అంత త్వరగా నిరాశపడే స్వభావం కాదు.
   
    సీరియస్ గా పుస్తకం చదువుతున్న ధరణికి "ఆ.... ఆ..." అన్న రావు మూలుగు వినిపించి తల ఎత్తి చూసింది. ఓ క్షణం ఆమెకేమీ అర్ధంకాలేదు. గుండెమీద రాసుకుంటూ రావు ఆమె ఒడిలోకి ఒరిగిపోయాడు. "ఏవైంది....వాట్ హాపెండ్" అని అడుగుతూనే ధరణి అప్రయత్నంగా అతని ఛాతీమీద చెయ్యి వేసింది. ఈ గొడవకి డ్రైవరు కారు ఆపేసి కంగారుగా "ఏవైందమ్మా?" అన్నాడు. "ఏమో! స్ట్రోక్ వచ్చినట్లుంది. దగ్గర్లో డాక్టర్ ఎవరైనా ఉన్నారేమో.... కారు పోనీ!" అంటూ అతని గుండెలమీద చేత్తో రాయసాగింది ధరణి. ఆమెకి చాలా గాభరాగా అనిపించింది. ఇప్పటిదాకా బాగానే మాట్లాడ్తున్నాడు. కొంపదీసి పోడు కదా అనుకుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS