Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 5


    ఆడదంటే జయలలిత!


    నాయకురాలంటే జయలలిత!


    మినిష్టర్ విజయకుమారికి జయలలిత సినిమా రోజుల నుంచే అభిమాని!


    ఇప్పుడు తనకి జయలలిత రాజకీయంగా కూడా ఆదర్శం!


    ఆ లెవెలుకి ఎదగాలి తను.


    త్వరగా...త్వరత్వరగా....


    కానీ జయలలిత చెయ్యని తప్పూ, తను చేసిన తప్పూ ఒకటి ఉంది.


    అదే....పెళ్ళి...పెళ్ళి చేసుకోవడమే తను చేసిన మేజర్ మిస్టేక్.


    పెళ్ళీ, మొగుడూ, కొడుకూ....


    అబ్బ! తన రాజకీయ జీవితానికి అడ్డంకులు.


    రాజకీయాలన్న తర్వాత నలుగురితో కలిసి ఉండాలి. నానా రకాలైన పనులు చెయ్యాలి. నానా గడ్డీ కరవాలి.


    ఇవన్నీ చెయ్యకుండా సీతమ్మ తల్లిలా ఉండాలంటే ఈ ఫీల్డులో కుదుర్తుందా? ఇవి రాజకీయాలా? మజాకానా?


    వేదికమీది కుర్చీలో అసహనంగా కదిలింది విజయకుమారి. మైకు దగ్గర ఎవడో కర్ణకఠోరంగా వాగుతున్నాడు. రొటీన్ వాగుడే! తను వినకపోయినా ఫర్వాలేదు. వినాల్సింది ఎప్పుడంటే...వాగేవాడు ఏదన్నా మెలిక పెట్టి తనని ఇరికించడానికి చూసినప్పుడు మాత్రమే.


    ఇక్కడ అలాంటి డేంజర్ లేదు.


    ఇక్కడందరూ తన మనుషులే.


    తనముందు తోకాడించే సాహసం వీళ్ళలో ఎవడికీ లేదు. అట్లా కంట్రోల్లో పెట్టింది తను.


    జయలలితలాగా తనకీ ఫుల్ పవర్స్ ఉంటేనా, ఒక్క సంవత్సరం తిరిగేలోగా ఎర్రకోటలోనే పాగా వేసేస్తుంది.


    ఢిల్లీకే రాణి అయిపోతుంది!


    కానీ - వెధవది... తనకి పక్కలో బల్లెంలాంటి మొగుడూ, కంటిలో నలుసు లాంటి కొడుకూ...


    కుర్చీలో అసహనంగా కదిలింది విజయకుమారి.


    దానికి తోడు....


    చెవిలోని జోరీగలా ఇక్కడ వీడి వాగుడు.


    ఏమిటి?


    బాలల వికాసం... వాళ్ళ అవసరాలు... ప్రభుత్వ పథకాలు... నా బొందా... నా బోలె! పన్లేదు వెధవలకి.


    వేదిక మీద మాట్లాడాల్సిన వాళ్ళు ఇంకా అనేకమంది ఉన్నారు.


    కింద ఉన్న జనంలో బాలలు తక్కువ. యువజన కార్యక్రమాలకు తెచ్చే రౌడీ మూకలనే ఈ బాలల కార్యక్రమాలకి కూడా తెచ్చేసినట్లున్నాడు సంజీవ్.


    బాలల్లాగా లేరు వెధవలు... బడితేల్లాగా ఉన్నారు.


    ఆ ఉన్నవాళ్ళ పిల్లల్లో... అదిగో... ఆ మూల... వెనగ్గా కూర్చుని ఉన్నాడే... చిన్న పీటలాంటి బండి... నాలుగు చిన్న చిన్న ఇనప చక్రాలూ, ఆ చిన్న బండికే ఒక స్టీరింగూ... ఎవడు దయతలిచి పెట్టాడో మరి...బండికి ముందువైపు చిన్న రేకు ముక్క... దానికి నల్ల పెయింటు... దానిమీద తెల్ల పెయింటుతో వున్న "రాజా.... నెంబర్ వన్" అనే అక్షరాలు... నోట్లో ఒక ప్లాస్టిక్ విజిలూ...


    నవ్వొచ్చింది మినిస్టర్ విజయకుమారికి.


    ఈ వెధవ ఆ పీటలాంటి బండినే మారుతీ కారు అని ఊహించుకుంటూ రోడ్ల మీద రయ్యిన తోసుకుంటూ, విజిలేస్తూ వెళతాడేమో!


    ఆమెకి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది.


    ఇంత చిత్రంగా వున్న ఈ పిల్ల వెధవకి తనో పది రూపాయలు చేతిలో పెట్టి, ఒక స్నాపు లాగించేసి పేపర్లలో వేయించుకుంటే...?


    అదిరిపోతుంది పబ్లిసిటీ.


    మంత్రిగారి దాతృత్వం అదీ ఇదీ అని పేపర్లలో పడుతుంది.


    వెంటనే తన పి.ఏ.ని పిలిచింది మినిస్టర్ విజయకుమారి.


    ఆ పోరగాణ్ని పోకుండా ఆపి ఉంచమంది.


    వినయంగా తల పంకించి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు పి.ఏ.


    మళ్ళీ ఆలోచనలు గిర్రున తిరగడం మొదలయ్యాయి.


    తన మొగుడికి తనంటే పడదు. డైవర్స్ కోసం అప్లయ్ చేస్తానంటాడు. మొన్నటికి మొన్న వీధిలో నిలబడి పెద్ద గొడవ...అప్పుడే ఆ గొడవంతా పేపర్లలో వచ్చేసింది...ఉన్నదానికి ఇంకాస్త మిర్చీమసాలా జోడించి...


    తన పర్సనల్ లైఫ్ ఎట్లా అన్నా తగలడనీ...ప్రజల్లో మాత్రం మంచి ఇమేజ్ ఉండాలి... లేకపోతే ముందు ముందు తను అనుకున్నవన్నీ సాధించలేదు. తాళి అంటే మన ఆడోళ్ళకి పిచ్చి సెంటిమెంటు. తాళి కట్టినవాడు విడాకులిచ్చాడంటే ఆడవాళ్ళ ఓట్లు తనకి పడవేమో అని భయం.


    కానీ ఈ మొగుడు ఊరుకునేటట్లు లేడు.


    విడాకుల దాకా పోయేలోగానే "యాక్సిడెంట్" చేయించి మొగుణ్ని చంపి పారేయిస్తే...


    దెబ్బతో పీడా వదిలిపోతుంది.


    కానీ మహా జాగ్రత్తగా వుండాలి తను.


    మర్డర్ కేసులో ఇరుక్కుంటే మాత్రం మట్టిలో కలిసిపోతుంది తన రాజకీయ జీవితం.


    మైకు ముందు వ్యక్తి మారాడు. ఓహో వీడా? వీడికి మైకుని చూస్తే మైకం వచ్చేస్తుంది. వటవట వాగేస్తున్నాడు. మధ్య మధ్యలో పాటలు కూడా పాడెస్తున్నాడు. సినిమా పాట!


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS