Previous Page Next Page 
ఇట్లు.... నీ చిలక పేజి 2


    గోపాలపురం చిన్న వూరేం కాదు దాదాపు మూడు వందల ఇళ్ళున్న పెద్ద ఊరే. చుట్టుపక్కలున్న చిన్న చిన్న ఊర్లకు పెద్ద దిక్కు లాంటి ఆ ఊరికి ఇటీవలే ఓ బస్సుకూడా వేశారు. అది రెండుసార్లు వచ్చి జనాన్ని టౌనుకి మోసుకెళుతుంటుంది.

    టీ.వీ.లు పెరగడం వల్ల ఆరునెలల క్రితం టౌనులోంచి భరణి వచ్చి డిష్ కనెక్షన్ పెట్టాడు. డిష్ కనెక్షన్లు చూసుకోవడానికి అతను ఆ ఊర్లో ఉండిపోవాల్సి వచ్చింది. పరాయి ఊరుకనుక అతను డిష్ యాంటినా పెట్టుకోవడానికి, ఉండడానికి, అతనికి భోజనం పెట్టడానికి చిత్ర ఒప్పుకుంది.

    ఇంట్లోంచి దొంగిలించుకు వచ్చిన పారిజాతాన్ని ఓ కుర్రాడుక తన నిక్కర్ జేబులో పెట్టుకుని, అప్పుడప్పుడూ దానిని వాసన చూసి, తిరిగి జేబులో పెట్టుకుంటూవుంటే ఆ పువ్వు ఎలా నలిగిపోయి, బలవంతంగా వాడిపోతుందో, చిత్రకూడా అలాగే ఉంటుంది. అయితే పారిజాతానికి ఎంత వాడినా పోనట్టు ఆమెలో వృద్ధాప్యపుఛాయ మొదలయినా ఇంకా అందం ఆ శరీరాన్ని అంటుకునే వుంది.

    అన్నీ వదిలిపెట్టిన అమ్మ వీధికి పెద్దయినట్టు నోరున్న చిత్ర ఆ వూళ్ళో చిన్నపాటి పెద్దమనిషి నీతి తక్కువైందని లోలోపల అందరూ గుసగుసలు పోయినా చివరికి చిన్న చిన్న వ్యవహారాలను తీర్చమని ఆమె దగ్గరికే వెళుతుంటారు జనం.

    భరణి మొదటిసారి ఆ ఊరులోకి వచ్చినప్పుడు డిష్ పెట్టుకోవడానికి అనువైన చోటుకోసం వాకబు చేశాడు.

    "పాతకాలపు మిద్దే అయినా స్ట్రాంగ్ గా వుంది. అందులో ఆ ఇంటి ఓనరైన చిత్ర తప్ప మరెవరూ ఉండరు. పిల్లా పీచు అంటూ ఎవరూ లేరు గనుక నీ సామాన్లు చెక్కు చెదరవు. డిష్ పెట్టుకునేందుకు ఒప్పుకుంటుందేమో వెళ్ళి అడుగు. అయినా మనిషికి డబ్బు పిచ్చి కూడా బాగానే ఉంది. కాబట్టి ఒప్పుకునే అవకాశాలే ఎక్కువ" అని నలుగురయిదుగురు చెబితే భరణి చిత్ర ఇంటికి వెళ్ళాడు.

    అంత వయసొచ్చినా యింకా తన అందాన్ని కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న చిత్రను చూస్తూనే ఆమె భర్త ఓ రోజు రాత్రి చెప్పా పెట్టకుండా పారిపోయాడంటే ఆశ్చర్యం కలగలేదు అతనికి.

    తనను పరిచయం చేసుకుని తాను ఆ ఊరు వచ్చిన పని చిత్రతో చెప్పాడు భరణి.

    "నేనిక్కడున్న రోజులు నా ఆలనా పాలనా నువ్వే చూసుకోవాలి" అని ముగించాడు.

     "ఓ అయిదారేళ్ళు ముందు వచ్చుంటే ఆలనా పాలనాతో పాటు లాలనాని కూడా చేర్చి వుండే వాడివేమో" అని నవ్వింది చిత్ర.

    "ముసలమ్మ చాలా ఫాస్ట్" మనసులో అనుకుని "డిష్ పెట్టుకున్నందుకు, నాకు ముప్పొద్దులా భోజనం పెట్టినందుకు నెలకు వెయ్యిరూపాయలిస్తాను" అని విషయం తేల్చి చెప్పాడు.

    అప్పటివరకు లేని ఓ కొత్తకళ అప్పుడు ఆమె ముఖంలో వాలడాన్ని అతను గుర్తించగలిగాడు. వెంటనే జేబులోంచి డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టి "రేపు సామాన్లు పట్టుకొచ్చేస్తాను" అని వచ్చేశాడు.

    అలా భరణి ఆ ఊర్లో మకాం పెట్టాడు. దాదాపు ఎనభై కనెక్షన్లు ఇచ్చాడు. ఇంటికి యాభైరూపాయలు కాబట్టి నెలకు నాలుగువేల ఆదాయం. అందులో వెయ్యి భోజనం ఖర్చుకింద పోయినా హాపీగా రోజులు గడుస్తున్నాయి భరణికి.

    పెళ్ళికాని కుర్రాడు గనుక అనువైన అమ్మాయి కోసం అతని కళ్ళు వెదకడం ప్రారంభించాయి.

    అదిగో ఆ సమయంలో అతనికి ఇందుమతి తారసపడింది.

    ఇందుమతి ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. డిగ్రీ చదవాలని వున్నా ఇంటి పరిస్థితులు బాగాలేక అంతటితో చదువు ఆపేసింది. రెండు మూడేళ్ళు ఇంటి దగ్గరే వుండిపోయింది. ఆ తరువాత హరికథలు నేర్చుకుంటే మంచి భవిష్యత్తు వుందని ఎవరో అంటే ఓపిగ్గా హరికథలు చెప్పడం కూడా నేర్చుకుంది.

    అదీ పూర్తయింది గానీ ఆ తరువాత ఏం చేయాలో తోచలేదు. ఎక్కడైనా ఉద్యోగం చేయాలని ప్రయత్నించింది గానీ కుదరలేదు. ఇంట్లో కాలక్షేపం కూడా జరగక బోర్ గా ఫీలవుతున్న సమయంలో భరణి ఆ ఊర్లో డిష్ పెట్టాడు.
   
    రోజూ రాత్రయితే టీ.వీ. చూడడానికి ఇందుమతి సరస్వతి పిన్ని ఇంటికి వెళ్లేది.

    ఇందుమతి ఇల్లు ఊరికి ఓ కొసన వుంటే సరస్వతి పిన్ని ఇల్లు మరో కొసన వుండేది. పొద్దు పోగానే భోజనం చేసి పిన్ని ఇంటికి వెళ్ళి టీ.వీ. చూస్తూ గడిపేది. ఏ తొమ్మిదింటికో తిరిగి ఇంటికి చేరుకునేది.

    ఆ రోజు ఏదో పండగ. టీ.వీ.లో స్పెషల్ ప్రోగ్రామ్ లు వస్తుంటే ఇందుమతి చూస్తూ వుండిపోయింది. తొమ్మిదింటికి ఇంటికి వెళ్ళలేక పోయింది. స్పెషల్ ప్రోగ్రామ్ తరువాత మంచి సినిమా వస్తుంటే అలా చూస్తూ వుండిపోయింది.

    సినిమా పూర్తయ్యేటప్పటికి పన్నెండు పైగానే అయింది. బయటికి వచ్చి చూస్తే ఊరు ఊరంతా చీకటి సముద్రంలా వుంది. ఆ సముద్రంలో ఈదులాడుతున్న సీల్ చేపల్లాగా కుక్కలు తోకలు ఆడిస్తున్నాయి. ఆ సమయంలో ఇంటికి ఒంటరిగా వెళ్లడం భయమనిపించింది. ఇప్పుడేం చేయాలా అనుకుంటూ వుండగా సరస్వతి బయటికి వచ్చింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS