Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 65

   

      ఆమె ఫోన్ దగ్గరకు పరుగెత్తి - అట్నుంచి 'పావని హియర్' అని వినపడగానే "నేనూ సాహితిని" అంది కంగారుగా. ఆ కంగారులో వెనుకనుంచి అతడు లేవటం గుర్తించలేదు. ఆమె చెప్పబోతూ వుంటే ఒక్కసారిగా వీపు దగ్గర మంట బయల్దేరింది. రామనాథం కసిగా ఆమె డొక్కల్లో కత్తితో పొడిచాడు. ఆమె కెవ్వున అరిచి వెనుదిరిగింది. అతడు మళ్ళీ కత్తి ఎత్తాడు.
   
    .....అయిదు నిమిషాల తరువాత పావని హడావుడిగా అక్కడికి వచ్చేసరికి ఇద్దరూ చెరోవైపు పడివున్నారు.
   
    సాహితి చుట్టూ రక్తం మడుగు కట్టింది. బాణం దెబ్బ తగిలిన పక్షిలా వుంది ఆమె.
   
    పుట్టుకతోనే డబ్బులో పడేసిన 'విధి', ఆనందం కుంచెతో అరిస్టోక్రసీ పలకమీద ఓనమాలు దిద్దించి, లెక్కలేనన్ని మలుపుల మడతల్లో జీవితాన్ని తిప్పి, బాల్యపు చైత్రంలో హేమంత చిత్రాల్నీ, యవ్వనపు మాఘంలో విషాదాల్నీ, చివరి ఆషాఢంలో గ్రీష్మ తాపాల్నీ సృష్టించి కబళించివేస్తోంది.
   
    "సాహితీ.... సా....హి....తీ...." అంది పావని ఆమెని చేతుల్లోకి తీసుకుంటూ సాహితి కళ్ళు అప్పటికే మూతలు పడుతున్నాయి. "వాడు....వాడు చచ్చాడా...?" అని హీనకంఠంతో అడిగింది.
   
    పావని తలతిప్పి చూసింది. రామనాథం స్పృహతప్పి పడున్నాడు. శ్వాస భారంగా తీస్తున్నాడు. "ఏమిటి? ఏం జరిగింది?" అనడిగింది పావని ఆమె తల చేతుల్లోకి తీసుకుని.
   
    "పావనీ! నాకు.....నాకు ఒక సాయం చేస్తావా?"

    "చెప్పు సాహితీ! తప్పకుండా చేస్తాను" అంది ఆమెని పొదివి పట్టుకుని. ఆమె శరీరం నుంచి ఒక్కొక్క ప్రాణమే పోవటం తెలుస్తూంది.
   
    ఆమె కంఠం పెగుల్చుకుని అంది- "అమ్మ అస్థికలు ఇంకా గంగలో కలపలేదు." ఆమె ఏం చెపుతుందో అర్ధంకాక పావని ఆమెవైపే సందిగ్ధంగా చూసింది.
   
    సాహితి గొంతు హీనంగా పలికింది. "నాకు నా వాళ్ళు ఎవరూ లేరు. అమ్మ అస్థికలు గంగలో కలిపే ఏర్పాటు చేస్తావా.....?" జాలిగా అడిగింది.
   
    పావని కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్ళు చిప్పిల్లాయి. జీవితంలో ఎన్నో విషాద చిత్రాలు చూసిన పావనే, ఆమె కోరిక విని కదిలి పోయింది. బ్రతికినంతకాలం ఆ అమ్మాయి ఎంత ఒంటరితనం అనుభవించిందో, మానసికంగా ఎంత క్రుంగిపోయిందో చెప్పటానికి ఆ ఒక్క కోరికా చాలు.....ఆమెని మరింత హత్తుకుంటూ "తప్పకుండా" అంది సజల నయనాలతో.
   
    సాహితి అతికష్టం మీద చెయ్యి పైకి ఎత్తింది. "అమ్మ అస్థికలు కలపటానికి ముందు ఆ దుర్మార్గుడు ....పరమ.... హంస...అస్థికలు....గంగలో.....క....ల....వా....లి....అలా... అని... వా...గ్దా....నం....చే...స్తా....వా?"
   
    పావని ప్రళయకాల తరుశాఖాంత పుష్పంలా కదిలిపోయింది.
   
    "ఎంత వ్యధ ననుభవించి ఉంటావు నేస్తం! నీ బాధ నేను అర్ధం చేసుకోగలను. తీయటి అనుభూతుల పక్కమీద, అందమైన అనుభూతుల దోమతెరలో పడుకోవలసిన సమయంలో తండ్రిగా ప్రవేశించాడు. ప్రతి ఉదయం, తొలి ప్రత్యూష కిరణం స్వచ్చంగా లేవవలసిన లేలేత వయసులో తుఫాను సృష్టించాడు. తండ్రి వరస మరిచి తనువు కోరాడు. తల్లిని చంపాడు. బ్రతికినంతకాలం బాధనే మిగిల్చాడు. నీ కసి నేను అర్ధం చేసుకోగలను. నీ కోరిక తీరుస్తాను-"
   
    పావని సాహితి చేతిలో తన చెయ్యి వేసింది. ఆమె పెదవుల మీద ఆనందపు ఆఖరి చిరునవ్వు..... ఆకాశం నుంచి రాలిపడిన నక్షత్రం ఢీ కొన్న మేఘాల మధ్య..... ఉరుముల దాడికి నలిగి-మెరుపు వేడికి కాలి-అనంతానంత శూన్యంలో కలిసిపోయింది. ఎక్కడో పుట్టిన పాప.....ఎక్కడో పెరిగిన మనుషుల మధ్య ఇమడలేక అనంత విశ్వంలోకి వెళ్ళిపోయింది.
   
    ......
   
    బయట వర్షం కాస్త తగ్గినా, కిటికీ అద్దాల మీద నీతి చినుకుల చప్పుడు అలాగే వుంది. రామనాథం స్పృహలోకొచ్చి కదిలాడు. పావని తెప్పరిల్లి అతడిని చూసింది.

    "నన్ను....ఆస్పత్రికి తొందరగా తీసుకెళ్ళండి. ప్రాణాలు పోతున్నాయి."
   
    పావని సాహితి శరీరాన్ని నేలమీదకు జార్చింది. ఆమె చుట్టూ రక్తం గడ్డకడుతూంది. పావని రామనాథం దగ్గరికి వచ్చింది.
   
    "ఆస్పత్రి..... అంబులెన్స్.....అంబులెన్స్...." గొణుగుతున్నాడు. ఆమె అతడిని కష్టంమీద రెండు చేతులతో ఎత్తి బయటకు తీసుకొచ్చింది. మొత్తం భారమంతా ఆమెమీద వేశాడు. కదులుతూన్న మాంసం ముద్దలా వున్నాడతను. ముక్కు చితికి, కళ్ళక్రింద చర్మం పగిలి, తలనుంచి ధారాపాతంగా కారే రక్తంతో తడిసి, ఫ్రాంకెన్ స్టేన్ లా వున్నాడు. మరో అయిదు నిమిషాల్లో ఆస్పత్రికి చేర్చకపోతే బ్రతకటం కష్టం.
   
    ఆమె అతడిని కారులోకి చేర్చి స్టీరింగ్ దగ్గర కూర్చుని స్టార్ట్ చేసింది.
   
    వర్షాన్ని చీల్చుకుంటూ కారు బయల్దేరింది. "థాంక్స్" అస్పష్టంగా అతడు గొణిగాడు. అంతలో డెలీరియం మొదలైంది. ముందుకు కూలిపోయాడు. ఆమె దీన్ని పట్టించుకోవటం లేదు. చీకట్లోకి చూస్తూ డ్రయివ్ చేస్తోంది. "దాహం.....దాహం." అంటున్నాడు. ఆమె పట్టించుకోలేదు, ఏకాగ్రత అంతా డ్రైవింగ్ మీదే నిలిపింది.
   
    ....పది నిమిషాలైంది. కారు వంతెన మీదకు చేరుకుంది. క్రింద నీటి ప్రవాహం ఉధృతంగా వుంది.
   
    ఆమె కారు ఆపుచేసింది. ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. బయట మెరిసినప్పుడు రామనాథం మరింత భయంకరంగా, వికృతంగా కనబడుతున్నాడు. మనసు వికృతంతో పోల్చుకుంటే అది చాలా తక్కువ. ఆమె అతడివైపు చూసింది. నలుగురిలో తనని దోషిని చేయటం, భర్త తనని కొడుతుంటే, ఎవరూ చూడకుండా కన్నుకొట్టి విజయగర్వంతో నవ్వటం గుర్తొచ్చాయి.
   
    ఆమె అలాగే వేచివుంది అతని నాడి పరీక్షిస్తూ.
   
    అలాగే చూస్తూకూర్చుంది.
   
    రెండు నిమిషాల తర్వాత అతని ప్రాణం పోయింది.
   
    ఆమె కారులోంచి అతని శరీరాన్ని బయటకు లాగి వంతెన అంచువరకూ తీసుకెళ్ళింది. "సారీ రామనాథం! నువ్వు నాకు చేసిన ద్రోహానికి నీ కళేబరాన్ని చేపలకి ఆహారంగా వేయక తప్పటంలేదు" అంటూ క్రిందికి తోసేసింది.
   
    ప్రవాహంలో అతడి శరీరం కొట్టుకుపోయింది.
   
    ఆమె వేగంగా సాహితి ఇంటికి తిరిగొచ్చింది. ఆమె ఇంకా అలాగే పడివుంది. పావని కర్చీఫ్ తో ఫోన్ ఎత్తి పరమహంసకి రింగ్ చేసింది. అతని కంఠం అట్నుంచి 'హల్లో' అని వినబడగానే "అంకుల్! నేనూ.... సాహితిని! నువ్వు అర్జెంటుగా రాగలవా....." అని అతని సమాధానం వినకుండా ఫోన్ పెట్టేసింది. ఈ వర్షం సబ్దంలో అతడు తన కంఠం గుర్తుపట్టటం కష్టం అని ఆమెకి తెలుసు.

    ఆ తర్వాత ఆమె రామనాథం చేతినుంచి పడిపోయిన కత్తిని తీసుకుని బయటకు వచ్చింది. ముఖద్వారం హేండిల్ కి దాన్ని దారంతో కట్టింది. చీకట్లో అది కనబడటంలేదు. పిడిని జేబురుమాలుతో శుభ్రంగా తుడిచింది. తలుపు దగ్గరగా వేసి, చీకట్లో నిలబడింది. ఆమె ఈ పనంతా నిశ్శబ్దంగా, ఏ మాత్రం తొణక్కుండా ఒక ప్రొఫెషనల్ లా చేసింది.
   
    అంతలో దూరంగా చప్పుడైంది. పరమహంస పోర్టికోలో కారు ఆపి లోపలి ప్రవేశించాడు. డోరు హేండిల్ ని చేత్తో పట్టుకుని తోశాడు. తలుపు తెరుచుకుంది. అతని కనుమానం రాలేదు.
   
    బెడ్ లైట్ వెలుతుర్లో సాహితి సోఫామీద పడుకొని వుండటం కనిపిస్తోంది. "ఎందుకిలా చీకట్లో పడుకున్నావు?" వెళ్ళి పక్కన కూర్చుంటూ అడిగాడు.
   
    ఈ లోపులో బయట పావని దోర్ హేండిల్ కున్న కత్తి విప్పింది. కిటికీలోంచి లోపలకు విసిరేసింది.
   
    "ఏమిటా చప్పుడు?" అంటున్నాడు పరమహంస. ఆమె మెయిన్ గేటు బయటకు వచ్చింది. కుడివైపు ప్రహరీ గోడ ప్రక్కగా తన కారు నిలబెట్టబడి వుంది. దూరంగా ఇద్దరు పోలీసులు బీటు మీద వస్తున్నారు.
   
    లోపల "ఏమిటీ తడి? ఏడుస్తున్నావా? చిన్నపిల్లలా నీ గురించి నాకు తెలీదూ? ఒంటరిగా వుండి భయంవేసి వుంటుంది. ఇకనుంచీ నేను నీతోపాటూ ఉంటాన్లే. నాతో గడపటం వల్ల ఈ రాత్రినుంచీ నీ జీవితమే మారిపోతుంది. భగవంతుడి అంశ నీలో ప్రవేశించి పునీతురాల్ని చేస్తుంది" అంటూ ఆమెని తడిమాడు. తడి తగిలింది.
   
    "ఏమిటి ఏడుస్తున్నావా?" అన్నాడు. అప్పుడు వినబడింది ఆర్తనాదం లాంటి కేక.
   
    కార్లో కూర్చుని కేక పెట్టిన పావని, వెంటనే కారు స్టార్టు చేసి, బంగళా ముందుకి తీసుకొచ్చి లోపలికి ప్రవేశించింది. కారు దిగి పరుగెత్తుకుంటూ మెట్లు ఎక్కింది.
   
    సైకిళ్ళ మీద వస్తూన్న బీటు కానిస్టేబుళ్లు మొహాలు చూసుకున్నారు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS