Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 3

    "కుళ్ళా కుళ్ళున్నరా! ఇంగ్లీషు నవలను మక్కీ మక్కీ కాపీ కొట్టే మాయదారి మగాళ్ళను మహారచయితను చేసింది ఈ మగ ఎడిటర్లు కాదూ! మనకీ ఓ ఛాన్సు ఇస్తే ఆమాత్రం మనం కొట్టగలం కా...పీ..." కాఫీ తాగినంత తేలిగ్గ చెప్పేసింది మహా రచయిత్రి మహాదేవి.

    "కధలు కాకరకాయలు కట్టిపెట్టండి. ఒకా నొకనాడు ఈ సాహితీ ప్రపంచాన్ని ఏలింది మన రచయిత్రులు కారా! కీర్తి కిరీటాలు దక్కింది స్త్రీలకు కాదా. ఈ మగవారలు మన హక్కులను అన్యాయంగా ఎలా హరిస్తున్నారో వుదాహరణకి (పత్రిక, నవల రెండూ స్త్రీ లింగాలు) ఈనాడు రచయితలు పత్రికల ఫ్రంట్ పేజీల్లోను, నవలల బ్యాక్ పేజీల్లోను ఎక్కటమే. ఈ అన్యాయం ఎంతోకాలం సాగదు. అన్యాయం నశించాలి" అరుణ వర్ణం దుస్తులు ధరించిన అరుణేందిర పిడికిలి బిగించి గాలిలోకి చేతిని ఎత్తి అరిచింది.
   
    "నశించాలి" అందరూ నాలుగు దిక్కులూ పిక్కటిల్లేలా అరిచారు.
   
    "కాపీ రచయితలు"
   
    "నశించాలి. నశించాలి."
   
    "మగజాతి..."
   
    "నశించాలి... నశిం..." తండ్రులు, సోదరులు, పతులు, పుత్రులు, సుపుత్రులు గుర్తుకు రాగ 'నశిం' దగ్గరే ఠకీమని నోరు మూసుకున్నారు.
   
    "సైలెన్స్" అని అరిచి లీడర్ లీలారాణి కొంగున మూట గట్టుకున్న మూటని విప్పి గుప్పెడు అక్షింతలు చేతిలోకి తీసుకొని అందరి నెత్తిన చల్లి మళ్ళీ మూటని ముడేసి రొంటిన దోపుకుని నారదున్ని అడిగింది "ఊ... ఇప్పుడు చెప్పండి."
   
    "ఏం చెప్పాలి?" నారదుడు అయోమయంగా అడిగాడు.
   
    "నా ప్రశ్నకి జవాబు!" లీలారాణి కళ్ళెర్ర చేసి కరకుగ అడిగింది.
   
    "రచయితల గురించి నాకు తెలిసి చావదే!" మాయదారి ఈ మహా ప్రపంచం గురించి బోలెడు కథలు తెలిసినా రచయితల గురించి బొత్తిగ తెలియనందున బోలెడు సిగ్గుపడుతూ శలవిచ్చాడు నారదుడు.
   
    "అయ్యో సీతా (రామ బదులు) మా ప్రశ్న మరచిపోయారా నారదా! ఆడవాళ్ళకే ఈ కష్టా లెందుకు?"
   
    "స్త్రీలు ఎంత ఉన్నతులో తెలియటానికి మాత్రమే ఈ కష్టాలు కన్నీళ్ళును. సీతాదేవికి అగ్ని పరీక్ష ద్రౌపదికి నిండు సభలో అవమానం. ఇంకా సుమతి, చంద్రమతి..."
   
    "ఇందుమతి మందమతి ఈ పేర్లు ఎవరడిగారు? ఆ కష్టాలు వాళ్ళు చేతులారా కొని తెచ్చుకున్నవి. ఆ రఘురాముడు సీతాదేవి శీలాన్ని శంకించినప్పుడు అప్పుడే డైవోర్స్ ఇస్తే పోయేదానికి అగ్ని పరీక్ష దాకా నిలిచి రామాయణమంత కధ చేజేతులారా చేసుకుంది. ఆ.......అగ్నిపుత్రి నిండు సభలో వందలమనది మగ మహారాజుల సమక్షంలో ద్రౌపతికి మాన మర్యాదలు మంట గలిస్తే మౌనవ్రతం పాటించాల్సింది పోయి..."
   
    "నారాయణ-నారాయాణ..." అలవాటుగ అనబోయి నాలుక్కర్చుకుని "అమ్మా! తల్లీ!" అన్నాడు నారదుడు.
   
    "ఏంటి?" ముఖం చిట్లించి అడిగింది లీలారాణి.
   
    "వాళ్ళంతా మహా పతివ్రతలు తల్లీ!"
   
    "పతివ్రతలు కాదని నేనన్నానా! అసలునన్నడిగితే స్త్రీలంతా పతివ్రతలే అని చెపుతాను. వాళ్ళు మాత్రమే పతివ్రతలా! దుర్యోధనుడి భార్య, దుశ్సాసనుడి భార్య, కర్ణుడిభార్య కీచకుడి భార్య, రావణుని భార్య కంసుడి భార్య వీళ్ళంతా పతితలా?"
   
    "అలా అని నేను అనలేదు తల్లీ!"
   
    "పని గట్టుకుని అనాలేంటి? రాజుగారి పెద్దభార్య మహాపతివ్రత అంటే చిన్న భార్య కాదనేకదా!
   
    "ఇలా పెడర్ధాలు తీస్తే ఎలా తల్లి! నేచెప్పిన పతివ్రతలకి కన్నీళ్ళు కష్టాలు అవమానాలు అపనిందలు వగైరా చరిత్రలు వున్నాయి. రామాయణ మహాభారతాలు....
   
    "వద్దు మీరింకేం చెప్పొద్దు టి వి ధర్మమా అని రామాయణ భారతాలు కళ్ళారా చూసి ఓ సత్యం మేము తెలుసుకున్నాము."
   
    "ఏమిటది?" ఆత్రుతగ అడిగాడు నారదుడు.
   
    "ఏమిటది? మాలో కొందరం పిల్లలకు తల్లులం మరి కొందరం కాపురాలు చేస్తూ ఇంకా పిల్లలదాకా వెళ్ళని వాళ్ళం ఇంకొందరు పెళ్ళికాని వాళ్ళు వాళ్ళ వయసులు ఇరవైనుంచి అరవైదాక..."
   
    "వృద్ద కన్యలు..." మనసులోనే గొణుక్కున్నాడు నారదుడు.
   
    "పెళ్ళయి పిల్లలున్న మేము పెళ్ళికాని వారికి ఏం చెపుతున్నామంటే మీరు ఈ జన్మలో పెళ్ళంటూ చేసుకుంటే ఓ రౌడీని చూసి పెళ్ళి చేసుకోండి. దుర్యోధనుడు రావణాసురుడు లాంటి వారినిగాని గల్ఫ్ దేశాల నియంతలని గాని పెళ్ళాడండి అని మంచి వుదాహరణాలు చూపి నొక్కి వక్కాణిస్తున్నాము."
   
    "రౌడీలు, నియంతలు, రాక్షసులు, దుర్యోధనుడు, రావణుడు ఇలాంటి వాళ్ళని పెళ్ళిచేసుకోటానికి ఇష్టపడి ప్రోత్సాహించి...ఇదేంటి తల్లీ! కర్ణభేరి పని చేస్తున్నదా! నేను.... నేను.... నిజంగా ఇలాంటి మాటలు మీ నోటంట విన్నానా! భూమితో పాటు నా బుర్రకూడా తిరగటం, అయ్యో ఇదేం వ్యాధి!" నారదుడు చిరతలని రొంటిన దోపుకుని తుంబరణి వదిలేసి రెండు చేతులతో తిరుగుతున్న తలని గట్టిగ పట్టేసుకున్నాడు.
   
    "ఇహ్హిహా! ఇది వ్యాధి కాదు స్వామీ! బి.పి. అనగా బ్లడ్ ప్లెషరు అని....దీనిలో మళ్ళీ రెండు రకాలు వకటి హైరెండవది లో"
   
    రెండు చేతులతో తల గట్టిగ నొక్కుకోవటంవల్ల తల తిరగటం కాస్త తగ్గింది నారదమునీంద్రులవారికి వెంటనే తన అనుమానం తీర్చుకుంటూ "తల్లీ! ముందుగ నాయీ అనుమానం తొలగిపోతే తప్ప ఆపై మాటలు వినలేను. నా అనుమాన నివుర్తి చేయండమ్మా! మామూలుగ వున్న మొగవాడిని కట్టుకుంటేనే కట్నం చావులు, కిరసనాయిలు చావులు మీస్త్రీలకి తప్పటంలేదు. రౌడీలను పెళ్ళి చేసుకుని ఏం సుఖపడతారమ్మా ఎందుకు ఇలాంటి విపరీతబుద్ది మీ ఆడవాళ్ళకి కలిగింది? కలియుగ ప్రభావమా!" అంటూ బాధగ అడిగాడు.
   
    నారద మునీంద్రుల వారి మాట వినగానే "కిలకిల, కిచకిచ, కువకువ, అహ్హహ, ఇహ్హిహీ," అంటూ ఆడవాళ్ళంతా వాళ్ళ వాళ్ళ శక్తానుసారం పకపక నవ్వారు. పడిపడి నవ్వారు చివరికి వాళ్ళ పొట్టలని వాళ్ళ వాళ్ళ చేత్తోనే పట్టుకుని నవ్వాపుకున్నారు.
   
    "నియంతణి పెళ్ళి చేసుకుంటే అతగాడి భార్యకూడా అధికారం చలాయించవచ్చు."
   
    "రాక్షసుడిని పెళ్ళిచేసుకుంటే అందరిచేత ఆ భార్యమణి అడుగులకి మడుగులు వత్తించుకోవచ్చు."
   
    "రౌడీని పెళ్ళి చేసుకుంటే అతగాడి ఇల్లాలిజోలికి ఏ మగపురుగు పోదు."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS