Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 2

    "మొత్తానికి మగాడి బుద్ది పోనిచ్చుకున్నారు కాదు. ఆడవాళ్ళకున్నన్ని కష్టాలు మగవాళ్ళకి ఎక్కడ వున్నాయి? ఏ దేశంలోను లేవు. కష్టాలు కన్నీళ్ళూ ఆడవాళ్ళకే ఎందుకుండాలి? ఇది అన్యాయం, అధర్మం, అక్రమం, అ...అ....అ..." అంది అరుణేందిర ఆవేశంతో కూడిన ఆయాసంతో రొప్పుతూ.
   
    "నారాయణ....నారాయణ...." అన్నాడు నారదుడు.
   
    "చూశావా! చూశావా! ఈయన నామజపం! నారాయణ నారాయణ అనకపోతే 'రంభ రంభ' అనో, 'ఊర్వశీ ఊర్వశీ!' అనో మాటకు ముందు అనొచ్చు కదా?" లాయర్ కాబోయి కాలేని లాయర్ సుహాసిని లా పాయింట్ లాగుతూ అంది.
   
    ఈ తఫా నారద మునీంద్రుల వారు రెండు చేతులతో రెండు చెవులూ మూసుకుంటూ పెదవి కదపకుండా "నారాయణ, నారాయణ" అని మనసులోనే అనుకున్నారు.
   
    "ఆయన అలవాటు అది" రంగనాయకి బోలెడు జాలితో అంది.
   
    "రంగనాయకీ! నీకెన్నిసార్లు చెప్పాను మగజాతిపట్ల స్త్రీలకి ఈ జాలియే కూడదని!" మందలింపుగా అంది మందారవల్లి.
   
    "విషయం చెప్పండి తల్లులారా! నా వుదరంబులో ఏమిటో గడబిడగ వుంది." తంబురని ఓసారి టింగ్ టింగ్ మని మీటి మహాజాలిగా ముఖంపెట్టి అడిగాడు నారదుడు.
   
    "ఒక్క నిమిషం మీరిక్కడే ఆగండి." అని చెప్పి లీడర్ లీలారాణి తన జాతినంతా తోడ్కొని కాస్త దూరంగా వెళ్ళి చర్చ మొదలు పెట్టింది.
   
    "నారద మునీంద్రుల వారు మగ జాతిలోని వారే కావచ్చు. కాని ఏ స్త్రీకి అన్యాయం చేయలేదు. లోక కళ్యాణం కోసం పతివ్రతలకి పరీక్షలు పెట్టేదాకా స్క్రిప్ట్ రాసినా కథ చివరికి సుఖాంతమే చేసేవారు. మహా పతివ్రతలు కూడా ఈయనగారిని సలహా అడిగేవారు. కనుక మనప్రాబ్లం ఏమిటో దానికి మార్గం ఏమిటో ఈయనగారినే అడిగితే సరిపోతుంది" రచయిత్రి మహాదేవి అంది.
   
    "అడగటం నా కిష్టంలేదు. ఎంతయినా మగవాడు."
   
    "అందరాడాళ్ళనీ తల్లీ! అనేవాడు కాబట్టి అడగొచ్చు."
   
    "ఎందుకొచ్చిన గోల మన దోవన మనం పోక."
   
    "అదేం మాట మనది పెద్ద ప్రయత్నం? సలహావల్ల నష్టపోయేది ఏముంది కనక....!"
   
    ఇలా అందరూ కలిసి తర్జన భర్జనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. మనం ప్రయాణం అయిన తర్వాత మనకి ఎదురుపడ్డ మొదటి మగవాడు నారదుడు. ఆయన్ని యక్ష ప్రశ్నలు వేసి లక్ష జవాబులు పొందుదామని అనుకున్నారు. అనుకున్నదే తడవుగ ఝుమ్మంటూ వచ్చి ఆయన చుట్టూ చేరారు.
   
    "నారద మునీంద్రా! మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాము. వాటికి సరి అయిన జవాబులు మీ నోటి వెంటవస్తే అప్పుడు మేము మా కష్ట సుఖాలు మీతో చెప్పుకుంటాము ఓకేనా?" అన్నారు అందరూ.
   
    "ఓకేనా! అంటే ఏంటి తల్లులారా?" నారదుడు అడిగాడు.
   
    "ఇంగ్లీషు కాస్తంత కూడా రాదా నారదా!" భ్రమరాంబాదేవి అడిగింది.
   
    "అప్పుడప్పుడు భూలోకానికి వచ్చి పోతుంటాను కదా! అందువల్ల అన్ని భాషల్లోను కాస్తంత టచ్ వుంది."
   
    "మరి ఓకేకి అర్ధం తెలియలేదా!"
   
    "ఓ.కె కి వచ్చిన అనర్ధమా ఇది ఓకేనా! అని అడిగేసరికి అదేదో భాష అనుకుని అడిగాను. మీ రడిగిందానికి అల్లాగే అల్లాగే."
   
    "మామాటని తప్పుపట్టిన మీరు అలాగే అనాల్సిందిపోయి మధ్యలో ఈ అల్లాగే ఏంటి?" లాయర్ కాబోయి కాలేని లాయర్ సుహాసిని లా పాయింట్ లాగుతూ అడిగింది.
   
    "హిందీ ముస్లిమ్ భాయీ భాయీ అన్న నిదర్శనానికి అలాగే అనేబదులు 'అల్లా'గే అన్నాను. అంతకుమించి నా మాటలో విపరీతార్ధం లేదు తల్లీ!"
   
    "అలాగే!" సంతోషంగ అంది సంతోషమ్మ.
   
    "ప్రతిదానికి వూరికే ఆనందపడిపోతావు. మధ్యలో నీ వొక దానివి" అంటూ రంగనాయకి ముచ్చటగ కోప్పడి "నారదులవారు సరేనన్నారు ఇంక కానీండి. లేడీ లీడర్ లీలారాణీ!" అంటూ భారం ఆమే మీద పెట్టింది.
   
    సరాసరి రంగంలోకి దిగిపోయింది లేడీ లీడర్ లీలారాణి.
   
    "ఆడవాళ్ళకే ఈ కష్టాలెందుకు?"
   
    "ఏ కష్టాలు? కట్నాల బాధ, కిరసనాయిలు చావులు...."
   
    "ఎదురు ప్రశ్నలు వద్దు స్వామీ! మా ప్రశ్న మీ జవాబు అంతే. చెప్పండి ఆడవాళ్ళకే ఈ కష్టాలెందుకు?"
   
    "ఎందుకంటే....ఎందుకంటే...." అంటూ కాస్త లోతుగ ఆలోచిస్తూ తుంబరని టింగ్ టింగ్ అని మీటి ఏదో మా గొప్ప అయిడియా రాగా "ఒక మనిషి యొక్క మంచితనంగాని చెడ్డతనం గాని వాళ్ళకొచ్చే కష్టాల వల్లే తెలుస్తుంది కాబట్టి..."
   
    నారదుడు మాట పూర్తి చేయకముందే మధ్యలో కామాక్షి కయ్యిమంటు అడ్డు తగిలింది. "మేము అడిగింది మా ఆడవాళ్ళ గురించి మీరేమో మనిషి అంటున్నారు. మనిషి అన్న మాట స్త్రీ లింగానికే కాదు పురుషలింగానికి వర్తిస్తుంది. మాటల గారడి మా మీద ప్రయోగించకండి. వెనకటికి నారాయణమ్మ కధలాగా" అంటూ ఓ సామెత వాడింది.
   
    "ఏమిటా నారాయణమ్మ! ఏమా కధ?" నారదుడు అడిగాడు.
   
    ఛాన్సు దొరికితే వదలని మహా రచయిత్రి మహాదేవి ఉత్సాహంగ ముందుకి వచ్చి కథ మొదలుపెట్టింది.
   
    "అనగనగ ఒక ఊళ్ళో మూడోసారి పెళ్ళాం కూడా చావగా కోరికలు చావని ముష్టి ముదనష్టపు ముసలాడు తొంభయ్ మూడో ఏట ఒకామెని వుంచుకున్నాడు. ఆమె పేరు నారాయణమ్మ. ఓ పర్యాయం ముసలాడికి జబ్బు చేసి ఇంకో అరక్షణంలో చావబోతుండగ ఒకాయన ముసలాడి చెవి దగ్గర తన నోరుపెట్టి "నారాయణ నారాయణ" అన్నాడు అంతే ముసలాడి చెవులకు 'నారాయణమ్మ' అని వినిపించింది. తన కోసం వచ్చింది అనుకొని "ఏది నా.... నారాయణమ్మ!" అంటూ లేచి కూర్చున్నాడు...
   
    "నిన్నిప్పుడు కధలెవరు చెప్పమన్నారు? ప్రతి పత్రికాఫీసుకీ వెళ్ళి కధలు చెప్పి ఆయా పత్రికా ఎడిటర్లు ఆఫీసుల నుంచి పారిపోయేలా చేశావు మళ్ళీ ఈయనగారు కూడా నీ కధ విని పారిపోవాలా ఏంటి?" కయ్యి కయ్యి అంటూ ఎగిరింది కవయిత్రి కాంచనమాల.
   
    "పత్రిక ఎడిటర్లు మగాళ్ళు. రచయిత్రులంటే వాళ్ళకి కుళ్ళు ఈ మధ్య అన్ని పత్రికల్లో మగాళ్ళ రచనలే వేసుకుంటున్నారు. ఈ విషయం ముఖాముఖీలో కాకుండా ముఖాన అడిగానని కుళ్ళు" మహా రచయిత్రి మహాదేవి మండిపడుతూ అంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS