Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 4


    ఆ ఫిల్ము సంజీవే తీయించి ఉన్నా ఆశ్చర్యం ఏమీ లేదు. తనకు తెలుసు. సంజీవ్ కి ఉచ్ఛం, నీచం లేవు.


    ఆ కేసెట్ ని గ్రిప్ లో పెట్టుకుని, తననే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సంజీవ్! సర్కస్ లో సివంగిని ఆడించినట్లు ఆడిస్తున్నాడు.


    తనతోబాటే తన కొడుకు కూడా బాగుపడాలనుకుంది తను సహజంగానే.


    కానీ తన బాగు తను చూసుకునే పద్ధతిలో ఉన్నాడు తన కొడుకు.


    అదీ సహజమేగా!


    ఏం చెయ్యగలదు తను?


    దిసీజ్ లైఫ్!


    నిట్టూర్చింది విజయకుమారి.


    ఆమె చాలా యాంబిషస్.


    తమిళనాడు చీఫ్ మినిస్టర్ జయలలితా జయరామ్ విజయకుమారి ఆదర్శం! తను అంత లెవెలుకి ఎదగాలన్నది ఆమె కోరిక.


    జయలలిత ఒకప్పుడు సినిమా హీరోయిన్. యం.జి.ఆర్. తో చాలా చిత్రాల్లో నటించింది. యం.జి.ఆర్. ద్వారానే రాజకీయాల్లోకి వచ్చింది. రాజకీయంగా యం.జి.ఆర్. కి అత్యంత సన్నిహితం అయ్యింది. యం.జి.ఆర్. చనిపోగానే జయలలితని రాజకీయంగా తోక్కెయ్యాలని తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి. యం.జి.ఆర్. అంత్యక్రియల సందర్భంలో జరిగిన ఊరేగింపులో, ఆయన శవం ఉన్న గన్ కేరేజ్ మీదకి జయలలితని ఎక్కనివ్వలేదు తక్కిన నాయకులు. కిందికి తోసేశారు. నానా దుర్భాషలాడారు. ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీలో కూడా ఆమెకి ఘోర పరాభవం ఎదురయ్యింది. డి.యం.కె. అధినేత కరుణానిధి అనుచరుడు ఒకడు దుశ్శాసనుడిలాగా జయలలితని నిండు శాసనసభలో వస్త్రాపహరణం చెయ్యాలని చూశాడు.


    ఈ ఆటుపోట్లు అన్నీ నిబ్బరంగా తట్టుకుంది జయలలితా జయరాం.


    ఇంతలో రాజీవ్ గాంధీ హత్య జరిగింది.


    ఆ హత్యకు వెనక ఉన్న దుష్టశక్తి ఎల్.టి.టీ.ఈ. అనీ, వెన్నుతట్టి వాళ్ళకి తమిళనాడులో ఆశ్రయం ఇచ్చింది కరుణానిధి అనీ ప్రజల మనసులో బాగా పడిపోయింది.


    దానితో ఎలక్షన్లలో డి.యం.కె.కి నామరూపాల్లేకుండా చేశారు ప్రజలు. మొత్తం డి.యం.కె. పార్టీ తరఫున కరుణానిధి ఒక్కడే మద్రాసు హార్బరు సీటు గెల్చుకున్నాడు. తన పార్టీకి ఏకైక ప్రతినిధిగా శాసనసభలో కూర్చోవడం చిన్నతనం అనుకున్నాడో, లేకపోతే అంతమంది జయలలిత మద్దతుదార్ల మధ్య తన పరువు తీసేస్తారని భయపడ్డాడోగానీ, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చేశాడు.


    ఇంక జయలలితకి తమిళనాడులో ఎదురనేది లేకుండా పోయింది. ఆమె కాళ్ళు పట్టుకునే లెవెలుకన్నా దిగజారిపోయి కాళ్ళు నాకే లెవెల్లో సెటిలయిపోయారు పార్టీలో తక్కిన నాయకులు. స్త్రోత్రాలూ, భజన కీర్తనలూ అమరికీ కంఠోపాఠం అయిపోయాయి. జయలలిత విశ్వరూపాన్ని ప్రజలకు తెలియబరుస్తూ తమిళనాడు అంతా 'కట్ అవుట్లు" వెలిశాయి. యూనివర్శిటీలు ఆమెకి డాక్టరేట్లు యివ్వడానికి వంతులు పడ్డాయి. 'పురచ్చితలైవి' (విప్లవ నాయిక) అనే బిరుదు యిచ్చారు.


    ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జయలలితకి జరిగిన "పట్టాభిషేకం" మరొక ఎత్తు.


    ఈ "తమాషా" మొన్న మదురైలో జరిగింది.


    మినిస్టర్ విజయకుమారి జయలలిత అభిమానిగా ఆ ఉత్సవానికి హాజరయ్యింది కూడా.


    పేరుకి మాత్రం ఆ ఉత్సవం ఎ.ఐ.ఎ.డి.యం.కే. పార్టీ పవరులోకి వచ్చినందుకు జరిగిన విజయోత్సవం.


    కానీ నిజానికి అది జయలలితని తమిళనాడుకి మహారాజ్ఞిగా అభిషేకిస్తున్నట్లు ప్రజలలో ఒక భావన కలిగించడానికి జరిగిన ప్రయత్నమే.


    అందులో తప్పేముందీ?


    రాజకీయాల్లో అలాంటి "షో" తప్పదని అందరికీ తెలుసు.


    అందులో జయలలిత తనే స్వయంగా సినిమా హీరోయిన్. ఇంకో సినిమా హీరోకి రాజకీయ వారసురాలు.


    పబ్లిసిటీ జిమ్మిక్సు ఆమెకి తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తాయి?


    "ఆ "పట్టాభిషేకం" కోసం జయలలిత భక్తుడు ఒకడు 113 కిలోల బరువు వున్న వెండి సింహాసనాన్ని కేవలం పదమూడు లక్షల రూపాయల ఖర్చుతో చేయించుకు వచ్చాడు. ఆ వెండి సింహాసనానికి ఎరుపు రంగు ముఖమల్ దిండ్లు అమర్చి వున్నాయి. వెండి ముఖమల్ తో తయారుచేసిన మాచింగ్ పాదపీఠం కూడా ఉంది.


    దానికి తోడు ఒక కిరీటం కూడా చేయించారు. బంగారు తాపడం చేసిన ఆ కిరీటంలో వజ్రవైఢూర్యాలు పొదిగారు. వంటిమీద "జయలలిత పచ్చబొట్లు" పొడిపించుకున్న వీర భక్తులూ, స్త్రోత్ర పాఠాలు జపిస్తున్న మంత్రి పుంగవులూ క్యూలో నిలబడి ఆమెకి పాదాభివందనాలు చేశారు.


    ఈ సందట్లో 150 అడుగుల ఎత్తున్న జయలలిత కట్ అవుట్ ఒకటి విరిగిపడి అనేక మందికి తీవ్రమైన గాయాలు తగిలాయి. అలాగే తమిళనాడులో యింకా చాలా చోట్ల కూడా 'విప్లవ నాయిక" కట్ అవుట్లు విరిగిపడడమూ, జనం నడ్డి విరగడమూ జరిగింది.


    ఇవాళ జయలలిత పేరు చెబితే అదిరిపడి, టాయిలెట్ కి పరిగెత్తే స్థితిలో వున్నారు తక్కిన నాయకులు.


    అలాంటి మిలిటరీ డిసిప్లిన్ మెయిన్ టెయిన్ చేస్తోంది ఆమె.


    జయలలితకి పార్లమెంటులో పట్టుమని పదిమంది మెంబర్లు కూడా లేరు. వాళ్ళని అడ్డం పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంటుని ఒక ఆట ఆడించేస్తోంది. లెక్కలేనన్ని ప్రాజెక్టులు జబర్దస్తీగా తన రాష్ట్రానికి శాంక్షన్ చేయించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో సింగరేణీ కాలరీస్ ని కోల్ ఇండియాలో కలిపేసి దాన్ని కూడా తన రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితం చెయ్యాలని చూస్తోంది. కావేరీ జలాలను గురించి కర్ణాటక రాష్ట్రంతో తమిళనాడుకి తరతరాలుగా ఉన్న తగాదాని గెలిచి, బంగారప్ప నీరుకారిపోయేటట్లు చేసింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS