Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 4


    "వెల్! నా చెల్లి తరపున నేను హామీ యిస్తున్నాను."
    
    "డన్" అంగీకారంలా బొటనవేలిని పైకెత్తి చూపించాడు సూరి.
    
    కురుక్షేత్ర సంగ్రామానికి మూలం జూదమైతే ఇక్కడ మరో సమరానికి అంకురార్పణ జరిగింది.
    
    అణువంత ఆలోచనల విచ్చేదనమే ఎన్నో మారణహోమాలకు కారణమయితే ఇక్కడ ఓ బడబాగ్నికి నిప్పు రగిలింది.
    
    రక్తంతో తడిసిన చాలా చరిత్ర పుటలకి ప్రారంభం చిన్నమాట పట్టింపు అన్న సత్యమే నిజమయితే, ఇదిగో ఇక్కడ తొందరపాటుగా ఒక మాట సవాలుగా మారింది, యజ్ఞానికి రంగం సిద్దమయింది.
    
    సుమారు వందమంది విద్యార్ధినీ, విద్యార్ధులు టెన్షన్ గా చూస్తున్న సమయంలో సూరి బయటకు నడవబోతుంటే అడ్డంగా వచ్చాడు శౌరి.
    
    "కీస్ కావాలా?" అన్నాడు కారు తాళాలు గాలిలో వెళ్ళాడదీస్తూ "మరేంలేదు ఈలోగా నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవచ్చుగా?"
    
    "నా సంగతి అటుంచి మంచి లిప్ స్టిక్ సంపాదించి మీ చెల్లికి ప్రెజెంట్ చెయ్."
    
    "దేనికి?"
    
    "నీ కీస్ అవసరంలేకుండా మా వాడికి మీ చెల్లివ్వబోయే "కిస్" కి ఇబ్బంది లేకుండా.
    
    "ఎవడా మీ వాడు?"
    
    "గోల్డ్ మెడలిస్ట్ ప్రస్తుతం ఇంజనీరింగ్ స్టూడెంట్."
    
    వెంటనే గుర్తుకురాలేదు శౌరికి. గోల్డ్ మెడలిస్ట్ అయితే మాత్రం, పుస్తక పరిజ్ఞానం లేదు, ప్రపంచజ్ఞానం లేదు.
    
    "పేరు పుల్లారావు?" అన్నాడు శౌరి ఎగతాళిగా.
    
    "కాదు....ఆదిత్య."
    
                                                               * * *
    
    "ఒరే... అదీ! ఏమిటా పాడు నిద్ర... చెప్పేది వినకుండా?' ఒడిలో తల పెట్టుకుని పడుకున్న మనవడ్ని కుదిపింది లక్ష్మమ్మ.
    
    "లేదు నాన్నమ్మా... వింటున్నా" నాన్నమ్మవైపు చూశాడు ఆదిత్య.
    
    రాత్రి భోజనాలయ్యాక ఓ అరగంటసేపు బామ్మ ఒడిలో తల పెట్టుకుని రిలాక్స్ కావడం ఆదిత్యకి అలవాటయితె, ఎప్పుడో చనిపోయిన భర్త స్వాతంత్ర్య సంగ్రామ విశేషాలు కథలు కథలుగా చెప్పడం లక్ష్మమ్మకలవాటు.
    
    "అలా ఒకనాడు అల్లూరి సీతారామరాజుని కలుసుకున్న మీ తాతయ్య అతనితోపాటు మన్యంలో రెండు రోజులుండి అక్కడ పరిస్థితికి పులకించి పోయారట. ఇంటికి తిరిగి వచ్చేద్దామన్న ఆలోచన చెరిగిపోవటానికి కారణం సీతారామరాజుతో జరిగిన పరిచయమే అనేవారు."
    
    "ఎందుకు తిరిగొచ్చేద్దామనుకున్నాడు తాతయ్య?" అడిగింది ఆదిత్య కాదు..... అనిత ఆదిత్య చెల్లెలు. సెంట్ జోసెఫ్ కాలేజీలో బి ఎస్సీ చదువుతున్న అతనికి తాతయ్యంటే మహా ఆరాధన."    
    
    "ఎందుకు తిరిగొచ్చేద్దామనుకున్నారూ అంటే ఏం చెప్పను? తరచూ నేను గుర్తుకొచ్చేదాన్నట."
    
    "మరి సీతారామరాజుని కలుసుకుననక మనసెందుకు మార్చు కున్నాడట?" అని ఉత్కంఠగా అడిగింది.
    
    "తనవాళ్ళందరినీ వదిలి అడవిలో కందమూలాలు తింటూ బ్రతికే ఆ మహానుభావుడి త్యాగనిరతికి చలించి...." ఆయాసంతో చెప్పలేకపోయింది. అయినా చర్చని తుంచేయలేదు.
    
    ఆదిత్య నాన్నమ్మనే రెప్పలార్పకుండా చూస్తున్నాడు.
    
    ఆమె ముఖంలో జీవకళ నశించిపోతోంది. ఉత్సాహాన్ని అభినయిస్తోందో లేక అది వయసుకు సహజమైన నిస్త్రాణతో అతను అంచనా వేయలేకపోతున్నాడు.
    
    ఎన్ని దశాబ్దాల పోరాటమది! పుట్టిన బిడ్డల ఆసరాతో బ్రతకాల్సిన వయసులో యింకా తమని బ్రతికించాలని ఆరాటపడుతోంది. ఈ ప్రపంచంలో అందరూ పోగా లక్ష్మమ్మకి మిగిలింది ఆదిత్య, అనితలే. బహుశా తన అలసటనీ, కష్టాన్నీ మరిచిపోవటానికి ఎప్పుడో దశాబ్దాల క్రితం మనసులో పదిలంగా వుంచుకున్న కథల్ని పనిగట్టుకుని చెబుతూ పరవశించిపోతుంది.
    
    ఆదిత్య తరచి చూడటం బొత్తిగా నచ్చలేదేమో- "చూపులు చాలు గాని అసలు సంగతి వినరా బడుద్దాయ్! మీ తాతయ్య నన్ను విడిచి స్వతంత్ర పోరాటానికి వెళ్ళినా, నేను చేసే పచ్చళ్ళని మాత్రం మరిచిపోలేకపోయారు. నవ్వకు! ఆ విద్య ఇంతకాలంగా నీ చెల్లిని బ్రతికిస్తున్నది. అందులోనూ మీ తాతయ్యకి ఉసిరికాయ పచ్చడంటే మరీ ప్రాణం. అందుకే రెండు మూడు నెలలకోసారి హఠాత్తుగా ప్రత్యక్షమై సీసాడు పచ్చడి తీసుకుపోయేవారు. జిహ్వచాపల్యం.....మీ తహతయ్య మాత్రమే కాదురోయ్... పటేల్ గారికీ నా పచ్చడంటే పరమప్రీతి అంటూ తెగ మెచ్చుకునేవారనుకో" నిస్సత్తువగా క్షణం ఆగింది.
    
    "ఇక చాలు నాన్నమ్మా!" అంటే నానమ్మ ఎంత కోపగించుకునేదీ ఆదిత్యకి తెలుసు. అందుకే రొప్పుతున్న ఆమె వాక్ర్పవాహాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోయాడు.
    
    ఏడు దశాబ్దాల నిరంతర కృషితో తన కళ్ళముందే ఒక తరం అంతరించి పోగా మరోతరానికి వెలుగునందించాలని కొడిగట్టన దీపం ఇంకా పడుతున్న ఆరాటమది.
    
    అస్థిపంజరంగా మారి కూడా ఇంకా మిగిలిన శక్తిని ఆస్థిగా మార్చి ఆసరా ఇవ్వాలనే ఉబలాటం.
    
    "నాన్నమ్మ కేమౌతుంది?"
    
    భయం చుట్టుముడుతుంటే ఓ పసికందుని పొదివి పట్టుకున్నట్టు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
    
    ఆమెకింకా మాట్లాడాలనే వుంది. అయినా బలవంతంగా లోపలికి నడిపించాడు.
    
    "ఇక పడుకోవే!"
    
    గదిలో ఓ మూల సీసాలో నిండా పచ్చళ్ళు, పెచ్చులూడిన గోడల నడుమ దండెంపై నాన్నమ్మ ఆరేసిన అనిత ఓణీలు, దశాబ్దం వయసునన్న వారు మంచం.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS